10, అక్టోబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 15 శరజ్జ్యోత్స్నాశుద్ధాం ....



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


15

శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటముకుటాం
వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరామ్
సకృన్నత్వాం నత్వా కథమివ సతాం సంన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః కణితయః

ఇంతదాకా శ్రీశంకరులు అమ్మ శ్రీదేవి యొక్క చరణారవిందాల మహిమను కీర్తించారు.  మూడవశ్లోకమైన త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః అనే దాని నుండి గత పదునాల్గవ శ్లోకం ఐన క్షితౌ షట్పంచాశద్ .... ... ....  తవ పాదాంబుజయుగమ్ అనే దాని వరకూ. ఒక్క సారి ఆ శ్లోకాలను సింహావలోకనం చేసుకోండి.

ఇప్పుడు కూటత్రయ ధ్యానం గురించి శ్లోకాలను అందిస్తున్నారు మనకి.

ప్రప్రథమంగా సరస్వతీ ధ్యానం చేస్తున్నారు.

శరజ్జ్యోత్స్నాశుధ్ధామ్‌ అన్న సమాసంలో శరత్తు, జ్యోత్స, శుధ్ధ అనే పదాలున్నాయి.  శరత్తు అంటే శరదృతువు. ఇక్కడ జ్యోత్స్న అని చెప్పబడుతున్న వెలుగు వెన్నెల. శరత్కాలంలో, ఆకాశంలో మబ్బులన్నీ తొలగిపోయి, అ వెన్నెల పరమ శోభాయమానంగా ఉంటుంది.  అందుకే ఆ అవెలుగును శుధ్ధా అనగా ఏ కొరతా లేక పరమాహ్లాదకరంగా తెల్లగా ఉన్నది అని చెప్పుతున్నారు.  తెలుగులో ఒక నానుడి ఉంది కదా పిండి ఆరబోసినట్లుగా ఉంది వెన్నెల అని.  అసలు ఎప్పుడైనా వెన్నల అన్న పదాన్ని విడదీసి చూసారా? వెల + నెల -> వెన్నెల. వెల అనగా తెల్లని నెల అనగా కాంతి. ఈ వెన్నెల అన్నదే తెల్లనిది ఐనప్పుడు అది శుధ్ధంగా ఉన్నదీ అనటంలో అభిప్రాయం దానికి ఏ‌ మబ్బుల మరకల అడ్డూ మసకబార్చటమూ లేదు, చంద్రుడికి ఏ కొంచెమో కళలు తక్కువై వెన్నెల కాంతి అసంపూర్ణంగా ఉండటమూ లేదు అని వెప్పటం. అంటే, పిండితార్థం శరత్పూర్ణిమ నాటి మిక్కిలి  మనోహరమైన వెన్నల కాంతిని ప్రస్తావించటం చేస్తున్నారన్న మాట.  ఇదిగో ఈ శరజ్జ్యోత్స్నాశుధ్ధా అని అమ్మవారిని సంబోధిస్తున్నారు ఈ‌ శ్లోకంలో.  ఇలా శ్రీశంకరులు సరస్వతీ స్వరూపం వర్ణిస్తున్నారు అన్నమాట గ్రహించాలి మనం.

ఆ పైన శశియుత జటాజూట మకుటాం అన్నారు. శశి అంటే చంద్రుడు. శశియుత అంటే చంద్రుడిని కలిగియున్నది. ఏది? జటాజూటం అంటే శోరోజాల ముడి అన్న మాట. అదే మకుటం అంటే కిరీటంగా ఉందీ అని చెబుతున్నారు.  అమ్మవారి తలకట్టుమీద చంద్రవంక ఉన్నది అని గ్రహింపు కావాలి మనకు.

ఇక వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరామ్‌. మధ్యలో విరామాలు ఇచ్చి వ్రాసాను కానీ అలా వ్రాయటం సంప్రదాయమే కాదు. ఇదంతా ఒకే సమాసం!  త్రాసము అంటే భయము. త్రాణము అంటే రక్షణ. వరము అంటే తెలిసిందే కదా. వరత్రాసత్రాణ అన్నదానికి వరముద్రా అభయముద్రా అన్నవి సూచించటం ప్రయోజనం.  ఇలా అమ్మవారు ఈ వర, అభయ ముద్రల్ని దాల్చి ఉంది అని చెబుతున్నారు. స్ఫటిక శబ్దం చేత అమ్మవారి ఒక చేతిలో స్ఫటికమాల ఉన్నది అని సూచిస్తున్నారు. ఇక మిగిలిన పదం పుస్తకం అన్నది సులభగ్రాహ్యమైన అర్థం కలదే.  ఇలా అమ్మవారు రెండు చేతులతో వరముద్రా, అభయముద్రా పట్టి ఉంటారనీ, మరొక రెండు చేతుల్లో అక్షమాలా, పుస్తకాలు ఉన్నాయనీ ఈ పాదంలో అమ్మవారి నాలుగు చేతులనూ వర్ణించారు శ్రీశంకరులు.

ఈ అమ్మవారి మహిమను వర్ణనం చేస్తున్నారు మిగిలిన రెండు శ్లోకపాదాల్లోనూ. ఏలాగో చూదాం.

అమ్మా అటువంటి దివ్యస్వరూపం కలిగిన త్వామ్‌ అనగా నిన్ను , సకృత్ నత్వా అంటే ఏదో రకంగా కష్టపడి ప్రార్థన చేసిన సతాం అనగా కవులకి ఎంత గొప్ప అదృష్టం పడుతుందో కదా అని అంటున్నారు.  ఏమిటట ఆ అదృష్టం?

చివరిపాదంలో చెబుతున్నారు ఆ అదృష్టం ఏమిటో, మధు క్షీర ద్రాక్షా అంటే తేనె, పాలు, ద్రాక్షరసం వంటి అమృతసమానం ఐన తీయదనం కలిగిన ఫణితయః అంటే మాటల తీరులలో (కవిత్వం అని అర్థం) ధురీణ అనగా పాండిత్యం కధమివ అనగా ఏవిధంగా న సన్నిదధతే అబ్బకుండా పోతుందీ అని అంటున్నారు శ్రీశంకరులు.

ఈ‌శ్లోకంలో శ్రీశంకరులు నిష్కర్ష చేస్తున్నది ఏమిటంటే శరత్పౌర్ణిమ నాటి అందమైన తెల్లని శరీరఛ్ఛాయకలిగి, వరద అభయ ముద్రలూ, స్ఫటికమాలా, పుస్తకాలూ ధరించిన సరస్వతీ అమ్మవారిని ఎలాగో అలా చచ్చీ చెడీ కష్టపడి ఒక్కసారి అయినా సరే ప్రార్థించిన కవులకు అద్భుతమైన కవిత్వ శక్తి వస్తుంది అని.  ఆ కవిత్వం‌ఎంత మధురం అంటే ద్రాక్షరసం, తేనె, పాల వలే మిక్కిలి రుచికరమైనదీ మధురమైనదై ఉంటుందీ అని.

అమ్మవారు మిక్కిలి దయామయి కాబట్టి అలా ఒక్కసారి మనస్ఫూర్తిగా మ్రొక్కినా సరే  అటువంటి దివ్యకవిత్వశక్తి రాకుండా ఎలా ఉంటుందీ అని శ్రీశంకరుల తాత్పర్యం

ఈ శ్లోక వ్యాఖ్యను కూడా ఇంకా కొంచెం కొనసాగించ వలసి ఉంది. అది తదుపరి టపాలో చూదాం.

ఈ 15వ శ్లోకం కొనసాగింపును ఇక్కడ చదవండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.