3, అక్టోబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 9 మహీం మూలాధారే ....మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


9    

మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి 
మనోऽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే


ఇంతకు ముందటి క్వణత్కాంచీదామా అన్న శ్లోకంలో స్థూలస్వరూపధ్యానం ప్రస్తావించబడింది.  ఈ  శ్లోకంలో శ్రీశంకరులు సూక్ష్మద్యానాన్ని ప్రస్తావిస్తున్నారు. 

శ్రీవిద్యలో సాధకుడి శరీరమైన పిండాండానికి బ్రహ్మాండంతో అబేధం చెబుతారు. ఇది గమనించాలి.

ఈ శరీరం షట్చక్రసంపుటిగా చెప్పబడుతుంది తాంత్రికంగా సమయాది సర్వ శాక్తేయ మతాల్లోనూ. ఈ చక్రాలు ఆరు.  వీటి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.

అన్నింటికన్న శరీరంలో అట్టడుగున ఆసనస్థానంలో ఉండే మూలాధారం అనేది మొట్టమొదటి చక్రం. సర్వాధారామహీ అని రుద్రరహస్యంలో చెప్పినట్లు సర్వ చక్రాలకూ మూల మైనందు వలన మూలాధారం అని సార్థకనామం ఈ‌ చక్రానికి.  భగవతి చుట్టలు చుట్టుకొని ఉన్న సర్పాకృతిలో కుండలినీ‌ శక్తిగా ఈ మూలాధారక్షేత్రంలో నివసిస్తుంది. కుండలినికి ఇది నిత్యనివాసస్థానం అని ప్రసిధ్ధి. ఈ చక్రం పృధ్వీతత్త్వం కలది. ఈ‌ పృధ్వీతత్త్వం కారణంగా శరీరాని స్థూలత్వం, స్థిరత్వం అనేవి కలుగుతూ ఉన్నవి.  భూమి ఐహిక ప్రకృతికి మూలం. ఈ ములాధారపు పృధ్వీతత్త్వం కారణంగా దేహికి ఐహిక ప్రకృతితో అవినాభావసంబంధంగా ఉంది.  ఈ‌ మూలాధారాన్ని విడిచిపెట్టి ఊర్ద్వముఖంగా పోకపోతే, పోలేకపోతే ప్రకృతిలోనే ఉండిపోవటం స్థిరంగా అన్నమాట.

ఈ శ్లోకంలో ఆ కుండలినీ శక్తిరూపిణి దేవి యొక్క ఊర్ధ్వముఖ ప్రయాణాన్ని వర్ణిస్తున్నారు శ్రీశంకరులు. మహీం మూలాధారే అంటే మొదట మూలాధారక్షేత్రంలో ఉన్న పృధ్వీతత్త్వాన్ని భేదించుకొని బయలుదేరింది భగవతి అని చెబుతున్నారు.

మణిపూరే హుతవహం అని మూలాధారక్షేత్రానికి ఎగువన ఉండే మణిపూరకచక్రాన్ని ప్రవేశించింది భగవతి.  ఈ చక్రంలో ఉన్నసమయంలో భగవతి నిజమణికాంతులతో ఆ ప్రదేశాన్ని పూరించటం వలన దానికి మణిపూరకం అని పేరు. అది కం అపి అని ఉదకతత్త్వం కలది అని చెప్పి శ్రీశంకరులు భగవతి ఆ జలతత్త్వాన్ని భేదించుకొని ప్రయాణం కొనసాగించింది అని చెబుతున్నారు.

స్వాధిష్ఠానే స్థితం హుతవహం అంటే అగ్నితత్త్వం కల స్వాధిష్ఠాన చక్రం ప్రవేశించింది.   భవతి కుండలిని ఇక్కడ స్వయంగా అధిష్టించి ఉండి గ్రంథికల్పనం చేస్తుంది కాబట్టి దీనికి స్వాధిష్ఠానం అని పేరు. భగవతి ఆ అగ్నితత్త్వాన్ని భేదించి ప్రయాణం కొనసాగించింది.

ఆ తరువాత  హృది మరుతం అన్నారు మరుత్తు అంటే వాయువు. హృదయస్థానంలో ఉన్న వాయుతత్త్వాత్మకమైన అనాహత చక్రాన్ని ప్రవేశించింది భగవతి. అనాహత మనటం ఎందుకంటే ఈ‌ చక్రస్థానంలో ఏ‌తాకిడి లేకుండా స్వయంగా నాదం ఉత్పత్తి అవుతుంది కాబట్టి.  ఇది సాథకులకే అనుభవైక వేద్యం. వర్ణించే విషయం కాదు.  అక్కడ ఉన్న వాయుతత్త్వాన్ని కూడా బేధించి ప్రయాణాన్ని నిరాఘాటంగా కొనసాగించింది భగవతి అని చెబుతున్నారు.

ఉపరి అంటే ఆతరువాత హృదయస్థానానికి పైన ఉన్న విశుధ్దచక్రాన్ని ప్రవేశించింది భగవతి.  ఇక్కడ చక్రం శుధ్ధమైన స్ఫటికం వంటి ప్రకాశం కలది అన్న అర్థంలో విశుధ్దచక్రం అని  పేరు కలిగిందని చెబుతారు. దాని ఆకాశ తత్త్వాన్ని బేధించింది.

పిమ్మట భ్రూమధ్యే అని కనుబొమల మధ్యస్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రం ప్రవేశించి దాని యొక్క తత్త్వమైన మనస్సును కూడా ఛేదించి ప్రయాణించింది ఇంకా ఊర్ధ్వముఖంగా. సాధకుడికి ఈ చక్రంలో కుండలినీ సంచారం కారణంగా భగవతి గురించి కొంచెం జ్ఞానం కలుగుతుంది. అందుకే దీనికి ఆజ్ఞాచక్రం అని పేరు.

ఈ విధంగా భగవతి, కుందలినీ నివాసిని ఐన భగవతి సకలమపి అంటే సమస్తమైన కులపథంభిత్వా అంటే సుషుమ్నానాడీ‌మార్గాన్నీ భిత్వా అంటే బేధించుకొని పైకి ప్రయాణించింది భగవతి అని చెప్పటం .  మూలాధారచక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకూ గల అరు చక్రాలకూ కులం అని పేరు. వీటిని కలిపే‌ మార్గమే కులపథం అంటారు. ఇదే సుషుమ్నా నాడీమార్గం. ఈ‌ కులపథంలో ఉన్న తత్త్వాలు పంచభూతాలూ, మనస్సూ అన్న విషయం గమనించండి. 

అన్నింటికన్నా శరీరంలో ఉన్నతస్థానంలో‌ అఖరుదైన సహస్రారం అనే దివ్యచక్రం ఉంది దానినే శ్రీశంకరులు ఇక్కడ సహస్రారే పద్మే అని ఒక వేయిరేకుల కమలంగా వర్ణించారు. ఇది సంప్రదాయప్రసిధ్ధమైన ఉపమానమే. భగవతి ప్రయాణం నిరంతరాయంగా సాగించి అక్కడకు చేరుకున్నదని చెప్పి ఇంకా ఇలా అంటున్నారు.

ఏమని సహ రహసి పత్యా విహరసే అని. అంటే అమ్మా భగవతీ, ఆ కమలంలో చంద్రమండలం మధ్యన ఉండే అమృతబిందు స్థానమే నీ విహారస్థలం. ఆ అమృతబిందువు పరమశివస్వరూపమే. అక్కడ అ సహస్రారపద్మంలో ఉన్న నీ‌ పతి ఐన సదాశివునితో కలసి రహస్యంగా విహరిస్తున్నావు అని శ్రీశంకరులు అమ్మని ప్రస్తుతిస్తున్నారు.

ఒక విశేషం ఏమిటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుధ్ధం, ఆజ్ఞా అని చక్రాల వరుసక్రమం శరీరం అనబడే పిండాండలో క్రింది నుండి పైకి.  ఐతే ఆచార్యులవారు ఈ‌ శ్లోకంలో మూలాధారం అనంతరం మణిపూరకం అని చెప్పి స్వాధిష్టానాన్ని తరువాత చెప్పారు. ఇలా కొద్దిగా క్రమం ఎందుకు తప్పించారు అన్న ప్రశ్న వస్తుంది. పృధివ్యాపస్తోజేవాయురాకాశాత్ అన్న క్రమం పాటించి అంటే ఆకాశాత్ వాయుః వాయో రగ్నిః అగ్నే రాపః ఆపఃపృధివ్యాం పృధివ్యామన్నం అన్నాద్భవతి భూతాని అన్న శృతిప్రమాణంగా శ్రీశంకరులు పృధివినుండి పైకి చెబుతూ పృధ్వీ తత్త్వం తరువాత జలతత్త్వాన్ని చెప్పారని గ్రహించాలన్న మాట.

ఈ శ్లోకానికి వేయి పర్యాయాలు పారాయణం ప్రశస్తం. లేదా యథాశక్తి పారాయణం చేయవచ్చును. పారాయణానంతరం పాలపాయసం నైవేద్యం.  ఐహికంగా దూరంగా ఉన్న ఆప్తులని మన దగ్గరకు చేర్చుతుందనీ, ఆముష్మికంగా ఉపాసించేవారికి పంచభూతముల మీద విజయం సిధ్ధిస్తుందనీ ఫలితం చెప్పబడింది.

2 కామెంట్‌లు:

  1. మిమ్మల్ని కష్ట పెట్టినా అమ్మ గురించి సామాన్యులకు కావలసినది రాబట్టగలిగాను. మరి మీ జ్ఞాన సముద్రం నుంచి మాకు ఈ రకం గా మిలిన శ్లోకాలు పంచిపెట్టగలరని ఆశ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో నేనేమీ జ్ఞానసముద్రుడిని కానండీ. పరమ అజ్ఞానిని. నాకు సర్వేశ్వరుడు ఎప్పటికి మానసిక పరిపక్వతను ప్రసాదిస్తాడో, ఏమో .. అని ఆచార్యపీఠాధిపతి ఒకాయన నిన్ననే నామీద జాలి పడ్దారు కూడా. వారి తప్పేముందిలెండి. నాకు తగినంత తెలివిలేకపోతే. ఇక కష్టపడటం అంటారా, అది మంచిదే నండి, అలవాటైనదే కూడా. ఐనా అమ్మగురించి తెలుసుకోవాలనే ప్రయత్నం సంతోషదాయకమే కాని కష్టం అనికోను కదా. ఏదో నాకు అమ్మ దయ ఉన్నంత మేరకు సౌందర్యలహరీస్త్రోత్రం శ్లోకాలన్నింటికీ ఇలాగే యథాశక్తి నోట్సు వ్రాసుకుంటాను. ఈ రోజున ఇంతవరకూ వచ్చిన అన్ని శ్లోకాలకు పారాయణఫలభాగవాక్యాలు వ్రాసాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.