31, అక్టోబర్ 2014, శుక్రవారం

అనంతమైన చదువు కథ

ఎంత చదివినా ఇంకా చదువవలసింది ఎంతో ఉంటుంది.

ఎంత తెలుసుకున్నా తెలియనిదే అనంతంగా ఉంటుంది.

తెలుసుకోవటం అన్నదానికి కాస్త గంభీరమైన మాట జ్ఞానసముపార్జనం.

ఎవరికైనా  తెలుసుకోవటానికి అంతం ఉంటుందా అని ఒక ప్రశ్న రావచ్చును.

ఈ రోజున కొండలరావుగారు ఈ ప్రశ్నను చర్చకు పెట్టారు.

నిజానికి తెలుసుకోవటానికి అంతేమీ ఉండే అవకాశం లేదు.

ఈ మాటను నిరూపించే కథ ఒకటి మహాభారతంలో ఉంది. దాన్ని ఒక సారి చెప్పుకుందాం.

ఒక ఋషికి జ్ఞానసముపార్జనం అంటే అమిత ప్రీతి. ఆయన తన జీవితకాలం అంతా ఎన్నో ఎన్నో విషయాలు చదివి తెలుసుకుంటూ, పెద్దలవద్ధ విని తెలుసుకుంటూ  జ్ఞానసముపార్జనం చేస్తూనే ఉండిపోయాడు.

ఆ ఋషికి అంత్యకాలం సమీపిస్తోంది. మునికేమీ గమనిక లేదు. చదువుకుంటూనే ఉన్నాడు.

స్వయంగా ఇంద్రుడు ప్రత్యక్షం ఐనాడు. ఓ ఋషివరా, చదివింది చాలేమో ఆలోచించుకో, నీ ఆయుఃప్రమాణం పూర్తికావస్తోంది అని హెచ్చరించాడు.

మునికి నిరుత్సాహం కలిగింది. అయ్యో,  ఇంకా చదవవలసింది ఎంతో ఉందే, అప్పుడే ఈ శరీరం పడిపోవటమా అని విచారించాడు.

ఇంద్రుడితో ఈ ముక్కే విన్నవించాడు. ఇంద్రుడు నవ్వి, సరే నయ్యా నీకు మరొక జీవితకాలం అయుఃప్రమాణం ఇస్తున్నాను, చదువుకో చదువుకో అని వెళ్ళి పోయాడు.

ఆ అయువూ తీరిపోవచ్చింది. మళ్ళీ ఇంద్రుడు వచ్చి హెచ్చరించటమూ జరిగింది.  ఋషికి ఇంకా చదువుకోవాలని ఉన్నది. మరొక సారి ఇంద్రుడు దయతో మరొక జీవితకాలాన్ని అనుగ్రహించాడు.

ఇలా మరలా మరలా జరుగుతూనే ఉన్నది. ఋషి కోరటమూ. ఇంద్రుడు వరం పొడిగించటమూ, మరలా ముని చదువులో మునిగితేలుతూ ఉండటమూ.

చివరికి ఇంద్రుడు ఇక లాభం లేదనుకున్నాడు.ఓ ఋషివరా, ఎంతకాలం ఇలా చదవా లనుకుంటున్నావో చెప్పవయ్యా అని నిలదీసాడు.

అంతా చదవాలి నేను అన్నాడు ఋషి.

అంతా అంటే అన్నాడు ఇంద్రుడు.

ఇంక తెలుసుకోవటానికి ఏమీ మిగిలి ఉండకూడదు. సమస్తమైన వేద విజ్ఞానమూ నాకు తెలియాలి అన్నాడు ముని.

అన్నట్లు వేదం అంటే తెలుసుకో దగినది అని అర్థం.

ఇంద్రుడు నవ్వాడు.జ్ఞానం సంపూర్ణంగా సంపాదించేదాకా చదవాలనే నా కోరిక అని ఋషి పునరుద్ఘాటించాడు.

ఇతడికి ఎలా చెప్పాలా అని ఇంద్రుడు కొంచెం యోచన చేసాడు.

ఓ ఋషిశ్రేష్ఠా నీకు దివ్యదృష్టిని అనుగ్రహిస్తున్నాను. అద్భుతమైన వేదరాశిని నీవు ఆ దృష్టి సహాయంతో వీక్షించు అన్నాడు.

ఒక అంతూ పొంతూ లేకుండా అఖండమైన దివ్యస్వరూపంతో దర్శనం ఇచ్చిన ఆ వేదరాశిని చూసి మునికి పరమానందమూ పరమాశ్చర్యమూ కలిగాయి. అది అనేక మహోన్నత శిఖరాలతో అలరారుతున్న పర్వతశ్రేణుల్లా ఉందనిపిస్తోంది. ఎటు చూసినా అది మరింత మరింతగా విస్తరించి  ఉంది.

ఆ అబ్బురపాటునుండి మెల్లగా తేరుకున్న తరువాత, చిరునవ్వుతో తననే తిలకిస్తున్న ఇంద్రుని కేసి తిరిగి ఒక ప్రశ్న వేసాడు ఋషి.

ఎంత గొప్పదర్శనం కలిగింది! మహాత్మా, ఇందులో నేను ఇప్పటిదాకా తెలుసుకున్నది ఎంత ఉన్నదీ దయచేసి చెప్పండి అన్నాడు.

శ్రీశచీపురరందర ఋషి అనుగ్రహపూర్వకంగా చూసి, వేదరాశిలోనుండి అక్కడక్కడా కొన్నికొన్ని పత్రాలను సేకరించాడు.

ఒక గుప్పెడు పత్రాలను తీసి ఋషికి చూపి, ఇదేనయ్యా ఇంతవరకూ ఇన్ని ఆయుర్ధాయాల అధ్యయనంతో నీవు గ్రహించిన వేదవిజ్ఞానం అని వెల్లడించాడు.

ఋషి అవాక్కైపోయాడు చాలా సేపు.

తరువాత ఇంద్రుడితో అన్నాడు, ప్రభూ, మీరు దయతో ఇచ్చిన ఆయుర్దాయాలు చాలును. ఈ అనంత వేదరాశి కేవలం భగవంతుడి స్వరూపం. ఆయనకు తప్ప ఇతరులకు తెలియనసాధ్యం అని అర్థం అయ్యింది. మీ కృపతో దానిని కొంతగా తెలుసుకున్నాను. ఇంక చదవటానికి లేదు తెలియటానికి ఏమీ మిగలలేదు అనేదాకా పోదామనుకోవటం అజ్ఞానం అని అర్థమయ్యింది. ఈ శరీరం ఇంక పడిపోవలసి ఉంటే అలాగే కానివ్వండి అన్నాడు.

ఋషిని అభినందించి వెళ్ళిపోయాడు ఇంద్రుడు.

మిగిలిన ఆయువును భగవచ్ఛింతనకు వెచ్చించటానికి నిశ్చయించుకున్నాడు ఋషి.


4 కామెంట్‌లు:

  1. తెలుసుకోవడానికి అంతం ఉండదు. ఆయువు చాలదనే విషయాన్ని కథ రూపంలో చెప్పిన మీకు ధన్యవాదములు శ్యామలీయం గారు. ఈ కథను ఈ అంశం గురించి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా ఆలాగే చేయండి. మీకు నచ్చినందుకు సంతోషం.

      తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.