మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
7
క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తనభరా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా .
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా
శ్రీశంకరులు ఇప్పుడు అమ్మ స్వరూపాన్ని క్లుప్తంగా వర్ణిస్తున్నారు.
కాంచి అంటే మొలనూలు. దామం అంటే హారము లేదా త్రాడు. ఇక్కడ ఆ ములనూలుకు క్వణత్ అని గణగణమ్రోగుతూ ఉండే అని విశేషంతో చెప్పారు కాబట్టి అమ్మ (బంగారు)చిరుగంటులు లేదా మువ్వలు కూర్చిన మొలనూలు ధరించి ఉందని అర్థం.
కరికలభం అంటే గున్నయేనుగు. అంటే కొందరికి పిల్ల యేనుగు అని చెప్పాలేమో నేడు. నిజానికి కలభం అంటేనే గున్నయేనుగని ప్రసిధ్ధి. కాని కలభం అన్న శబ్దం ఏ భారీజంతువుపిల్లకైనా వర్తిస్తుంది. ఒంటె పిల్లకు కూడా. అందుకని ప్రత్యేకంగా కరికలభం అనటం. కుంభశబ్దం చేత ఏనుగు కుంభస్థలాన్ని చెప్పుతున్నారు. కరికలభకుంభం అంటే గున్నయేనుగు యొక్క కుంభస్థలం. ఇక్కడ అమ్మవారి స్తనమండలం కరికలభకుంభాల వలే ఉందని చెబుతున్నారు. స్తనభరా అనటం చేత ఆ యేనుగుల కుంభస్థలాలవంటి స్తనముల భారము కలది అని చెప్పటం.
పరిక్షీణము అనగా చిక్కి ఉన్నదని అర్థం. మధ్య అన్న శబ్దం యొక్క అర్థం శరీరమధ్యభాగ మైన నడుము. పరిక్షీణామధ్యే అంటే చిక్కిన నడుము కలది అమ్మ అని చెబుతున్నారు.
పరిణతం అంటే నిండైన, శరశ్చంద్రవదన శరత్కాలపు చంద్రబింబం వంటి ముఖం కలది అమ్మ అని చెబుతున్నారు. అంటే శరత్పూర్ణిమనాటి చంద్రబింబంలా మిక్కిలి అహ్లాదకరమైన ప్రకాశం కలది అమ్మ ముఖబింబం అని చెబుతున్నారు,
సృణి అంటే అంకుశం. అమ్మకు నాలుగు చేతులు. వాటితో ధనస్సూ, బాణాలూ, పాశమూ, అంకుశమూ ధరించి ఉంటుంది.
ఇదీ అమ్మ స్వరూపం.
అహోపురుషిక అంటే అహంకారస్వరూపిణి అని అర్థం. అంటే మన అహంకారాలవంటి అహంకారం అని కాదు. పురమధితుడు అంటే త్రిపురాలను మధించి ద్వంసం చేసిన త్రిపురహరుడైన పరమశివుని యొక్క అహమికయే తానైనది అమ్మ అని స్పష్టం చేస్తున్నారు.
అటువంటి భగవతి అమ్మను ఉద్దేశించి శ్రీశంకరులు నః పురస్తాత్ అస్తాం అని కోరుతున్నారు.నః అంటే మాకు పురస్తాత్ అంటే ఎదుటగా వచ్చి అస్తాం అంటే సుఖాసీన అగుగాక అని ప్రార్థిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో కొందరు సంస్కృతసాహిత్యంలో ప్రార్థనాదికాలలో దేవీమూర్తులను ఉద్దేశించి కూడా శృంగారపరమైన వర్ణనలు చేసారూ ప్రాచీనులు అని అక్షేపిస్తున్నారు. వారు విషయం అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకో దలుచచుకోకపోతే వారి సంకుచితమైన అవగాహనలు అలాగే ఉంటాయి మరి.
ఇక్కడ శ్రీశంకరులు అమ్మవారి స్తనమండలం గున్నయేనుగుల కుంభస్థలాలవలే మిక్కిలి భారమైనది అని చెప్పటమూ అమ్మవారిది సన్నని నడుము అని చెప్పటమూ అలాంటి వారికి అక్షేపణీయం కావచ్చును. నిజానికి ఆ ఆక్షేపణలకు సమాధానం చెప్పవలసిన పని పెద్దగా లేదు కాని కాలప్రభావం చేత అలాంటి వారి సంఖ్య మిక్కుటం కావటమూ, వారి కుతర్కాలకే అధికమైన ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేసే వారూ పెరగటమూ పైగా మరింత మంది అపండితులూ అపరిపక్వబుధ్ధులూ గుమిగూడీ ఆ వ్యాఖ్యానాలమీద చర్చలుచేస్తూ ఉండటమూ పరిపాటి ఐపోయిన రోజులు కాబట్టి లఘువుగా ఐనా సమాధానం చెప్పక తీరదు.
పురుషులకంటే స్త్రీల కటివలయం విశాలంగా ఉంటుంది. ఎందుకంటే వారు లోకానికి తరువాతి తరాలను అందించవలసి ఉంటుంది కాబట్టి ప్రకృతి వారి శరీరనిర్మాణంలో అటువంటి సౌకర్యాన్ని అందించింది. అలాగే మనుష్యులకు ఉరఃపంజరం క్రింది భాగం కొంచెం సన్నగానే ఉంటుంది - స్థూలకాయులకు తప్ప. అందుచేత ముఖ్యంగా స్త్రీల నడుము భాగం సన్నగా ఉంటుంది. అందుచేత ఇక్కడ అమ్మ నడుము సన్నగా ఉందనటంలో భావం ఆమె జగన్మాత అన్న సంగతిని స్మరించుకోవటమే.
అలాగే స్త్రీలకు వక్షోజాలు సహజసౌందర్యంలో భాగాలన్నది నిర్వివాదమైన విషయమే ఐనా అవి ప్రాథమికంగా స్త్రీల మాతృత్వానికి చిహ్నాలు . వాటి పుష్టిని ప్రస్తావించటం ఆవిడ జగన్మాతృత్వాన్ని స్మరించటంలో భాగమే కాని తదన్యం కాదు.
అమ్మవారి ముఖాన్ని శరత్కాలపు పూర్ణచంద్రబింబంతో పోల్చటం జరిగింది ఈ శ్లోకంలో. అన్ని పౌర్ణిమలకన్నా శరత్తులో వచ్చే పౌర్ణమి ప్రత్యేకం. మబ్బుల కాలం పోయి ఆకాశం నిర్మలంగా ఉండి చంద్రప్రకాశం ఇతోధికంగా కనిపిస్తుంది. అమ్మముఖకాంతి శరజ్యోత్స్నవలె సంతోషదాయకం. అన్ని రకల క్లేశాల మబ్బులను తొలగించే అమ్మ అనుగ్రహాఅనికి అది చిహ్నం.
అమ్మ ధరించే ఆయుధాలలో విల్లంబులను చెప్పారు. అవి మన్మథుడి విల్లూ బాణాలే. అవి విచ్చలవిడిగా మన్మథుడి చేతుల్లో కాకుండా అమ్మచేతుల్లో ఉండటం వలన, అమ్మ దయ ఉంటే చాలు మన మనో వికారాలను మదనాదులు హెచ్చింపలేరని సంకేతం. అవి మన మనస్సూ, పంచతన్మాత్రలకూ అందుకే సంకేతాలు.
మన రాగద్వేషాలను అమ్మ దయ మాత్రమే అదుపు చేయగలదు. అందుకే మనకు లోకం మీద ఉండే రాగ ద్వెషాలు అమ్మఏతుల్లో పాశాంకుశాలయ్యాయి.
ఇదీ చల్లని తల్లి అమ్మస్వరూపం విశేషం.
ఈ తల్లిని సాంకేతికంగా మంత్రశాస్త్రం మన మణిపూరకచక్రంలో సంస్థితురాలుగా ఉంటుందని చెబుతారు.
శ్రీశంకరులు ఆ తల్లిని మాకు సాక్షత్కరించి మా యెదురుగా సుఖంగా ఆసనం అలంకరించవమ్మా అని ప్రార్థిస్తున్నారు.
జగన్మాత కటాక్షం అందరికీ చక్కగా కలుగు గాక.
ఈ శ్లోకాన్ని ప్రతిదినమూ వేయిసార్లు పారాయణం చేస్తే అహితుల దుశ్చేష్టలనుండి కాపాడుతుంది. పాలపాయసం నైవేద్యం. |
ధన్యుడ. ఏది ఎక్కడ దాకా చెప్పాలో చెప్పి ఆపేశారు. ఇది చాలు మాలాటి అభాగ్యులకు. తెలుసుకోకలగడానికి కూడా యోగ్యత కావాలి కదా!
రిప్లయితొలగించండిఇక అమ్మ స్వరూపంలో ఆడతనాని చూడాలనుకునేవాళ్ళ గురించి పట్టించుకోవడం అనవసరమేమో!
chaalaa chakkagaa vivarinchaaru. naa Telugu chadivithe meeku ardhamavuthundi meelaa bhaasha lo lothaina gnaanam ledani. ee okka article lo nenu enno kottha padaala ardhamu, vaaduka thelusukunnaanu (naaku kottha). aa thalli ni uddesinchi srungaaraparamaina varnanalu chesaaru anentha anukunentha moorkhululo okadini kaanu kaanee, mee vivarana chadavaka munupu aa thalli roopamu gurinchi goppa avagaahana unnavaadini koodaa kaanu. naa avagaahananu penchinanduku mee kruthagnathalu;
రిప్లయితొలగించండిపై వ్యాఖ్య తెలుగులిపిలో-
తొలగించండిచాలా చక్కగా వివరించారు . నా తెలుగు చదివితే మీకు అర్ధమవుతుంది మీలా భాష లో లోతైన జ్ఞానం లేదని. ఈ ఒక్క ఆర్టికల్ లో నేను ఎన్నో కొత్త పదాల అర్ధము , వాడుక తెలుసుకున్నాను (నాకు కొత్త ). ఆ తల్లిని ఉద్దేసించి శృంగారపరమైన వర్ణనలు చేసారు అనేంత అనుకునేంత మూర్ఖులులో ఒకడిని కాను కానీ , మీ వివరణ చదవక మునుపు ఆ తల్లి రూపము గురించి గొప్ప అవగాహన ఉన్నవాడిని కూడా కాను . నా అవగాహనను పెంచినందుకు మీకు కృతజ్ఞతలు.