మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
20
కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివ యః .
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాసారసిరయా
ఇది తృతీయ కూట ధ్యానం.
ఇది గారుడం అనే ప్రయోగం గురించిన ప్రస్తావన చేసే శ్లోకం.
ఈ శ్లోకంలో కూడా యః - సః అనే విధానం కనిపిస్తున్నది చూడండి. గత కొన్ని శ్లోకాల్లోనూ ఇది మనం గమనించవచ్చును.
ఇక్కడ శ్లోకంలో యః అంటే ఎవడు అనగా ఏ భక్తుడు అని ప్రస్తావన చేసి, అటువంటి భక్తుడు చేసి అటువంటి భక్తుడు చేసే ఆరాధనా విధానాన్ని ప్రస్తావిస్తారు. సః అంటే వాడు అని అర్థం. ఇలా వాడికి అంటూ ప్రస్తావిస్తూ అటువంటి ఆరాధనకు ఫలం ఏదో దానిని వివరిస్తారు శ్రీశంకరులు.
కిరణ నికురంబం అంటే కాంతికిరణాల పుంజం అని అర్థం. అది యెక్కడి నుండి వెలువడుతున్నదీ? కాంతి అన్నాక
దానికి ఒక మూలస్థానం ఉండాలికదా ఫలాని చోటనుండి కాంతిప్రసరిస్తున్నదీ అనటానికి. అదే, అంగేభ్యః అని చెబుతున్నారు. అంటే అమ్మ దివ్యమంగళవిగ్రహం నుండి అలా కాంతి కిరణాలు పుంజాలు పుంజాలుగా వెలువడుతున్నాయని చెబుతున్నారు. మరి ఆ కాంతిపుంజాలకు ఒక విశేషం కూడా జోడించి చెబుతున్నారు అమృతరసం అని. అంటే ఇప్పుడు ఈ మొత్తం మొదటిపాదం అంగేభ్యః కిరణనికురుంబామృతరసం కిరంతీ అని అవుతున్నది. భావం చూస్తే అమ్మయొక్క దివ్యమంగళస్వరూపం నుండి తేజఃపుంజాలు అమృతరసాన్ని వర్షిస్తున్నాయీ అని వచ్చింది. బాగుంది.
ఆ అమ్మ స్వరూపాన్ని కూడా తరువాతి పాదంలో హిమకరశిలామూర్తి మివ అని స్పష్టంగా అందంగా ఇలా చెబుతున్నారు. హిమకరుడు అంటే అందరికీ తెలుసుకదా చంద్రుడు అని. హిమకరశిల అంటే చంద్రకాంతశిల అన్న మాట. హిమకరశిలామూర్తి అంటే చంద్రకాంతశిలావిగ్రహం వలె అత్యంత స్వచ్చమైన తెలుపు రంగు కలది. ఇంకొక విశేషం కూడా ఇక్కడ కనబడుతోంది. చంద్రకాంతశిలలు వెన్నెలలో చెమర్చుతూ ఉంటాయని ప్రతీతి. అవి ఎంత తెల్లగా ఉంటాయీ అంటే ధవళవర్ణంలో ప్రకాశిస్తూ వెన్నెల కాదూ అవే కాంతిని వెదజల్లుతూ ఉన్నాయా అని పిస్తుంది. చంద్రుడి వెన్నెల అమృతసమానం అని ప్రతీతి కదా. అందుకే చంద్రుడికి సుధాకరుడు అని కూడా పేరు చాలా ప్రసిధ్దంగానే వినిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మ స్వరూపం చంద్రకాంత శిలా ప్రతిమ వలె స్వయంగా కాంతులతో అమృతాన్ని చిలకరిస్తోంది అని ఇక్కడ శ్రీశంకరుల చమత్కారం.
ఇప్పుడు ఆచార్యులవారుఅంటున్నారూ అమ్మా యః త్వాం హృది మాధత్తే అని అటువంటి చంద్రకాంతశిలాసదృశమూర్తివీ అమృతస్యందినివీ ఐన నిన్ను ఎవరైతే తన హృదయంలో చక్కగా నిలుపుకొని ధ్యానం చేస్తున్నాడో అటువంటి వాడికి గొప్ప మహిమ కలుగుతున్నదీ అని.
అది ఎటువంటి మహిమ అన్నదో చిత్తగించండి.
శకుంతాధిప ఇవ సః సర్పాణాం దర్పం శమయతి అని అంటున్నారు. శకుంతములు అంటే పక్షులు. అధిపుడు అంటే రాజు. పక్షులజాతికి రాజు ఎవరయ్యా అంటే ఇంకెవ్వరు గరుత్మంతుడే. ఈ భక్తుడు గరుత్మంతుడి అంతటి వాడు అవుతాడట! ఏ విషయంలో అంటే పాముల విషయంలో. అందరికీ తెలుసుకదా గరుడుడికీ సర్పాలకీ ఆగర్భశత్రుత్వం. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేనంతగా ప్రసిధ్ధమైన కథ అది. ఆ గరుత్మంతుడి లాగా సః అంటే అతదు, ఆ భక్తుడు, సర్పాణాం అనగా పాముల యొక్క దర్పం అనగా పొగరును శమయతి అంటే అణగ్గొడతాడు అని.
అందుకే ఇది గారుడప్రయోగం అన్నారు. ఈ శ్లోకాన్ని శ్రధ్ధగా ఉపాసన చేస్తే పాములూ ఇంకా మిగిలిన సకల విషకీటకాల వలనా ఆ ఉపాసకుడికి ఎన్నడూ భయం ఉండదు.
ఇంకా మరొక విశేషాన్ని కూడా శ్రీశంకరులు చెబుతున్నారు. అటువంటి భక్తుడికి మరొక అద్భుతమైన శక్తీ అబ్బుతుంది అని. ఏమిటంటే దృష్ట్వా జ్వరప్లుష్టాన్ అనగా జ్వరపడ్ద వారిని అతగాడు ఒక చూపు చూస్తే అది, సుదాధారసిరయా సుఖయతి అంటే అమృతాన్ని పిచికారీచేసేదిలాగా ఆ దృష్టి జ్వరపీడితుడిమీద పనిచేసి సుఖయతి అంటే సుఖం కలిగిస్తుందట. అనగా, అటువంటి ఉపాసకుడి చూపు తగిలితే ఏ దైనా జ్వరంతో బాధపడుతున్నవాళ్ళకు ఆ చూపు అమృతపానం అవుతుందట జ్వరవిముక్తి చేసి సుఖం కలిగిస్తూ.
అదండీ శ్రీశంకరులు చంద్రకాంతశిలలాగా స్వఛ్చమైన తెలుపు చాయలో ఉన్న అమ్మను గుండెల్లో నిలుపుకొని ఉపాసన చేసినవాడికి కలిగే శక్తిగురించి చెప్పిన శ్లోకం.
చతుశ్శతిస్తుతిలో కూడా ఈ విధంగా అమ్మస్వరూపాన్ని అరునెలలు ధ్యానం చేసినవాడు గరుత్మంతుడిలాగా సకల విషాలూ సకలజ్వరాలూ తొలగించగల సమర్థుడు అవుతున్నాడని చెప్పబడింది.
పక్షాంతరంలో నలభైఐదు రోజులు రోజుకు రెండువేల పర్యాయాలు జపించాలని చెప్పబడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.