20, అక్టోబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 19 ముఖం బిందుం కృత్వా .... (కొనసాగింపు)



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

ఈ ముఖం బిందు కృత్వా అనే శ్లోకం కామరాజ ప్రయోగం అని కూడా అంటారు. 

ఐహికార్థంలో చూస్తే ఈ శ్లోకం యొక్క ప్రయోగానికి ప్రయోజనం స్త్రీవశ్యం. ఐతే అటువంటివి సమయమతంలో ఉద్దిష్టప్రయోజనాలు కావనే తప్పకుండా చెప్పుకోవలసి ఉంది.

శ్రీవిద్యలో రకరకాల విధానాలు ఉన్నాయి కాని ముఖ్యంగా చెప్పుకోవలసినవి రెండు విధానాలు. ఒకటి దక్షిణామ్నాయము లేదా సమయమతం అని వేదసమ్మతమైన విధానం.

రెండవది వామము లేదా వామాచారము అని పిలువబడే విధానం.

ఈ రెండు విధానాల్లోనూ ఉన్న బేధాల్లో ముఖ్యమైనది దృక్కోణం.  సమయమతం కేవలం ఆముష్మిక ప్రయోజనాన్ని ఉద్దేశించినది,  వామాచారం హెచ్చుగా ఐహికప్రయోజనాలసిధ్ధి కొరకు ఆచరించబడేది.

దక్షిణామ్నాయం లేదా సమయమతం కేవల సాత్విక మైన ఆరాధనా విధానం.

వామాచారం భీభత్సమైనది. దానిలో మధ్యమాంసాదులతో పూజలు చెప్పబడుతాయి. ఈ విధానాన్ని అనుసరించే విద్యలు క్షుద్రవిద్యలు. రకరకాల ప్రయోగాలు ఇలాంటివి. ఇందులో మాదనాది ప్రయోగాలూ ఉన్నాయి.  కొన్ని విద్యాసిధ్ధులకోసం బాలజిహ్వాఛ్ఛెదనాది దారుణమైన క్రియలూ, కొన్ని పూజావిధానాల్లో ప్రత్యక్షస్త్రీయోని పూజలూ వగైరా వ్యవహారాలతో ఈ వామాచారం ఘోరంగా ఉంటుంది. వైదికవ్యవహారప్రియులు వీటికి దూరంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వామాచారం వేదబాహ్యం.

ఈ శ్లోకంలోనూ మరికొన్ని శ్లోకాల్లోనూ ఐహికమైన ఇటువంటి తంత్రప్రయోగాలను శ్రీశంకరులు ప్రస్తావించటం గమనించవచ్చును.

ఐతే  వీటిని ప్రస్తావించటంలో శ్రీ శంకరుల ఉద్దేశం సమయమతానుసారంగా వీటిని నిర్వచించటమే అని నా ఉద్దేశం.

క్లీం అనేది కామరాజబీజం. ఇది సర్వవశీకరణ సమర్థమైనది. దీనిని శ్రీశంకరులు ఈ శ్లోకంలో ప్రస్తుతి చేస్తున్నారు. స్థూలార్థంగా ఆయన చెప్పినది ఈ కామరాజబీజం యొక్క ప్రయోగాన్ని ప్రస్తవించి, ఈ విధంగా అమ్మ అరుణను ఆరాధించిన వారికి ఇష్టస్త్రీలు తక్షణం వశులైపోతారు అని చెప్పటం. ఐతే ఆయనకు ప్రత్యేకమైన శైలిలో ఆయన ఇక్కడ సమయమతాను సారంగా దీన్ని తీర్చిదిద్ధిన విధానం పరిశీలించండి.

మూడులోకాలు అనేదే త్రికోణం అని నిర్వచించారు. ఆ ముల్లోకత్రికోణానికి స్తనస్థానాలు సూర్యచంద్రులు అని చెప్పారు. అంటే ముల్లోకాల యొక్క స్వరూపం కూడ అమ్మ కామకళారూపం అని చెప్పటం తాత్పర్యం.

రుద్రయామళంలో "త్రిలోకీయం తవాంబికే కామరాజకళారూపా జాగర్తి స చరాచరా" అని ఉంది. శృతికూడా

య ఈగ్‍ం శ్రుణోత్యలకగ్‍ం శ్రుణోతి
నహి ప్రవేద సకృతస్య పంథా మితి

అని చెబుతున్నది.  అందుచేత త్రిలోకాలలూ అమ్మ యొక్క సృష్టిరూపమైన కామకళగా భావించటం వేద విహితమే.  దీని అర్థం త్రిలోకాలనూ అమ్మ సంకల్పమే సృష్టిస్తున్నదని చెప్పటం. 

అదృశ్యరూపంగా ఉన్న అమ్మ ముఖ పద్మమూ వాటికి దిగువన సకలజగత్పోషణాదక్షమైన అమ్మస్తనద్వయంగా కనిపించే సూర్యచంద్రులూ అన్న భావనతో భగవతి అరుణను ఉపాసించే విధానం సమయమత సమ్మతం. ఇలా చేసే భక్తులకు మూడులోకాలనూ కూడా సమ్మోహనపరచగల శక్తి ఉంటుంది అని చెప్పటంలో అర్థం త్రిలోకాలలోనూ అమ్మ సంకల్పం సంచరించే విధానం వారికి ప్రసన్నంగా ఉంటుందని చెప్పటమే.  అందుచేత వారికి త్రిలోకాలలోనూ అగోచరమైన తత్త్వం ఏదీ ఉండదు.

ఈ కామరాజబీజం యొక్క దివ్యశక్తిని తెలిపే కథ ఒకటి దేవీ భాగవతంలో ఉన్నది. అది సుదర్శనుడనే రాకుమారుని కథ,

ఈ కథను మనం సూక్ష్మంగా చెప్పుకుంధాం.  రాజ్యంపోయి మున్యాశ్రమాల్లో నివసిస్తున్న ఒక రాణీ కొడుకు ఈ  సుదర్శనుడు. ఎవరో ఏదో సందర్భంలో ఎవరిని గురించో క్లీబుడు అని సంబోధిస్తారు. అప్పటికి సరిగా ఊహ తెలియని ఈ పిల్లవాడు ఆ మాటను క్లీం అని గ్రహించి వినటానికి బాగుండటంతో నిత్యం క్లీం క్లీం అంటూ ఉండే వాడు. పెద్దైనా ఆ ఆలవాటు పోదు. ఆ అమాయకమైన వచో విన్యాసానికే అమ్మవారు ముచ్చటపడి అతడికి పెళ్ళికూతుర్ని చూడటమే కాదు, ఏకంగా పెళ్ళికి వచ్చిన విఘ్నాల్నీ తొలగిస్తుంది. ఆ అమ్మాయి పేరు శశికళ. ఆమెకు కలలో కనిపించి ఫలానా రాజకుమారుడు నా భక్తుడు యోగ్యుడు నీకోసం ఎంపిక చేసానూ అని చెప్పి ఆ పిల్లను ఆదేశిస్తుంది. ఆ శశికళ స్వయంవరాన్ని తిరస్కరించి తండ్రిని ఒప్పించి సుదర్శనుణ్ణి పెళ్ళాడితే మిగతా రాజులతో పెద్ద యుధ్ధం వస్తుంది.  అందులో అమ్మవారే స్వయంగా సింహవాహనంతో విచ్చేసి మరీ సుదర్శనుణ్ణి గెలిపిస్తుంది.

చూసారా కామరాజబీజం యొక్క శక్తిని.  దీనిని వామాచారులు స్త్రీవశ్యానికి వాడటం వేరే సంగతి.   అటువంటి వారికి వచ్చే ఫలసిధ్ధి కేవలం ఐహికం కావటం వల్ల ఆధ్యాత్మిక పురోగతికి ఏమీ పనికి వచ్చేది కాదు కదా.

అమాయకమైన కామరాజబీజోపాసనకే అమ్మవారు వచ్చి అండగా ఉండి తల్లిలా రక్షించింది

అమ్మను జగత్రయత్రికోణ సంస్థితయైన అరుణగా సంభావించి ఉపసిస్తే అది సమయమతం ప్రకారం ఎంత సిధ్దిదమో ఆలోచించుకోండి.

ఈ శ్లోకానికి పారాయణం రోజుకు పన్నెండు వందలసార్లు చొప్పున నలభైఐదు రోజులు. నైవేద్యం పాలు, తేనె, అరటిపండ్లు. ఫలితం మనోవశీకరణం.

5 కామెంట్‌లు:

  1. నమస్తే
    కామరాజ బీజోపాసన వలన లౌకిక సౌఖ్యాలకు వాడటం వలన లౌకిక కామాదులు, స్త్రీసమ్మోహనాలు సిద్ధించవచ్చు కానీ, అది ఆచార్యుల ఉద్దేశ్యం కాదు కదా! మనకి అవైదికమైన ఆ ఎడమవేపు ఆచారాలక్కరలేదు. ఇక్కడ శివుని హరునిగా పిలిచారు ఆచార్యులు, హరుడు = తీసివేసేవాడు, తొలగించేవాడు అంటే లయించేవాడు. ఇది ఇలా ఉంచితే, స్త్రీముఖమును బిందువులో ధ్యానించి ఆ క్రిందగా కుచద్వయాన్ని ధ్యానిస్తున్నారు అంటే అవి అమ్మతనాన్ని ఉపాసించమని అర్థంగా సూచన తప్ప స్త్రీత్వానికి అని కాదు. ఈ బీజోపాసనను పైన చెప్పిన విధంగాచేయడం వల్ల, వెంటనే సమస్త స్త్రీలు అలాగే సూర్య చంద్రులను స్తనములుగా గల తల్లిని కూడా మోహంలో ముంచెత్తగలిగే ఫలాన్ని పొందగలడు. అదేంటీ సూర్య చంద్రులను స్తనములుగా కలిగిన తల్లిని కూడా మోహంలో ఉంచెత్తగలడా అన్న అనుమానమే అక్కరలేదు.... స్త్రీలలో ’అమ్మతనాన్ని’ దర్శించగలిగినవాడికి స్త్రీలందరూ వశవర్తులై కన్నకొడుకునుకాపాడినట్లు కాపాడరూ... పైన దేవీభాగవతంలో ఘట్టంలో ’క్లీబా’ నుండి ఈ క్లీం బీజం తెలియక జపించినందుకు ఆ అమ్మవారే 18 భుజాలతో ఒడిసిపట్టి మరీ కాపాడలేదూ...!

    ఈ కామరాజ బీజాన్ని తప్పుడుగా వాడుకుంటే ఆ కామరాజు వల్లనే మళ్ళీ మళ్ళీ సంసారంలోకి రావడం, లేకపోతే ఆ అమ్మ కరుణ వల్ల సమస్తమునూ హరించి విశ్రాంతినిచ్చేవానిలో ఏకమై కైవల్యాన్ని పొందడం....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు నాగేంద్రగారూ. నేనుకూడా కామరాజ బీజోపాసన వలన లౌకిక సౌఖ్యాలకు వాడటం ఆచార్యుల ఉద్దేశ్యం కాదు అనేగా వివరణ ఇచ్చినదీ? అలాగే సుదర్శనుడికథనూ ’క్లీబా’ నుండి ఈ క్లీం బీజం తెలియక జపించినా అమ్మవారు ఏ విధంగా తల్లియై అతడిని సంరక్షించిందో చెప్పాను కూడా. మీ అనుమానం దేనిగురించి ఐనదీ, నాకు అర్థం కాలేదు.

      తొలగించండి
  2. నో నో, నాకనుమానం లేదండీ, స్తనములు జస్ట్ రిఇన్స్టేటెడ్ వాట్ యు టోల్డ్, కుచ ద్వయం ’స్త్రీ స్వరూపంగా’ కాక మాతృత్వ సూచికలుగా స్వీకరించాలి అన్నది ఉద్దేశ్యం అంతే.. రెస్ట్ ఈజ్ ఎక్స్టెన్షన్

    రిప్లయితొలగించండి
  3. అవును. ఈ విషయం గతశ్లోకాల్లో ఒక దానిలో "కుచ ద్వయం ’స్త్రీ స్వరూపంగా’ కాక మాతృత్వ సూచికలుగా స్వీకరించాలి అన్నది ఉద్దేశ్యం" అని ప్రస్తావించాను కూడా.

    రిప్లయితొలగించండి
  4. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం బీజమంత్రంలు కలిపి చేయవచ్చా?

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.