13, అక్టోబర్ 2014, సోమవారం

స్వర్గంలో ముని - 3

*        *        *        *        *

ఇంద్రుడు ఆ కుర్చీలో కూలబడగానే అది కాస్తా బాధతో కిర్రో మంది.

అది చూసి ఆశ్చర్యపోవటం ముని వంతు అయ్యింది.

ఆయన కాస్తా అలా ఒక్కసారిగా మీదపడగానే ఆ కుర్చీ కూడా ఎందుకు మట్టి కరవలేదా అని ఆశ్చర్యపోయాడా?

వరం అడుగూ, వరం అడుగూ అని సతాయించి తీరా అడగ్గానే ఈ పెద్దమనిషి, తప్పేను లెండి అదే పెద్దవేలుపు గారు, ఎందుకు ఢామ్మని పడ్డాడా అని ఆశ్చర్యపోయాడా?

తాను తన చిరకాల వాంఛ ఐన మోక్షం అడగటంలో‌ తప్పేమిటీ అని అశ్చర్యపోయాడా?

మోక్షం అన్న మాట తన నోట వినగానే ఏదో  వినకూడని మాట విన్నట్లు ఇంద్రుడి ముఖం ఎందుకు రంగులు మారిందా అని ఆశ్చర్యపోయాడా?

ఎందుకు ముని ఆశ్చర్యపోయాడో మనకెందుకు లెండి. ముని అశ్చర్యపోయాడూ అన్నది ముఖ్యం.

అంతకంటే ఇద్దరిలో ఎవరు ముందుగా తేరుకున్నారూ అన్నది ఉంది చూసారూ అది చాలా ముఖ్యం.

ఎంతైనా దేవతాజాతి కాదూ. ఆయనే మొదట తేరుకున్నాడు. ముని కేసి ఓ సారి పరిశీలనగా తేరిపార జూచాడు.

ఈ‌యన పరిశీలిస్తుండగా ముని కూడా తేరుకున్నాడు.

ఇంద్రుడి నిశితదృక్కులు గమనించి కాస్త కళవళ పడ్డాడు.

ఇంద్రుడు ముఖానికి కాస్త చిరునవ్వు పులుముకొని అసలు మోక్షం అంటే ఏమిటో‌ తెలుసునా నీకు మునీ అని అడిగాడు.

ఎందుకు తెలియదు మహాప్రభో తెలిసే అడిగానండి. ఇన్నాళ్ళ నుండి ఆ మోక్షం కోసమే తపస్సు చేస్తున్నాను అన్నాడు.

బాగుంది బాగుంది. ఇంతకీ ఆమోక్షం అంటే ఏమిటో కూడా కాస్త చెప్పు వింటాం అన్నాడు పాకారి.

ఏముంది ప్రభూ. మోక్షం కనక వచ్చేస్తే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. లేకపోతే ధృవం జన్మ మృతస్యచ అన్నారు కదా అని తనక్కూడా కొంచెం‌ సంస్కృతం వచ్చునూ అన్న సంగతితో సహా వివరించాడు ముని.

మళ్ళీ పుట్టకుండా ఏమై పోతావు మరి? ఇంద్రుడు అనుమానం వెలిబుచ్చాడు.

ఈ‌యనేదో ఉత్తినే వరం ఇవ్వటం ఎందుకూ అని కొంచెం టెస్టింగు చేస్తున్నాడన్నమాట అని ముని అర్థం చేసుకున్నాడు. మరి పని కావాలంటే ఆయనకు నచ్చాలి కదా తనకు అర్హత దండిగా ఉందీ అని. అందుకే వినయంగా చెప్పాడు. అది నాకు తెలియదు ప్రభూ, దేవుడికే తెలియాలీ అని. ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తుంటే జవాబు తెలియని ప్రశ్నలకి తెలియదని నిజాయితీగా ఒప్పేసుకోవాలీ అని మునికి బోలెడు స్వానుభవం ఉన్నట్లుంది. అందుకే జాగ్రత్త పడ్డాడు. ఎదో డబాయించి చెబుతే అసలుకు ఎసరు రావచ్చును.

అదిసరే, ఇంతకీ మోక్షం మీద మీ‌ మనుష్యులకి ఇంత మోహం దేనికీ?  మళ్ళీ మళ్ళీ పుడితేనేం? మీ సొమ్మేం పోతుందీ అన్నాడు ఇంద్రుడు పరీక్షగా అతని ముఖంలోకి చూస్తూ.

ముని బొత్తిగా చదువుకోని వాడని ఇంద్రుడి లెక్కా యేమిటీ? బోలెడు అధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. వాటిలో అతగాడికి బొత్తిగా అర్థం కానివే ఎక్కువ అన్నది వేరే విషయం. ఎంతో కొంత తెలుసుకున్నాడు కదా? అది సరిపోయేలా ఉందిక్కడ.

మళ్ళీ మళ్ళీ పుట్టటం అన్నది భవసాగరం అంటారు కదా దేవా. అది అన్ని బాధలకీ మూలం. పుట్టాక మనిషి కడుపు కక్కుర్తి పనులు చేసి పాపమే కదా సంపాదించుకునేదీ, నరకానికి పోయి బాధలు పడేదీను? ఐనా అపైన  మళ్ళా మళ్ళా దేవుడు వాడిని భూమి మీదకు తరిమేదీనూ? అందుకే దేవుణ్ణి పాపాలన్నింటినీ కేన్సిల్ చేసి మోక్షం ఇమ్మని కోరుకుంటాం అని దంచాడు.

ఏం ఎందుకలా? పుణ్యాలు చేసి హాయిగా స్వర్గంలో చేరి ఎంజాయ్ చేయొచ్చునే అన్నాడు ఇంద్రుడు అభ్యంతరం చెబుతూ.

కావచ్చును ప్రభూ. కాని స్వర్గంలో కూడా మీరు మనుష్యులని ఆట్టే కాలం ఉండ నివ్వరుట కదా, అందుకే మోక్షం కావాలి అని మేము తపస్సు చేసేది అన్నాడు విడమరుస్తూ ముని.

మరి ఇన్ని విషయాలు తెలిసిన వాడివి ఎవరిని ఏమడగ వచ్చునో నీకు ఎందుకు తెలియదూ? అన్నాడు ఇంద్రుడు కొంచెం తీవ్రంగా.

మునికి కొంచెం భయం వేసింది. ఇదేంట్రా బాబూ‌ అనుకున్నాడు.

మళ్ళ ఇంద్రుడే కొంచెం సౌమ్యంగా, అసలు నేనీ ప్రశ్నలు నిన్ను ఎందుకు వేస్తున్నానో అదన్నా తెలిసిందా నీకు అన్నాడు.

మోక్షం కోసం నేను నిజంగానే ఆశపడుతున్నానో లేదో అని అడుగుతున్నారు అన్నాడు ముని.

ఇంద్రుడు కొంచెం నీరసంగా, కొంచెం జాలిగా చూసాడు ముని కేసి.

చూడు మునీ, మీ మునులు తపస్సు చేస్తారు. అది సహజం. ఒక ముని తపస్సు పరిపక్వం ఐతేనే దానికి తగిన ప్రతిఫలం లభించేది. కేవలం తపస్సు చేసేసాడని ఏ మునికీ దేవతలు వరాలివ్వరు. ఇవ్వకూడదు. అది నియమం. నీకు తెలుసో తెలియదో నేను కూడా మునినే,  పైగా మును లందరికీ నేనే పరీక్షాధికారిని. నా పరీక్షల్లో నెగ్గిన మునికే చివరకు తపఃఫలం సిధ్ధిస్తుంది. ఒక ముని బ్రహ్మాండంగా తపస్సు చేసాను అనుకుంటాడు. అది ఎంత నిజమో అబధ్ధమో తేల్చవలసింది నేనే. అర్థమయ్యిందా అన్నాడు ఇంద్రుడు.

చిత్తం ప్రభూ అన్నాడు ముని ఆనందంగా.

ఇలా పరీక్షలు పెట్టటానికి సాధారణంగా నేనే స్వయంగా రావటం ఉండదు. ఇప్పుడు మాత్రం నేనే స్వయంగా ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు ఇంద్రుడు.

నిజానికి మునికి అర్థం కాని విషయం అదే. తాను భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాడు. చివరన ఆయన తనకు ప్రత్యక్షం ఐపోయి మోక్షం ఇవ్వాలని. మరి ఈయన ఎందుకు వచ్చినట్లు తగుదునమ్మా అని? అలాగని పైకి అనటం ప్రమాదం. అంతలో గుర్తుకు వచ్చింది ఇలా ఆలోచించటమూ ప్రమాదమే ఖర్మా అని. మనస్సు కాస్తా మరీ హెచ్చుగా అలోచనలు చేసి ఇబ్బందుల్లో పడకుండా ఉండాలని చెప్పి తెలివిగా, పెద్దలు మీ సంకల్పం  నా బోటివాడికి ఎలా తెలుస్తుంది ప్రభూ అన్నాడు. వెంటనే లోపల్లోపల హమ్మయ్య అని కూడా అనుకున్నాడు చిన్నగా.

ఇంద్రుడి ముఖం వికసించింది.  కొంచెం ప్రసన్నంగా మాట్లాడాడు. పూర్వం మునులకి చాలా కఠోరమైన పరీక్షలు పెట్టేవాడిని. ఈ మధ్యన తపస్సు చేసే వాళ్ళే కరవైపోయారు. కలియుగం కదా అందుకని అన్నమాట. ఇన్నాళ్ళకు నువ్వు తపస్సు చేసిన వాడివి ఒకడివి కనబడ్డావు. అందుకని సంతోషించి అనుగ్రహంతో నేనే స్వయంగా వచ్చానన్నమాట. కాని, నీకూ పరీక్ష పెట్టాలి పధ్ధతి ప్రకారం. కాలానికి తగినట్లుగా నీకూ‌ ఏదో తేలికపాటి పరీక్షపెడతాను అది తప్పదు అర్థమయ్యిందా అన్నాడు ఇంద్రుడు జవాబు చెబుతూ.

మునికి గుండెలు పీచుపీచు మన్నాయి. ఏం పరీక్షపెడతాడో‌ బాబోయ్ అనుకున్నాడు. ఈ మాట ఇంద్రుడు కాని గమనించేసాడా అని అనుమానంగా చూసాడు.

ఏమిటి నీ అనుమానం? అడుగు ఫరవాలేదు అన్నాడు ఇంద్రుడు దిలాసాగా.
 
ఆ పరీక్ష తరువాత తప్పకుండా నాకు మోక్షం ఇస్తారుగా ప్రభూ అన్నాడు ముని.

*        *        *        *        *

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.