ఈ ప్రజబ్లాగులో ఒక టపా కు హరిబాబు గారి వ్యాఖ్య లో నా అభిప్రాయాన్ని అపేక్షించారు. అంత వరకూ, బాగానే ఉంది కాని, నా అభిప్రాయమే అక్కడ ఒక వ్యాఖ్యగా ఇమిడేటంత చిన్నగా చెప్పటం సాధ్యపడటం లేదు. అందుచేత దానిని ఈ టపాగా వ్రాస్తున్నాను.
భారతంలో ఉన్న ఒక చిన్న కథను ప్తస్తావిస్తాను ముందుగా, అదీ సూక్ష్మంగానే. ఒక గురువుగారు తన వద్దకు వచ్చిన శిష్యులలో ఒక పిల్లవాడికి విద్య నేర్పకపోగా అడవులకు పోయి ఆశ్రమపశువులను మేపటమనే పని చెబుతారు. పైగా వాడికి తిండితిప్పల విషయంలోనూ అక్షరాలా లక్షనిబంధనలు పెట్టి దారుణంగా డొక్క మాడ్చుతారు. ఇలా ఎందుకు చేస్తున్నారో గురువు గారు అన్నది ఎవరికీ, చివరికి గురుపత్నికి కూడా బొత్తిగా బోధపడదు. ఒక నాటి సాయంకాలం పశువులు తిరిగి వస్తాయి కాని పిల్లవాడు మాత్రం ఎంతకీ ఆశ్రమానికి తిరిగి రాడు. రాత్రి ప్రొద్దుపోయాక వాడిని వెదుకుతూ గురువుగారే పోయి పోయి కళ్ళుపోయి ఒకగోతిలో పడిఉన్న ఆ పిల్లావాడిని గుర్తించుతారు. ఏం జరిగిందిరా అంటే గురువుగారూ ఆకలికి తట్టుకోలేక ఏవో ఆకులు నమిలేస్తే నా కళ్ళు పోయాయని చెప్పాడు ఆ అబ్బాయి. అప్పుడు గురువుగారు ఒక మంత్రం ఉపదేశిస్తే దాని సహాయంతో పిల్లవాడికి కళ్ళొస్తాయి వెంటనే.
ఇంతకూ అసలు విషయం ఇప్పుడు చెప్పేది వినండి. మర్నాడు ఆ పిల్లవాడిని కూర్చుండ బెట్టి నాయనా విద్యోపదేశం ఇదిగో అని వాడి నడినెత్తిన తన అరచేయి ఉంచారు గురువుగారు. ఆ తరువాత నాయనా, నీకు సకలవేదవేదాంగాలూ నేర్పాను, హాయిగా గురుకులం ఏర్పాటు చేసుకొని శిష్యులతో సుఖంగా ఉండు అని చెబుతారు.
ఒక గురువు సకలవేదవేదాంగసమన్వితమైన విద్యను అదీ సాధారణంగా పిల్లలు అనేక ఏళ్ళు శ్రమించి నేర్చుకొనే విద్యను ఒక్క క్షణంలో అనుగ్రహించారు!
ఇక్కడ గురువు శక్తీ, శిష్యుడి యోగ్యతా అన్నవి అద్భుతం అని గ్రహించాలి మనం.
అర్జునుడు యోగ్యశిష్యుడు కాబట్టే జగద్గురువు శ్రీకృష్ణపరమాత్మ అతిస్వల్పకాలంలో యోగశాస్త్రమూ, సకలోపనిషత్సారసంగ్రహమూ ఐన ఉపదేశాన్ని అద్భుతంగా స్వల్పకాలంలో ఆ సత్శిష్యుడికి అనుగ్రహించారు.
ఐతే కృష్ణార్జునసంవాదం అంతా రెండు దివ్యాత్మల మధ్య జరిగిన సంవాందం. అది మన మానవ కాలమానానికన్నా సూక్ష్మమైన పరిధిలో జరిగింది.
ఒక్క విషయం ఆలోచించండి. ఒక శాస్త్రవేత్తకు ఒక ఆలోచన వస్తుంది. అది మనస్సులో మెదలేది తృటికాలంలో. దాని పరిమాణం అత్యల్పం. అవును కదా. కాని ఆ ఆలోచనను మానసికపరిథి నుండి ఆ శాస్త్రవేత్త భౌతికకాలప్రమాణంలో సాటి మానవులకు అందించాలంటే మానవభాషలో వ్యక్తీకరించాలి కదా? అప్పుడు ఆ వ్యక్తీకరణ అనేది ఒక మాటలోనే, ఒక వాక్యంలోనో కుదురుతుందా? అసాధ్యం కావచ్చు. ఒక్కొక్కసారి ఆ వ్యక్తీకరణ నిడివి ఒక సిధ్ధాంత గ్రంథం కూడా కావచ్చును. ఎవరైనా ఆ గ్రంథం చదివి, ఇదంతా ఒక్క ఆలోచన యొక్క వ్యక్తీకరణ అంటే నమ్మటం కుదరదు అంటారా? అనరు కదా? అనేవాళ్ళకో దండం. అంతే. వితండవాదం చేస్తే ఎవరూ చెప్పగలిగింది ఉండదు. కాని సంభావ్యత ఏమిటి? అలోచనలను వ్యక్తీకరించటానికి హెచ్చు కాలమూ, పదప్రవాహమూ అవసరమయ్యే విషయం అందరికీ అనుభవైక వేద్యమే అనుకుంటాను.
శ్రీభగవాన్ వేదవ్యాసులవారు కూడా సాక్షాన్నారాయణస్వరూపులు కాబట్టి శ్రీకృష్ణార్జునసంవాదాన్ని కూడా భారతాఖ్యానంలో పొందుపరచి మానవలోకానికి కూడా అందించారు. ఇక్కడ కూడా అనటం ఎందుకంటే, దానికి ఒక ముఖ్య కారణం ఉంది కాబట్టే. వ్యాసప్రోక్తమైన భారతం అతి విపులమైనది. మానవులకు దానిని పూర్తిగా పఠించటానికే తమ ఆయుఃప్రమాణాల్లో బహుభాగం వెచ్చించవలసి వస్తుంది. అందుచేత దానిని ఆయనే క్లుప్తీకరించి మానవలోకంలో వ్యాప్తిచేసారు. పూర్ణభారతం దేవలోకప్రచారానికి ఇచ్చారు. ఇదంతా భారతం ఆదిపర్వంలో చెబుతారు.
సరే వ్యాసులవారు మనకు ఇచ్చిన భారతంలో శ్రీకృష్ణార్జునసంవాదాన్ని కూడా పొందుపరిచారు. అది ఏడు వందల శ్లోకాలు. మరికొద్ది శ్లోకాలూ ఉన్నాయనే వాదమూ ఉంది. దానికి జోలికి మనం పోవటం లేదు. ఇంత పెద్దగా ఏడువందలశ్లోకాలుగా మనకి శ్రీకృష్ణపరమాత్మగారూ ఆయన శిష్యుడు అర్జునుడూ మానసికంగా సంభాషించుకొన్న విషయాన్ని మానవ భాషలోనికి తెచ్చేసరికి అది ఇన్ని శ్లోకాలయింది. స్థూలంగా సంగతి ఇదన్నమాట.
ఇందులో ఆశ్చర్య పోవలసింది ఏమీ లేదు.
బెంజీన్ అనే కర్బనరసాయన పదార్థం యొక్క అణునిర్మాణం ఘట్టి చిక్కుగా ఉండేది. ఒక శాస్త్రవేత్త కెక్యూల్ అనే ఆయనకు ఒక కల వచ్చిం దొక నాడు. ఆ కలలో పాములు కొన్ని ఒకదాని తోకను ఒకటి కరచి పట్టుకొని ఒక వలయంగా ఉన్నట్లు స్ఫురణ కలిగింది. ఆయన ఆ స్ఫూర్తిని బెంజీన్‌కి అన్వయించి దాని అణునిర్మాణం వెల్లడించగలిగాడు. అయన ఆ విషయం మీద వ్రాసిన వ్యాసం ఎన్నో నిర్థారణలో బోలెడు పేజీలుంటుంది. అది ఒక శాస్త్రవేత్త చదివినా అరగంట పడుతుందేమో. ఐతే కెక్కూల్‌కు వచ్చిన కల అరగంటో గంటో నడిచిందా? అలా ఆనలేము కదా? ఒక చిన్న స్పార్క్ వచ్చింది అది చిక్కుముడిని పరిష్కరించింది. ఐతే అచ్చులో అది ఒక వ్యాసం ఐనది.
రేఖాగణితశాస్త్రం అని లెక్కల్లో ఒక విభాగం ఉంది. Analytical geometry అంటారు. దానికి సంబంధించిన ప్రాతిపదికలు కూడా ఒకానొక పెద్దమనిషికి కలలో స్ఫురించినవే అంటారు.
మనక్కూడా కలలు వస్తాయి కదా. ఒక్కొక్క కల భయంకరంగా ఎంతో దీర్ఘమైన కాలం కష్టం పడినట్లుగా అనిపిస్తుంది. కాని నిజానికి కల అంతా కొద్ది సెకనులే నడుస్తుంది! ఇలాంటి అనుభవం దాదాపు అందరకూ సాధారణంగా కలుగుతూనే ఉంటుంది.
అందుచేత మానసికమైన పరిధిలో కాలం వేరు. భౌతికప్రమాణంలో కాలం వేరు. గురుశిష్యులు మానసిక కాలావధుల్లో సంభాషించుకోవటం శ్రీకృష్ణార్జునసంవాదంలో కీలకాంశం. మీరు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివారా? దాని ఆంగ్లమూలం Autobiography of a Yogi అని పరమహంసయోగానంద గారి ఆత్మకథ అది. అందులో కూడా యోగానందగారికి వారి గురువైన యుక్తేశ్వర గిరిగారు మానసిక సందేశాలను పంపిన ఘట్టం ఒకటి వస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అటువంటి మరికొన్ని సంఘటనలూ ఆ పుస్తకంలో ఉంటాయి.
ఇటువంటివి యోగుల అనుభవాల్లో తరచు ఉండే సంగతులే. కాని మనబోటి సాధారణమానవులకు అంతుబట్టని మిష్టరీలు. మన ప్రియతమ హేతువాదుల దృష్టుల్లో అభూతకల్పనలూ, అవాస్తవాలూ. ఎవరి నమ్మకాలు వారివి. వాళ్ళతో పేచీలు వద్దు మనకి.
సత్యసాయిబాబా కూడా ఎవరో భక్తుడికి ఏళ్ళ తరబడి నానాక్లేశాలూ అనుభవించవలసిన రాత ఉందని చెప్పారట. ఐతే అతడు ఆ క్లేశాలన్నింటినీ అనుభవించక తప్పలేదు కానీ ఆ పిమ్మట చుసుకుంటే నిజానికి గడచిన కాలం కొద్ది నిముషాలు మాత్రమే అని తెలిసి విస్తుపోయాడట.
ఒక అందమైన కథ ఉంది. దాని పేరు విష్ణుమాయా విలాసం. రచయిత కంకంటి పాపరాజు. ఒక విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఆబ్దికం. కాలువకు స్నానానికి వెళ్ళి వస్తానని భార్యతో చెప్పి బయటకు వెళ్ళాడు. దారిలో విష్ణుకథలు స్మరిస్తున్నాడు. సరే, భక్తుడు కదా, కొంచెం పరవశించి ఉన్నాడు కాలువలో మునక వేసే సమయానికి. ఎందుకు తోచిందో ఒక ఊహ. స్వామీ విష్ణుమూర్తీ, నీ మాయావిలాసం ఒక్కసారి నాకూ చూడాలని ఉందయ్యా, చూపవా అని అడిగాడు. సరే స్నానం చేసి గట్టుమీదకు రాగానే విష్ణుమాయ సిధ్ధంగా అందమైన అమ్మాయి రూపంలో ప్రత్యక్షం!
ఈయనకు అక్షరాలా మతిపోయింది. ఆ అమ్మాయిని నన్ను పెళ్ళి చేసుకో అని వెంటబడ్డాడు. పోవయ్యా బేమ్మడా నేను బోయపిల్లను నాతో పరాచికాలేంటి అని అమ్మాయి కసురుకుంటున్నా సరే ఆమె వెనకాలే బోయగూడానికి వెళ్ళి ఆమె పెద్దలను ఒప్పించి ఆ పిల్లని పెళ్ళాడి వాళ్ళల్లో కలసి పోయాడు. బ్రాహ్మణోత్తముడు ఇప్పుడు బోయవాడు. సమయం వచ్చింది కాబట్టి ఒక మాట. వాల్మీకి బోయవాడంటారు చాలా మంది. కాదు. ఆయన ప్రచేతసుడు అనే ఒక ముని కొడుకు. ప్రారబ్ధం కారణంగా అతడు ఒక బోయవాడిలాగా బహుకాలం జీవించవలసి వచ్చింది. అంతే.
కొన్నాళ్ళకు వాళ్ళంతా ఎక్కెడెక్కడో తిరిగారు. పెద్ద కరువొచ్చింది. పెళ్ళామూ, తానూ, పిల్లలూ మలమలా మాడలేక, ఎవరో గోదావరీతీరం సుభిక్షంగా ఉందని చెబితే అక్కడకు పోయాడు సంసారంతో సహా కాళ్ళీడ్చుకుంటూ. ఒక ఊరు చేరారు. పిల్లలూ, పెళ్ళామూ ఆకలో చస్తున్నాం అంటూ కూలబడ్డారు. ఊరిలోనికి భిక్షానికి వెళ్ళాడు ముందుగా వీళ్ళకింత తిండి సంపాదించి పెట్టాలని. వీధులు తిరిగి ఒక ఇంటిముందు నిలబడి భిక్షకోసం అర్థించాడు.
అమ్మా మా ప్రాంతంలో కరువొస్తే ఇలా వచ్చాం. ఊరి చివర పెద్ద చెట్టుక్రింద నా పెళ్ళాం పిల్లలు కళ్ళల్లో ప్రాణాల్తో ఉన్నారు. కాస్త ముద్ద పెట్టి వాళ్ళ ప్రాణం కాపాడు తల్లీ అని అడిగాడు.
ఆవిడ ఘొల్లున గోల. ఇదేం కర్మం దేవుడా. మీరు ఇప్పుడే ఘడియ క్రితమే కదా స్నానానికి గోదావరికి వెళ్ళారూ? వస్తూనే ఈ పిచ్చిమాట లేమిటండీ. అయ్యో ఏమైంది మీకూ? ఇవతల భోక్తలు వచ్చి కూర్చున్నారూ? అని ఒకటే మొత్తుకోవటం.
సరే ఆవిడ దేవుణ్ణి వేడుకోగా వేడుకోగా ఈయనకు స్పృహ వచ్చింది. తాను తానే! గోదావరికి పోయి స్నానం చేసి వచ్చాడు. కాని లీలగా బోయపిల్లా, దానితో పెళ్ళీ, పిల్లలూ, తాము పన్నెండేళ్ళపాటు దేశాలు పట్టి తిరగటం అంతా బుర్రకు నిజమో కలో తెలియని స్థితి. ఈ గలాభాకి చుట్టూ చేరిన అందరితో ఇలా జరిగిందని కథంతా చెబితే, అంతా ఔరా ఔరా అన్నారు. గోదావరీ తీరం పోయి చూస్తే అక్కడెవరూ లేరు, చెట్టైతే ఉంది కానీ.
అప్పుడు అర్థమైనది. ఇదంతా విష్ణుమాయా విలాసం అని. చూడండి. ఇక్కడ అతగాడికి మాయాప్రపంచంలో పన్నెండేళ్ళు నిఖార్సుగా జరిగాయి. నిజానికి మన లోకంలో నడిచింది ఒకటో రెండో ఘడియలు మాత్రమే.
అలా కాలం అనేది అనేక పరిధుల్లో ఉంటుంది. సమస్తమైన కాలమూ మన భౌతికపరిథిలోనిదే అనుకుంటే కొన్ని చిక్కుముడులు ఎదురౌతాయి. వాటిని విప్పలేం. గడబిడపడి వాళ్ళ తప్పులూ వీళ్ళ తప్పులూ వెదకటం చేస్తాం సాధారణంగా, మనమే తెలివైన వాళ్ళ మనుకున్నప్పుడు.
అదీ సంగతి.
Mee edurugaa koorchuni vinnattebfeel ayya....
రిప్లయితొలగించండిChinna chinna doubts vundane vunnayi yadhaprakaram.
Prasthutham vaati sangathi matladakapovadam melu.
Gurucharitra lo oka katha ni samkshiptam ga
Parichayam chesaru. Baagundi.
జేవీరావుగారూ,
తొలగించండిమీకు ఈ వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి యథాప్రకారం అన్నారు. మరి అడగటానికి మోమోటమి దేనికి? దివ్యంగా అడగవచ్చును. నాకు తెలిసినంతలో వివరించటానికి ప్రయత్నిస్తాను.
alaa time archive cheyyakapothe pittakadhalu puttavu gadandee :)
తొలగించండిఅబ్బా, కథ లో ఏమి మేటరు ఉన్నా అది గోదావరి తీరానికి లింకు కుదర కుంటే ఈ గోదావరి తీరం వాళ్లకి ఉపశమనం దక్కదు సుమీ!! జేకే !!
రిప్లయితొలగించండిఇట్లాగే ఒక శ్రీ కృష్ణ మాయ అన్న (నారదులవారు బ్రహ్మ చర్యం వదిలి పెట్టి సంసార జంజాటం లో పడడం కథా వస్తువు!) సినిమా చూసినట్టు గుర్తు !!
చీర్స్
జిలేబి