10, అక్టోబర్ 2014, శుక్రవారం

స్వర్గంలో ముని - 1తెలతెల వారే వేళ.

అది అడివి అయ్యింది కాబట్టి అనేక జీవాలు మెలుకువగానే ఉన్నాయి.  వాటి తాలూకు అరుపులూ బొబ్బలూ అశ్రమం తాలూకు మట్టి మెత్తిన తడికగోడలనూ తడికల తలుపుల మూసీమూయని సందుల్నీ చీల్చుకొని బాగానే వినిపిస్తున్నాయి.

ఎందుకైనా మంచిదన్నట్లు ఆశ్రమాన్ని అడవికి చివరగా ఉండేటట్లు కట్టటం వలన ఆ అరుపులు మరీ అంత భయంకరంగా వినిపించటం లేదు.  ఐనా ఆ అడవిలో మరీ ఘోరంగా పెద్దపులులూ అవీ ఉన్నట్లు లేదు.  ఆ విషయాన్ని ముని ముందుగానే విచారించుకొనే కట్టాడు ఆశ్రమాన్ని.

ఏ నగరమో ఐతే ఇంకా అక్కడి జనం అంతా గాఢంగా నిద్రలో ములిగితేలుతూనే ఉండే వారు.  అదే పల్లెటూళ్ళైతే గనక గంపలక్రింద ఉన్న కోళ్ళు ఒళ్ళు విదుల్చుకొని ఒక్కొక్కటీ గొంతులు విప్పటం ముదలు పెడుతూ ఉండేవి.

ఎన్నాళ్ళ నుండో తపస్సు చేస్తున్నాడు ముని.

ఐనా దేవుడు ప్రత్యక్షం కాలేదింకా.

ఆ విచారం కారణంగా ఈ మధ్య తరచుగా నిద్రకూడా రావటం మానేసింది మునికి.  ఇదీ బాగానే ఉందని చెప్పి, ఆ సమయాన్నీ తపస్సు కోసమే కేటాయించి మరీ శ్రమిస్తున్నాడు దేవుడి కోసం.

అందువల్లనే ఈ వేళ తెలతెలవారే సమయం ఐనా ఇంకా కొంచెమైనా కునుకు తీయకుండా తీవ్రంగా తపస్సు చేస్తూనే ఉన్నాడు.  అతడికి ఒకటే కోరిక.  ఎప్పటికైనా సరే దేవుడు ప్రత్యక్షం కావాలి.

ఈ రోజు ప్రత్యక్షం అయ్యాడా అనందమే.  కాకపోతే,  ఈ కట్టె రాలిపోయే దాకా తపస్సు మాత్రం వదలకుండా చేస్తూనే ఉంటాడు.

ఉన్నట్లుండి ఆశ్రమం బయటినుండి  కోకిలారవాలు వినిపించటం మొదలయ్యింది.

కిటికీ తడికలను తోసుకొని సందులగుండా పగటి వెలుగుల వంటి వెలుగులు ఆశ్రమం లోనికి జొరబడ్డాయి.

ఎవరో ఆశ్రమం దగ్గరలోనే మధురంగా పాడుతున్న పాట ఒకటి వినిపించటం మొదలయ్యింది.  అది కొంచెం మృదుమధురంగా ఉందని చెప్పితే తక్కువ చేసి చెప్పినట్లే. అలా ఉంది ఆ పాట.  కాని మరీ మెల్లగా పాడుతున్నట్లున్నారు ఎవ్వరో ఆడవాళ్ళు. అందుచేత అదేమి పాటా అన్న వైనం తెలియటం లేదు.

ఇదంతా మునికి తెలుస్తూనే ఉంది.

అతడు తపస్సులో ఉన్నాడు కదా?  ఈ సంగతులన్నీ తెలియటం ఏమిటీ అని అడగకండి.  అలాంటి తిక్కప్రశ్నకి నా దగ్గర సమాధానం సిధ్ధంగానే ఉంది.   అతడు ముని కదా? రాత్రీ పగలూ అన్నది కూడా చూడకుండా ఘోరతపస్సు చేస్తున్నాడు కదా ? అతగాడికి ఆమాత్రం మహిమలూ గట్రా ఉండవా అంటాను. అప్పుడు మీ నోటికి తాళం పడుతుంది కదా?  అందుకని ఆ బాపతు ప్రశ్నలు వేయకుండా కథనే గమనించ ప్రార్థన అనే హెచ్చరిక.

మునికి క్రమంగా మరొక సంగతీ అవగతం అయ్యింది.

ఎవరో కాని తన ముందుకు వచ్చి నిలబడ్డారు.

మునికి లోపల లోపల అనుమానం కలిగింది..  ఎవరో తన తపస్సును చెడగొట్టటానికే ఇలా వచ్చినట్లున్నారు.  అందుచేత,  తాను కళ్ళు తెరవకూడదు. అందుకని కళ్ళు తెరవను కాక తెరవనూ అని నిశ్చయం చేసుకొని తపస్సు కొనసాగించాడు.

కాని కొంచెం సేపటికి మరొక ఆలోచన వచ్చింది.

ఆ వచ్చినది దేవుడే ఐతే?

వీడి బ్రతుక్కి ఇంత పంతమా అనుకుని తిరిగి వెళ్ళిపోతే?

అప్పుడెలా?  ఇంత తపస్సూ, ఇంత ఘోరతపస్సూ కూడా ఘోరాతిఘోరంగా వ్యర్థం ఐపోతుందే?

ఎందుకైనా మంచిది. ఎవరొచ్చిందీ చూడాలి అనిపించింది.  
ఇంక మునికి కళ్ళు తెరవక తప్పలేదు.


*        *        *        *        *

వచ్చిన పెద్దమనిషి ఎవరో తెలిసింది కాదు.  అన్నట్లు పెద్దమనిషి అనకూడదేమో.

దేవుడో కాదో.

ఈయనకి నాలుగు చేతుల్లేవు.  కాబట్టి విష్ణుమూర్తి కాదు.
ఈ యనకి మూడో కన్ను లేదు. కాబట్టి శివుడు కాదు.
పిల్లవాడిగా లేడు.  కాబట్టి కుమారస్వామీ కాదు.
మనిషిలాంటి తలకాయే కాని తొండం వగైరా లేవు.  కాబట్టి గణపయ్యా కాదు.

చప్పున ఇంకే దేవుడి తాలూకు వర్ణనా గుర్తుకు రాలేదు.
వచ్చిందెవరో తెలిసి చావటం లేదు.
ఇప్పుడెలా?

ఏమిటలా చూస్తున్నావు అన్నాడు వచ్చినాయన.

వచ్చింది ఎవరో ఒక దేవుడు.  పొగడ్డం ఎలాగూ అన్న సంగతి తరువాత ఆలోచించుకోవచ్చును.  అయన అమర్యాద అనుకోకుండా ఉండటం ముఖ్యం కదా.  అందుకని ఆయన పాదాలముందు సాగిలపడ్డాడు.

వచ్చిన దేవుడు కొంచెం సంతోషపడ్డాడు.

లే, లే,  శుభమస్తు. అది సరే,  ఏమిటలా తబ్బిబ్బు పడిపోయావు.  నేనే నయ్యా ఇంద్రదేవుడిని అన్నాడు వచ్చిన వాడు ఆ దేవుడిని అన్నది కాస్త వత్తి పలుకుతూ.

మునికి మాటల్లో చెప్పరానంత నిరుత్సాహం కలిగింది.

నీ తపస్సుకు మెచ్చాను. వచ్చాను. అదిసరే,  ఏమిటీ?  ముఖం అలా పెట్టావు? నా రాక నీకు సంతోషం కలిగించ లేదా?

ఈ అది సరే అనటం ఇంద్రదేవుడుగారికి ఒక ఊతపదం కాదుకదా అని మునికి అనుమానం వచ్చింది.  ఐనా ఈయనగారు ఎందుకు వచ్చినట్లూ అనీ ఒక అభిప్రాయం కలిగింది కూడా.

అదేమిటయ్యా,  నీ తపస్సుకే మెచ్చి వచ్చానంటినిగా?  నమ్మకం కలగటం లేదా?  నీ అసాధ్యం కూలా?  నువ్వు వఠ్ఠి అనుమానం పక్షిలా ఉన్నావే అన్నాడు ఇంద్రుడు కులాసాగా నవ్వుతూ.

ముని గతుక్కు మన్నాడు.  ఈయనా దేవుడే నాయె. మనస్సులో కూడా గట్టిగా ఏమీ అనుకుందుకు లేదురా బాబూ అనుకున్నాడు.  మళ్ళా ఇలా అనేసుకున్నా నేమిటీ అని కొంచెం భయపడ్డాడు.

అబ్బెబ్బె అదేం లేదు సురేంద్రా.  మీ దర్శనంతో నా జన్మ ధన్యమై పోయింది అన్నాడు సాధ్యమైనంత భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తూ.

తపస్సు దిట్టంగా చేస్తే దేవతలం దర్శనం ఇవ్వటం మామూలే.  అది తప్పదు మాకు. అదిసరే,  నీకు నిజంగానే అనందంగా ఉందా మా దర్శనం వలన?  నీ ముఖం చూస్తే అలా కనిపించటం లేదే మరి అన్నాడు ఇంద్రుడు.

అనుమానం ఏమీ లేదు.  ఈ  ఇంద్రుడు ఎక్కడ పట్టాడో కాని అదిసరే అనే ఊతపదం బాగానే పట్టుకున్నాడు . ఐనా నాకెందుకు ఆవలిస్తే పేగు ల్లెక్కెట్టే రకంలా ఉన్నాడు. ఈయనతో మహాజాగ్రత్తగా వ్యవహరించాలి అని ముని తీర్మానించుకున్నాడు.

మహాప్రభో, పాకారీ, దేవనాథా, సురేంద్రా, శచీపతీ, సహస్రాక్షా,  ఆఖండలా, జంభారీ, గోత్రధ్వంసీ  అలాంటి దేమీ లేదు.  మీ దర్శనానికి మిక్కిలి ఆనందిస్తున్నాను అన్నాడు వినయంగా.  ఏంచేసేదీ,  ఏదైనా దండకంగా చెప్పి ఉంటే  మరింత రంజుగా ఉండేది.  ఆయనా సంతోషించే వాడు.  తనకేమో కవిత్వమూ కపిత్వమూ ఏమీ వంటబట్టలేదాయిరి.  ఏదో  చేతనైనంతగా పొడిపొడి ముక్కలతోటే పొడి వేశాడు ముని.

ఐతే సరే. సంతోషం. చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో అంటే ఈ దిక్కుమాలిన కలియుగంలో మానవులు తపస్సు యొక్క గొప్పదనాన్ని మరచిపోయారు.  ఇన్నాళ్లకి నువ్వే ఇలా అందంగా నిజమైన తపస్సు చేసి మమ్మల్ని మెప్పించావు.  నీపైన అనుగ్రహం కలిగి దర్శనం ఇచ్చానన్నమాట. అదిసరే,  దేవతల దర్శనం వృధా కారాదు. అది మా దేవతల ఖచ్చితమైన నియమం.  అందుచేత ఏ దైనా  సరైన వరం కోరుకో అన్నాడు ఇంద్రుడు చాలా  ఠీవిగా.
*        *        *        *        *


(సశేషం)

5 వ్యాఖ్యలు:

 1. బాగుంది.ఏంటీ శ్యామలీయం వారా ఇలా రాస్తున్నది? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. యే వెలుగులకీ ప్రస్థానం?యే మలుపులకీ ప్రయాణం!

  ref:http://harikaalam.blogspot.in/2014/10/blog-post_9.html

  ఇంతకీ ఒక వూరి కధ యేమయింది?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఒక ఊరి కథకి ఏమీ కాలేదు. దాని రచనాశైలి దానిదే, దీని రచనా శైలి దీనిదే. సందర్భాన్ని బట్టే శైలి. ఊరికధను కూడా ఎత్తుకుంటాను త్వరలోనే. ఐతే సౌందర్యలహరికే అగ్రతాంబూలం మరి.

   తొలగించు
 3. ఓ ఊరి కధా? ఏమౌతుంది? గురువు గారు వేరే దారిలో పడ్డారు. ఒక్కోసారి మనం ఆయన్ని భుజం తట్టి లేపుతూ ఉండాలి. మనందర్నీ ఇలా చివర్లో సశేషంలో వదిలేసి అసలు ఎంతమంది నా బ్లాగు చదువుతున్నారు అని టెస్ట్ చేయడం ఈయనకో సరదా!

  ఏమండీ, ఇవన్నీ మీరు పూర్తి చేయాలంటే నేను హైద్రాబాద్ వచ్చి మీ ఇంటి ముందు కర్ర పుచ్చుకుని కూర్చోమంటారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కొత్త తపస్సు మొదలెట్టారన్నమాట :))

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.