8, అక్టోబర్ 2014, బుధవారం

తెలుగు బ్లాగుల మాయా లోకం!


ఈ తెలుగు బ్లాగులోకం ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. చివరికి ఇది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావటం లేదు. ఎవరికి ఇబ్బంది కలిగినా నా మాటలవల్ల, ఎవరికి ఆక్షేపణ ఉన్నా నా మాటలపట్ల, ఒక్కటి మాత్రం పచ్చినిజం. తెలుగుబ్లాగుల్లో రాశి అత్యధికం వాసి అత్యల్పం అన్నట్లుగా ఉంది నేటి బ్లాగులోకపరిస్థితి.  

కొన్ని బ్లాగులు విద్వేషానలం వ్యాపింపజేస్తున్నాయి. అందులో మతవిషయక, రాజకీయవిషయక మైన బ్లాగులు కూడా ఉన్నాయి.

కొన్ని బ్లాగులు సజ్జలు. ఈ మాట అర్థం కావాలంటే త్రిపురనేని గోపీచంద్ గారి 'అసమర్థుడి జీవితయాత్ర' నవలను చదవాలి.  కోళ్ళు సజ్జలు తిని సజ్జలు పెడతాయట, అలాగు కొందరు పత్రికల్లో చదివినవి బ్లాగుల్లోకి ఎక్కిస్తున్నారు.  వారి ఆనందం వారిది.

కొందరు సొంతపైత్యాన్ని జనం మీద రుద్దేందుకు బ్లాగులు వ్రాస్తున్నారు. ఈ శ్యామలీయమూ ఆదే కోవ లోనిది కావచ్చునంటారా? మీ రౌనంటే నే కాదంటానా? 

ఈ బ్లాగుల్లోనూ అతివాద మితవాద, దుర్వాద, నిర్వాద, దురదవాద బ్లాగులు బోలెడున్నాయి. సంతలో సందడి సృష్టించటం అనే కార్యక్రమాన్ని వీళ్ళంతా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు దిగ్విజయంగా.

కొన్ని కొన్ని వినోదప్రధాన బ్లాగులున్నాయి. కొన్నికొన్ని వివాదప్రధాన బ్లాగులున్నాయి.

కొన్ని కొన్ని జండాల వాదాల బ్లాగులున్నాయి.  అందులో కొన్నింటికి ముసుగులూ ఉన్నాయి. అంటే ఇలాంటి బ్లాగుల్ని నిర్వహించే వారిని ముసుగు మనుషులు అనుకోవచ్చా అన్నారనుకోండి.  మీ యిష్టం మీది అంటాను.

కొన్ని కొని ఎజెండాల బ్లాగులున్నాయి. వీళ్ళకి ఇదమిథ్థమైన జండా ఏమీ ఉండక పోవచ్చును.  కాని ఓపెనో హిడెనో ఏదో రకమైన ఎజండా మాత్రం ఉంటుంది.  అంటే వీటిలోనూ ముసుగు సహిత ముసుగు రహిత అనే రకాలుంటాయన్న మాట గమనార్హం.

కొన్ని బ్లాగులు ఏదో సాధించేద్దా మన్నట్లు మొదలవుతాయి.  పాపం, జనాదరణ దొరికే దారిని వెతుక్కుంటూ చివరకు ఏవేవో వ్రాసుకుంటూ పోతుంటాయి.  

వీటిల్లో కొన్ని బ్లాగులైతే ఎడారిలో దారి తప్పిన బాటసారుల వంటివి. 

కొన్ని అదృష్టజాతక బ్లాగులుంటాయి.  ఇవి రెండు రకాలు.  టపాలపంట బ్లాగులూ, కామెంట్ల పంట బ్లాగులూ అని.  కొన్ని కొన్ని ఉభయవర్గాల్లోకీ వస్తాయి. 

వీటికి ఎప్పుడు తిరునాళ్ళ సందడే.   ఏ రకమైతేనేమీ, ఇవి పెట్టిపుట్టిన హిట్లవిరాట్లు.

కామెంట్లపంట బ్లాగులకు సాధారణంగా ఆస్థానవిద్వాంసు లుంటారు.  ఆ విద్వాంసులు నిరంతరాయంగా కామెంట్లను వండి వారుస్తూ ఉండటం వల్ల, సాధారణంగా ఆ బ్లాగులకు ప్రధాన పాఠకవర్గమూ వారే కావటం వల్లనూ హిట్లే హిట్లు, చాలా బ్లాగులకన్నా వేల రెట్లు.  అట్లు గాక ఇంకెట్లు?

టపాలపంట బ్లాగులలో రెండు రకా లున్నాయి.  స్వయంకృషి అనే దానికి కట్టుబడి  మరీ పంటలు పండించే బ్లాగులూ, టపాలపంట ఎలా వస్తేనేం, ఎలా తెస్తేనేం అనే  పరాన్నభుక్కు బ్లాగులూ అని ఇక్కడి వర్గాలు.  

కొన్ని కొన్ని బ్లాగులు పండగల్లాగా అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటాయి.  అంటే ఏదో పండక్కి కొత్తబట్టలు పెట్టినట్లుగా అరుదుగా టపాలు పెడుతూ ఉంటాయన్న మాట.  

కొన్ని కొన్ని బ్లాగులు తోకచుక్కలు.  ఎప్పుడన్నా తోకచుక్కను చూసారా? అతి అరుదు కదా? కాని తోకచుక్క వస్తే అనేక రోజులు వరసగా కనిపిస్తుంది   ఆ తరువాత దీర్ఘ కాలం పాటు మాయం!

కొన్ని కొన్ని బ్లాగులు ఇక్కడికి వచ్చి కొంచెం నలుగురితో కలిసిమెలిసి ఉందా మనుకుంటాయి.  ఇక్కడ నెగ్గుకు రావాలంటే ఏం చేయాలో తెలియక,  ఎంతో నిబధ్ధతతో వ్రాసిన టపాలు జనామోదం నోచుకోక ఇది మనకు సరిపడే వ్యవహారం కాదులే అని మూసుకొని పోతూ ఉంటాయి. 

కొన్ని కొన్ని అమాయక బ్లాగులు.  కొందరు పెద్దమనుషులు ఇలాంటి అమాయక బ్లాగులు వ్రాస్తుంటారు.  ఏదో జనానికి పనికి వచ్చే పని చేసేస్తున్నామూ అని వాళ్ళలో వాళ్ళే తెగ ఆనంద పడిపోతూ ఉంటారు. నిజం కూడానూ. ఏదో ప్రపంచానుభవాన్ని నలుగురికీ పంచే వాళ్ళు, చదివి తెలుసుకున్నవి పదిమందికీ చెప్పాలనుకున్న వాళ్ళు,  సామాజికస్పృహో చట్టుబండలో ఏదో ఒకటి - దాని పట్టుకుని పది మందికోసం అంటూ వ్యాసాలూ వగైరా దంచే వాళ్ళు ఇల్లాగా అనేకమంది కొద్దో గొప్పో యమ సీరియస్సు గానే బ్లాగులు వ్రాసే వాళ్ళున్నారు.  ఇందులో సాంకేతికపరమైన అంశాలమీద నడిచే బ్లాగులూ ఉన్నాయి. 

ఇలా తెలుగు బ్లాగు ప్రపంచం పరమ సందడిగా ఉందొ.  కాని అది ఒక  సంతలాగా ఉంది కూడా.  అమ్మకందార్ల అరుపులు కొనుగోలుదార్ల విరుపులూ కలగాపులగంగా కలిసి ఒక సంత అంతా ఎలా గందరగోళంగా ఉంటుందో బ్లాగులోకమూ అలాగే ఉంది.  మిగతా బ్లాగులలోకాల గురించి నాకు తెలియదు కాని  మన తెలుగు బ్లాగులోకం మాత్రం అచ్చం ఇలాగే ఉంది.

ఒకప్పుడు -అంటే - నేనింకా పహెలా పచ్చీసులో ఉన్న రోజుల్లోనే ఏవో యాత్రలంటూ ఊళ్ళు తిరిగాం చాలాసార్లే.  ఒకసారి బెంగుళూరూ తగిలింది ఆ యాత్రల్లో ఒక దానిలో.  రవి వర్మ ఆర్ట్ గ్యాలరీ చూదాం అంటే ఒక్కరూ ఆసక్తి చూపలేదు.  ఏదో నేనూ, మరొక మిత్రుడూ వెళ్ళాం మంథా లక్ష్మణమూర్తితో - ఆయన మంచి  చిత్రకారుడు లెండి.   బెంగుళూరు నుండి తిరుగు ప్రయాణంలో ఉండగా చూద్ధుము కదా, అనేక మంది చేతుల్లో ఆర్ట్ పీసులు  అవీ, బెంగుళూరు వీధుల్లో షాపుల్లో కొన్నవి.  అద్భుతమైన కలాపోసన మనది.  

ఈ ముక్క ఎందుకు ప్రస్తావించానంటే, బ్లాగు సంత లోకపు వ్యవహారమూ ఇలాగే.  ఏదో విషయం ఉన్న క్లాసు బ్లాగులూ ఆర్ట్ గ్యాలరీల్లాగా సందర్శకుల కోసమూ వారి నుండి ఒక్క  మంచి ముక్క కోసమూ ముఖం వాచవలసినదే.  పికాసోవి పిచ్చి బొమ్మలూ అనే బాపతు వాళ్లలాగా ఈ అమాయక బ్లాగుల్లో దూరి అల్లరి చేసే వాళ్లకు మాత్రం కొరత ఆట్టే ఉండదు.  

లోకంలో ప్రసిధ్ధి చెందిన చిత్రకారుల అపూర్వ చిత్రరాజాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనకు దర్శనం ఇచ్చేవి చాలావరకూ నకిలీలూ అంటే నిజంగా మతిపోతుంది.  కాని అది నిజమే.  అలాగే, కళ్ళముందే తమ టపాలకు నకిలీలూ , ఆ నకిలీలకే భళాభళీలూ చూస్తూ పాపం అమాయకులు ఎలా తట్టుకోగలరు చెప్పండి.  విషయపరిజ్ఞానం బొత్తిగా లోపించిన మహానుభావులు ఈ క్లాసు బ్లాగుల్లో దూరి నిందలూ వాళ్ళ బొందలూ లాంటి కామెంట్లకు దిగి విసిగిస్తుంటే ఆ అమాయకులు ఎన్నాళ్ళు ఓపిగ్గా తట్టుకుంటూ సమాధానాలిస్తూ కాలక్షేపం చేయగలరు చెప్పండి?  ఎంత కాలక్షేపం కోసమే వ్రాసినా, ఎంత పనిలేదని వంకబెట్టి వ్రాసినా పనీపాటా లేని జనంతో కాలక్షేపం చేయాలంటే విసుగు పుట్టదా మరి చెప్పండి.

అందుకే కొందరు బ్లాగర్లు వ్రాయలేక మానలేక అవస్థ పడుతున్నారు.
కొందరు బ్లాగర్లు ఇలా ఇంకెన్నాళ్ళూ అని బాధపడుతున్నారు.
చివరికి, కొందరు బ్లాగర్లు ఇంక నాకు సాధ్యపడదూ అని చెప్పలేక చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన బ్లాగుప్రపంచం కావాలంటే మనం అంటే బ్లాగులు వ్రాసేవాళ్లమూ చదివే వాళ్లమూ మంచి పధ్ధతులు పాటించాలి.  లేకపోతే ఇది ఇంకా కుప్పకూలి పోతుందని నా అనుమానం. 

15 కామెంట్‌లు:

  1. మీ వ్యాసంలో నన్ను నేను వెతుక్కోడానికి ప్రయత్నం చేసేను కాని సాధ్యపడలేదండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది మాయాలోకం కదండీ, మనని మనం వెతుక్కోవటమూ కొంచెం కష్టమే అవుతుంది మరి!

      తొలగించండి
  2. బాగా విశ్లేషించారు .. శ్యామలీయం గారూ

    రిప్లయితొలగించండి
  3. కొత్త నీరు కూడ రావాలి. అప్పుడే మార్పు వస్తుంది.
    ఇక్కడ ఎంతమంది ఉపాధ్యాయులున్నారో నాకు తెలియదు కాని, వారు వాళ్ళ విద్యార్థులని చిన్న చిన్న విషయాలపై బ్లాగులు వ్రాసేలా ప్రోత్సహిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  4. బాగా రాశారు... శ్యామలీయం గారూ

    రిప్లయితొలగించండి

  5. అయ్యా,బ్లాగు అంటేనే తనకు ఇష్టమైనది,తోచినది,రాయడమన్నమాట.అశ్లీలం,indecency ,తిట్లు,లేకుండా రాస్తే చాలు.మనకిష్టం లేనివి చదవనక్కరలేదు.కామెంట్ చెయ్యనక్కరలేదు.కాని బ్లాగుల్ని regulate చెయ్యలేము. అవసరం కూడా లేదు.సమాజంలో ఎన్నో రకాల వాళ్ళు ఉన్నట్లే ,బ్లాగర్లలో కూడా ఎన్నో రకాలు ఉంటారు కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కమనీయం గారూ, నేను ఆ మాట 'పనిలేక' బ్లాగులో చెప్పనే చెప్పాను కదా. ఈ‌రోజు జిలేబీ‌గారూ దాన్ని మరలా ఎత్తి చూపారు తమ బ్లాగులో. బాల్గుల్ని రెగ్యులేట్ చేయాలనటం లేదు. బ్లాగర్లు, కామెంటర్లు కాస్త హుందాగా ఉంటే బ్లాగులోకానికి మంచిపేరూ వస్తుందని అంటున్నా అంతే,

      తొలగించండి
  6. శ్యామలీయం గారు,

    పోస్టు చాలా బాగా రాశారు.

    ఇప్పుడే జిలేబి గారి బ్లాగులో కామెంట్ రాశాను. వీలైతే చూడండి.

    నాకు బూతు వెధవల బూతు కామెంట్లు అలవాటే. కాకపోతే ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను. కోపం వస్తుంది. ఫలితంగా పేషంట్లు, నర్సులు ఇబ్బంది పడుతున్నారు.

    ఇందాక జిలేబి గారి బ్లాగు చూసేదాకా.. మళ్ళీ రాద్దామనుకోలేదు. అక్కడ హరిబాబు అన్నాయన చేసిన దరిద్రపుగొట్టు వ్యాఖ్య చదివాక.. బ్లాగు కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. కామెంట్స్ సెక్షన్ కూడా ఎనేబుల్ చేస్తాను.

    నేను రావిశాస్త్రి అంటే - చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం, ఎంతో ఎంతో ఎంతో ఎంతో ప్రాణం. అందుకు నేను మిక్కిలి గర్విస్తున్నాను. ఎవడికైనా అభ్యంతరం వుంటే.. అది వాడి ఖర్మ.

    రిప్లయితొలగించండి

  7. భేష్ భేష్ !!

    మీ కామెంటు ల తో ప్రోత్సహింప 'పడి' నట్టు ఉన్నారు పని లేక రమణ గారు. మళ్ళీ 'ఫార్మ్' కి వచ్చేసేరు ఇవ్వాళ

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. బయట ప్రపంచానికి ప్రతిబింబంగానే బ్లాగు ప్రపంచమూ ఉంటుంది కదా శ్యామలీయం గారు. రాటుదేలాలే తప్ప రాలిపోకూడదు. బ్లాగులలో పిచ్చి కామెంట్లు చేశేవారికి జడిసి బ్లాగులలో కామెంట్లను రద్దు చేయకూడదు. రమణగారు తిరిగి కామెంట్లను ఎనేబుల్ చేయడం ఆహ్వానించదగినది. వ్యాసం బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. >బయట ప్రపంచానికి ప్రతిబింబంగానే బ్లాగు ప్రపంచమూ ఉంటుంది కదా
      అదే కదా విషాదం. బ్లాగులు వ్రాసేవారూ, ఆ బ్లాగుల్లోని టపాలపై వ్యాఖ్యలు చేసేవారూ కూడా కొంచెం హుందాగా ఉంటే బ్లాగుప్రపంచం కొంచెం ప్రతిష్టాత్మకమైన రంగస్థలంగా ఉంటుంది. అదే అభిలషణీయం. ప్రస్తుతం ఈ రంగస్థలం ఒక రణస్థలంగా ఉంది, ఇలా బాగాలేదు. అచ్చం బయటి ప్రపంచానికి నకలుగా ఆవేశకావేశాలూ, అనుచితభాషాభాషణాలు, అసందర్భపు వ్రాతలలో మోతమ్రోగుతూ ఉంటె మళ్ళా ఈ బ్లాగుప్రపంచం‌దేనికీ మనకి? ఉన్న బహిఃప్రపంచం చాలును కదా?

      దాదాపు అన్ని బ్లాగులూ చదువరుల విజ్ఞతమీద అపారనమ్మకంతో కామెంట్లను ఉదారంగా ఆహ్వానిస్తాయి. వాటికోసం ఎదురుచూస్తాయి కూడా. చివరికి వాటిలో వచ్చే దుర్భాషలను తట్టుకోలేక, మంచి చదువరుల మాటలు వదులుకోలేక చివరకు మోడరేషన్ బాటపడతాయి. ఇలా మోడరేట్ చేసే బ్లాగులు పెరుగుతున్నాయీ అంటే దానర్థం కామెంటర్ల విచక్షణ తక్కువగా ఉంటోందని నా అర్థం కాదు. విచక్షణలేని కామెంటర్లు పెరుగుతున్నారని!

      చిత్రకళకు సంబందించిన ఒక వాదం ఉంది. ఈ కళ ప్రపంచాన్ని ప్రతిబింబించాలా, స్వతంత్రంగా ఉండాలా అని. చివరకు ఉన్నదున్నట్లు ఫోటోలు వేయటం కోసం కాదు చిత్రకళ అన్న వాదమే బలపడింది. అలాగే వీధిపోరాటాల్లాగా బ్లాగులూ, వ్యాఖ్యలూ ఉండకూడదన్నదే చివరకు గెలిచే ఆలోచనాధోరణి కావాలి. లేకపోతే ఇందులో ప్రత్యేకంగా ఎవరూ దేనినీ ఆశించవలసిన పనిలేక, ప్రమాణరాహిత్యమూ, విషయరాహిత్యమూ కారణాలుగా మరింతగా కూలిపోతుంది బ్లాగుప్రపంచం.

      తొలగించండి
    2. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. బ్లాగుప్రపంచం మీరన్నవిధంగా బాగుపడాలని ఆశిద్దాం.

      తొలగించండి
  9. విమర్శలేనిదే విషయానికి విశిష్టత లభించదు. కామెంట్ల ద్వారానే కొత్తవిషయాలు వెలుగులో వస్తాయి. అయినా కొన్ని టపాలు, కామెంట్లు సహనాన్ని, బీపీని పెంచేమాట వాస్తవమే అయినా లోకో భిన్నరుచి: అన్నట్లు సర్దుకుపోక తప్పదు. సహజంగా ఎక్కువశాతం మంది బావిలో కప్పల్లా తాము చెప్పేదే సత్యమనే అభిప్రాయంలోనే ఉంటారు, అలాంటివారిని వారి విజ్ఞతకే వదిలేయడం ఉత్తమం. ఒకవేళ ఎదుటివాడు విమర్శించేది సత్యమనే అనిపించినా అంగీకరించడానికి కొంతమందికి అహం అడ్డు వస్తుంది. స్పర్దాయ వర్ధతే విద్యా అన్నట్లు భేదాభిప్రాయాలు ఉన్నపుడే నాలుగు కొత్త విషయాలు బయటకు వచ్చేవి. లేకపోతే ఇక్కడ రాసే బ్లాగులు ఎక్కడో ఒక చోట ఉన్న విషయాలే, చర్చించిన విషయాలే. ఇక మనం రాసే టపాను బట్టి కామెంట్లు వస్తుంటాయి, వాటికి సిద్దమైనపుడే అలాంటి టపా రాయాలి. నిజం చెప్పాలంటే పనికిమాలిన బ్లాగులకి, టపాలకే వీక్షకుల తాకిడి ఎక్కువ. వీక్షకుల తాకిడి దృష్టిలో ఉంచుకుని టపాలు రాస్తే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే, సంతోషం కలుగుతుందేమో కాని సంతృప్తి లభించదు. రాయబడే ప్రతి టపా ఎవరికో ఒకరికి ఉపయోగపడేవి లేదా సంతృప్తి పరుస్తాయి. విషయం ఉన్నదైనా లేనిదైనా వారికి తోచింది రాయటం మంచిదే. కొందరి పొగడ్తలు కాని విమర్శలు కాని కొత్త విషయాలు వెలికి తీసి రాయాలనే దానికి దోహదం చేస్తాయి. ఇక్కడ నా అనుభవం చెప్పుకోవాలి, ఇంతకుముందు వేరే అకౌంట్ తో భిన్న విహయాలపై దాదాపు ఎన్నో బ్లాగులు, వందల పోస్టులు వేశాను, నిజానికి అన్నీ మంచివే కాని బ్లాగుల సముదాయాల్లో కలపక పోవటంవల్ల సందర్శకుల తాకిడి గాని, కామెంట్లు గాని రాలేవు, సంవత్సరాలు రాసిన ప్రశాంతతకు, పనికీ భంగం కలగలేదు, అదీ కాక మంచి స్నేహాలు లభించాయి, సంతృప్తీ కలిగింది కూడా. కొంతకాలం బ్లాగు ప్రపంచానికి దూరం అయి నాపనిలో నేను పూర్తిగా నిమగ్నమయ్యా. ప్రస్తుత అకౌంట్ ఏదో తెలంగాణాఉద్యమం జరుగుతున్నపుడు కాకతాళీయంగా ఏర్పరచుకొని బ్లాగు రాయటం మొదలుపెట్టా. ఏదో తీరికప్పుడు రాయటం పోయి ఇదేదో నిత్యవిధిలో ఒక భాగమైపోయింది. బ్లాగుల సమాహారాల్లో కలిపాక కామేంట్లు రావటం వాటికి సమాధానాలు రాయటం అనేవి సమయాన్నే కాక ఒక్కోసారి శిరోభారంగా కూడా అనిపించిన మాట వాస్తవం. అయినా ఏదో ఉత్సాహం, ఏదో కొత్తగా శొదించి, సాధించాలి అనే ప్రోత్సాహం కామెంట్ల వల్ల కలిగింది అనే చెప్పాలి. దీనివల్ల నాకు లభించిన అత్యంత విశేషలాభమేమంటే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని శోధించటం, ఎవరూ కనిపెట్టలేకపోయిన అత్యంత ముఖ్యవిషయాలు నాకు లభించటం. (వాటిని త్వరలో అందరిముందుకు తేవడానికి కృషి జరుగుతుంది.) మనం ఏదో టైంపాస్ గా రాసుకునేవి కూడా మనకు మంచినే చేస్తాయి అనేది నా అనుభావాలు చెబుతున్నాయి. ఏతావాతా చెప్పేదేమంటే మనకు దొరికే తీరిక సమయాల్లో బ్లాగులు రాయటం, వ్యాఖ్యలు చేయటం వంటివి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా మనమటుకు మనం కొనసాగించాలి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.