17, అక్టోబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 19 ముఖం బిందుం కృత్వా ....



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

19

ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయే ద్యో హరమహిషి తే మన్మథకలామ్
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందు స్తన యుగామ్ 


ఈ శ్లోకంలో శ్రీశంకరులు కామ కళా రూప ధ్యానం అనే ప్రక్రియను గురించి ప్రస్తావిస్తున్నారు.

అమ్మవారిని హే హరమహిషి అని సంబోధిస్తున్నారు. మహిషి శబ్ధం మనకు పరిచయం ఉన్నదే, రాణి అన్న అర్థంతో సహా.  హరుడు అంటే శివుడు కాబట్టి హరమహిషి అంటే శివుని రాణీ అని అమ్మను సంబోధిస్తున్నారని సులభంగానే బోధపడుతున్నది.  

ముఖం బిందుం కృత్వా అంటే శ్రీచక్రంలో మధ్యన బిందువు ఉంది కదా, దానినే స్త్రీయొక్క ముఖంగా భావించి అని అర్థం. ఎవరిముఖంగా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది కదా?  ఇక్కడ రెండు సమాధానాలున్నాయి.  మొదటిది ఇది కామరాజ పీఠ ధ్యానం.  ఈ‌ ధ్యానాన్ని ఐహిక మైన కామ్యసిధ్ది కోసం జపించే వారు ఇష్టస్త్రీ ముఖాన్ని బిందువుగా  భావించాలి. రెండవది ఐహిక దృష్టిలేని ఆధ్యాత్మిక సాధకులు అమ్మవారి యొక్క ముఖంగా భావించాలని అర్థం.  ఈ రెండవ తాత్పర్యం మనం‌ తరువాత చర్చిద్దాము. మొదట ఈ‌ శ్లోకం ఎలా మదనసంబధమైన ప్రయోగాన్ని చెబుతున్నదో చూదాం.

కృత్వా కుచయుగ మధస్తస్య అన్నదానికి అన్వయక్రమం అస్య అధః కుచయుగమ్‌ కృత్వా  అని. అంటే ఆ బిందువుక్రిందుగా ఉద్దిష్ట స్త్రీమూర్తి యొక్క కుచయుగం అంటే స్తనాల జంటగా భావించాలి.

అదధో హరార్థం ధ్యాయేత్ అంటే దానికి క్రిందుగా హరార్థం అంటే శివుడిలో సగభాగం ఐన శక్తిని ధ్యానించాలి. శ్రీచక్రభాషలో ఇది త్రికోణం. ఈ త్రికోణాన్ని స్త్రీత్వచిహ్నంగా భావించాలని చెబుతున్నారు.  ఈ విధంగా చేసి

తే మన్మథకలామ్‌ అనగా నీ యొక్క కామరాజబీజమును ఈ చెప్పబడిన స్థానములలో ఉపాసన చేయాలి.  క్లీం అనేది కామరాజబీజం.

ఈ విధంగా కామరాజబీజాన్ని ఉపాసించే విధానం చెప్పి శ్రీశంకరులు ఈ ఉపాసనా ఫలం యొక్క మహిమను గురించి వర్ణిస్తున్నారు.

స సద్యస్సంక్షోభం నయతి వనితా అని అంటే వాడు ఉపాసన ఫలితంగా వెంటనే వనితాసంక్షోభం అనగా స్త్రీహృదయాలను సంక్షోభానికి గురిచేస్తాడు. అంటే ఉపాసన ఫలించిన వెంటనే సాధకుడికి స్రీలను మోహింపచేసే శక్తి యేర్పడుతుంది.  లేదా అతడు ఎవరైనా స్త్రీని ఉద్దేశించి కనుక ఈ కామరాజ బీజాన్ని ఉపాసిస్తే ఆ వనిత ఇతడికి ప్రసన్నురాలవుతుంది.

ఐతే ఆచార్యులవారు ఇలా చెప్పి ఊరుకో లేదు. పైగా, నిజానికి  ఇతి అంటే ఇలా చెప్పటం అతి లఘుః అంటే చాలా చప్పగా చెప్పటం అవుతుందట.

ఎందుకంటే అలాంటి కామరాజబీజాన్ని ఉపాసించిన వాడు

రవీందు స్తనయుగామ్‌ అనగా సూర్య చంద్రులే స్తనస్థానాల్లో ఉన్నట్టి త్రిలోకీ అంటే ఆ స్వర్గ, మర్త్య పాతాళాలతో ఏర్పడే ముల్లోక త్రికోణం ఉందే అపి అనగా దానిని కూడా ఆశుః భ్రమయతి అంటే అలవోకగా తక్షణమే మోహంలో ముంచెత్తగలడు.

అది విషయం.

ఈ  శ్లోకానికి సంబంధించి ఇంకా మనం చెప్పుకోవలసింది ఉంది. అది వచ్చే టపాలో.

2 కామెంట్‌లు:

  1. మీ టపాకోసం ఎదురు చూస్తూనే ఉన్నా సుమండీ, ఎవరూ చూడటం లేదనుకోకండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలకు శ్రమ కలిగిస్తున్నాను!
      కొంచెం ఉక్కిరిబిక్కిరి ఉద్యోగకార్యక్రమాలవలన ఒక్కోసారి టపా వ్రాయటానికి ఆలస్యం జరుగుతున్నది. కొన్ని కొన్ని శ్లోకాలకు సరళంగా ఎలా వ్రాయాలా అని ఆలోచించుకుందుకు మరికొంత ఆలస్యం అవుతున్నది.
      ఏమైనా ఈ నూఱు శ్లోకాలను గురించి ఏకధారగా వ్రాయటం మాత్రం తప్పక జరుగుతుంది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.