పగబట్టిన మేక |
ఆలు మగలును వారి యందాల సుతుడు మువ్వురే యైన నిత్యంబు నవ్వులొలకు చక్క నైనది సంసార మొక్క టుండె పరగ మేకల మందకాపరులు వారు |
హాయిగా నుండ నొక నాటి యర్థరాత్రి పిల్లవానికి యొడ లేమొ వెచ్చబడెను తల్లిదండ్రులు మిక్కిలి తల్లడిల్లి తలచి రే దృష్టిదోషమో తగిలె ననుచు |
ముధ్దు బిడ్డడు నే డిట్లు మూల్గుచుండ కారణం బేమి వీని కే గాలిసోకె భూతవైద్యుని వద్దకే పోవలయును గా దలంచిరి భీతులై కళవళపడి |
గంటగంటకు బిడ్డని యొంటి మీద జ్వరము హెచ్చుచు నుండగా చాల బెదరి గ్రామదేవత గుడివైపు మోము లుంచి మ్రొక్కుకున్నారు తల్లిరో ప్రోవుమనుచు |
భూతవైద్యుండు జూచి విభూది పెట్టె దడుపు జ్వరమది మరునాడె తగ్గిపోయె కోడిపుంజును వైద్యుడు కోరినాడు తల్లిజాతర నొక మేక చెల్లిపోయె |
గుఱ్ఱమును బలి యిమ్మని కోర దేమి ఏనుగును తెచ్చి బలి చేయ మన దదేమి పులియె కావలె నని కోర దలచ దేమి బక్కమేకను భుజియించ వలచు తల్లి |
అనుచు విలపించి విలపించి యనవరతము జబ్బుపడి చచ్చె పెంటియు చచ్చు వేళ తనకు వగదీరు పగదీరు దారి కొరకు అమ్మ నీరీతి ప్రార్థించె నాత్మ లోన |
చచ్చు మేకగ పుట్టుట పిచ్చితనము అమ్మరో నన్ను పుట్టించు మమ్మ పులిగ మా తలల వోలె మనుషు లీ జాతరలను పులుల తలలను తెగవేయబోరు గాదె |
నాదు పెనిమిటి మేకను నఱికి జంపి గంతు లేసిన వీరల యంతు జూతు వచ్చు జన్మంబు నందు నా కచ్చదీర వరము నీయవె తల్లి నా పక్ష మగుచు |
అటులె యగుగాక యని పల్కె నపుడు తల్లి పులిగ బుట్టిన మేకకు పూర్వజన్మ జ్ఞానమును నిల్చె మిగుల నాశ్చర్యముగను దాని పగదీరుటకు గూడ తరుణమాయె |
ఆలుమగలును బిడ్డయు నడవిదారి నేగు చుండగ పులి గాంచి యెగిరి దూకి పతిని పడవైచి సంతోష మతిశయించ చంపబోవుచు నంతలో సతిని జూచె |
మగడు చావగ నుండగా మగువ యచట పెద్దపెట్టున నేడ్చుచు పెద్దపులికి దండములు పెట్టుచుండె వేరొండు చేయ గలిగినది లేక కన్నీళ్ళు కారు చుండ |
అంతలో పెద్దపులియును నతివ యెడల జాలి గొని చేసె మనుజభాషణము నిటుల మేక కైనను పులికైన మీకు నైన ప్రాణమొక్కటె సృష్టిలో హీనురాల |
తొల్లి మీయింటి మేకనౌ యల్లనాడు మీరు నా జంట మేకను దారుణముగ కుత్తుకను కోసి బలిజేసి కులికినారు అమ్మ దయ పులినైతి మీ యంతు జూడ |
ఇన్ని నాళ్ళకు చిక్కితి రింక మీరు ప్రాణముల మీద నాశలు వదలు కొనక వేరు దారేమి గలదు పాపిష్టి దాన కోళ్ళ మేకల జంపెడు కుటిల బుధ్ధి |
పులిని క్రూరజంతు వటంచు పలుకుదురటె క్రూరజంతువు మనిషియే కువలయమున ఆటగా జంతువుల జంపు నల్పులార మీవి మాత్రమె ప్రాణాలు కావు సుమ్ము |
అనుచు కసిదీర నిష్ఠుర మాడి యాడి సతిపతుల వంక నతి తిరస్కారదృక్కు లను బరపి పులి వెండియు ననును కొంత సౌమ్య భాషణముల నిట్లు చాన తోడ |
ఆడుదానను బలహీను రాల నగుచు నప్పు డేడ్చితి చూడగా నిప్పు డీవు నేడ్చు చున్నావు నా ముందు హీనబలవు జాలి కలుగును వీనిని జంపబోను |
పతిని కోల్పడు నప్పటి బాధ గూర్చి యెఱుగనే నేను కావున నితని జంపి నిన్ను బాధించ బుధ్ది రాకున్న దిపుడు పొండు పొండింక బ్రతుకుడీ బుధ్ధి కలిగి |
ఇట్లు వాక్రుచ్చి యా పులి యేగె నెటకొ పుండరీకంబు చెప్పిన బుధ్ధి నెఱిగి నాట గోలెను వారెల్ల నయము మీఱ భూతదయ గల్గి యుండిరి పుడమి మీద |
15, అక్టోబర్ 2014, బుధవారం
పగబట్టిన మేక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నాలుగేళ్ళ క్రిందట వ్రాసిన ఈ ఖండికను ఇప్పటిదాకా 160 మంది మాత్రం చదివారు. నాటపాలకు వచ్చే చదువరులను బట్టి అది చెప్పుకోదగ్గ సంఖ్య క్రిందే లెక్క. ఐతే ఎవ్వరూ బాగుందనీ అనలేదు బాగోలేదనీ అనలేదు - అసలు స్పందించనే లేదు.
రిప్లయితొలగించండిశ్యామలీయం సర్!'అంతరంగపులి' ధన్యమైంది. మీ పులి మేకగా వున్నప్పటి దాని జంటమేక ఈ పులిగా వచ్చిందేమో.161 వ చదువరి నైన నాకు మీ పులి సందేశం చాలా చాలా బావుంది.🐯🙏
రిప్లయితొలగించండిYVR గారూ, ధన్యవాదాలండీ నా మేక గోడు విన్నందుకు!
తొలగించండినేను 162 🙂. ఊహ బాగుంది శ్యామలరావు గారూ.
రిప్లయితొలగించండి162
రిప్లయితొలగించండిదయచేసి కోడిగోడు,రొయ్యలగోడు,చేపల గోడు వ్రాయకండి. వ్రాసినా మాకు చెప్పకండి.చదివిన తర్వాత తినేటపుడు ఇదే గుర్తొస్తుంది.సందేశం బావుంది.
రిప్లయితొలగించండినీహారిక గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు మీకు ఇది నచ్చినందుకు.
కరుణశ్రీ బిరుదాంకితులు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం ఖండిక ఘంటసాల వారి రసార్ద్రగానమాధుర్యం పుణ్యమా అని విశేషంగా జనాదరణకు నోచుకుంది. అది విని ఆ రోజుల్లో ఆడవాళ్ళు చాలామంది పువ్వులు పెట్టుకోవటం మానేశారని విన్నాను. (ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఫాషన్ కాదని మానేస్తున్నట్లున్నారు, అది వేరే విషయం.)
అంతగా ప్రభావితం చేయటం చాలా కష్టమే.
నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు నాళం కృష్ణారావు గారి మీగడతరకలు నుండి చేపపిల్ల అనే ఖండిక పాఠ్యాంశంగా ఉండేది.
నిర్మలంబైన చల్లని నీరు కల్గి
తావి వెదజల్లు పద్మసంతతులు కల్గి
అని మొదలౌతుంది ఆ చేపపిల్ల ఖండిక. అది నన్ను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణారావు గారి కవనం మంచి ప్రాసాదగుణం కలిగి ద్రాక్షాపాకంలో ఉంటుంది. అలా వ్రాయాలని నాకు కూడా కొంచెం ఆశ అన్న మాట ఏమూలో లోలోపల.
చేపపిల్ల కథ చదివి ఎవరూ చేపలు తినటం మానారనుకోను. అలాగే ఈ మేకకథ చదివి మేకలజాతిని దయతో చూస్తారు మనుషులనీ అనుకోను లెండి.
పోనీ మీ అభిప్రాయం మాత్రం ఎందుకు కాదనాలీ?
మీరే వేరే ఏదన్నా మంచి అంశం సూచించండి, మరో జంతువు నా కవనంలో గొంతువిప్పేలోగా!
ఇట్టి కథ వలన మాకు మీ రిదియ చెప్ప
రిప్లయితొలగించండిదలచినది _ ' మేక మేకయే , పులి యవదని ' ,
పులికి కారుణ్య మొదవదు పుడమి మీద ,
కరుణ జూపుచో నది పులి కానె కాదు .
తాను పులిజన్మ కోరెను , తల్లి యిచ్చె ,
తనను బలియిచ్చి నట్టి వానిని వధించు
తరుణము లభించె , నైన , నా తగరు మేక
మేకపోతు గాంభీర్య మేమి వదలదుగ !
అదియునుంగాక , ఆహార మరయు కొఱకు
పక్షులను జంతువుల జంపు పక్షమందు
హింస యనరాదు , కక్ష వహించి చేయు
హింసయే హింస , యనఘ ! సహించు మయ్య !
మిత్రులు రాజారావు గారు,
తొలగించండిమీ అభిప్రాయాలు బాగున్నాయి.
ఐనా మేకపోతు గాంభీర్యం అని ఎందుకనుకోవాలీ? చంపకుండా పులిని అడ్డుకున్నవారు ఎవరూ లేరు కదా! పులి పులిలాగే బ్రతుకుతున్నది ఐనా ' కక్ష వహించి చేయు హింసయే హింస' అన్న మతం తెలిసి, కక్ష వదిలి జాలిగొన్నది. ఆహారార్థం చేసేది హింస కాదు కాబట్టి పులి అహింసను పాటించిందన్న మాట.