10, అక్టోబర్ 2014, శుక్రవారం

రాజకీయ కప్పల గంతులను అరికట్టటం ఎలా?

ఈ విషయం కాస్త తీవ్రంగానే పరిగణించవలసిన సంగతే!

మెడ మీద ఒక తల ఉన్న ప్రతివాడికీ, ముఖ్యంగా అందులో ఏ కాస్తైనా గుంజు ఉన్న ప్రతివాడికీ కొన్ని ముఖ్యమైన సంగతులు తెలుసు.
 • రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే ఏ వ్యక్తీ  ప్రజాసేవ అనే దాని కోసం పనిజేయటం లేదు.
 • ఏ రాజకీయపార్టీ కైనా మొదటి ప్రాథాన్యత అధికారం, రెండవ ప్రాథాన్యత అధికారం, మూడవ ప్రాథాన్యత అధికారం. మరే ఇతర ప్రాథాన్యతలూ లేవు.
 • రాజకీయ పార్టిల దృష్టిలో ప్రజలు అంటే ఓట్లు వేసే మనుషులు అనగా ఓటర్లు అనే అర్థం మాత్రమే ఉంది.
 • ప్రతి రాజకీయ నాయకుడికి పలుకుబడి, పెత్తనం, ధనసంపాదన అనేవి ముఖ్యం కాని, ఐదేళ్ళ కోసారి ఓటేసే అమాయక జనం కాదు.

కాబట్టి రాజకీయ నాయకులం అని చెప్పుకునే వాళ్ళు చిత్తానుసారంగా పార్టీల గోడలు దూకేస్తున్నారు.  గోడదూకే ప్రతి నాయకమ్మన్యుడు చిత్రవిచిత్ర కారణాలు చెబుతాడు కాని అసలు కారణాలు అవి కావని ఆ మానవుడికీ తెలుసు , చిరాగ్గా తిలకిస్తున్న సామాన్యమానవుడికీ తెలుసు.

ఏ రాజకీయుడు ఏరోజున ఏ పార్టీలో ఉంటాడో ఏ రోజున అది వదిలి గంతు వేస్తాడో చెప్పటం బ్రహ్మతరం కాదు.

వీళ్ళు కప్పలకన్నా అన్యాయంగా గంతులు వేస్తుంటే జనం చోద్యం చూడట మేనా?

ఈ తంతుకి అడ్డు చెప్పాలంటే దారి లేదా?

ఎలక్షన్ కమీషన్ అనేది చోద్యం చూస్తూ కూర్చో వలసిందేనా?

నాకు తోచిన విరుగుళ్ళు చెబుతున్నాను:
 • ఏదైనా రాజకీయపార్టీలో చేరిన ప్రతి వ్యక్తీ చేరిన నాటినుండి మూడు సంవత్సరాలపాటు ప్రాథమిక సభ్యుడు మాత్రమే.
 • రాజకీయ పార్టీల ప్రాథమిక సభ్యులకు పార్టీ పదవులకు కాని, ప్రజాప్రాతినిధ్య పదవులకు కాని పోటీ చేసే హక్కు లేదు.
 • ప్రాథమిక సభ్యత్వపు గడువు ముగిసాక ఆ పార్టీ సభ్యులు ఎన్నుకుంటేనే అటువంటి ప్రాథమిక సభ్యుడు పూర్తిస్థాయి సభ్యుడు అవుతాడు.
 • కేవలం పూర్తిస్థాయి సభ్యులకు మాత్రమే పార్టీ పదవులకు కాని, ప్రజాప్రాతినిధ్య పదవులకు కాని పోటీ చేసే హక్కు కలుగుతుంది.
 • ఏ రాజకీయ పార్టీ నుండైనా రాజీనామా చేసిన లేదా బహిష్కరింపబడిన వ్యక్తి ఐనా ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన రెండు సంవత్సరాల పాటు మరే పార్టీలోనూ సభ్యుడిగా చేర కూడదు. రాజకీయ ప్రకటనలను జారీ చేయకూడదు. సభలు సమావేశాలు నిర్వహించకూడదు. అసలు ఏ విధమైన రాజకీయకార్యక్రమాన్ని చేపట్టకూడదు. అటువంటి నిషిధ్ధక్రియలకు పాల్పడినట్లు ఋజువు ఐన పక్షంలో ఎలక్షన్ కమీషన్ వారు శిక్షించాలి. ఆ శిక్ష యేదైనా సరే, ఆతడి రెండు సంవత్సరాల ప్రొబేషన్ పునః ప్రారంభం అవుతుంది.
 • ఒక పార్టీపదవికి కాని ప్రజాప్రాతినిధ్యపదవికి కాని ఎన్నికైన వ్యక్తికి మొదటి రెండు సంవత్సరాలు ప్రొబేషన్.
 • ఒక పార్టీపదవికి కాని ప్రజాప్రాతినిధ్యపదవికి కాని ఎన్నికైన వ్యక్తి కనుక పార్టిని వదిలినా పార్టీనుండి బహిష్కరించబడినా ప్రొబేషనరీ నిషేధం అన్నది రెండేళ్ళు కాక మూడేళ్ళుగా ఉంటుంది. ఒకవేళ అప్పటికి అతడి పదవి కనుక ప్రొబేషన్ పరిధిలోనే ఉంటే అప్పటి వరకూ అనుభవించిన జీతభత్యాలను పార్టీపదవి ఐతే పార్టీకి లేదా ప్రభుత్వ పదవి ఐతే ప్రభుత్వానికి తిరిగి తక్షణం చెల్లించ వలసి ఉంటుంది. చెల్లించని పక్షంలో మరొక ఏడాది అదనంగా అనర్హత ప్రొబేషన్ వర్తిస్తుంది.
 • ఏ పార్టీ వ్యక్తి ఐనా పార్టీ యొక్క క్రమశిక్షణ చర్యలకు గురియైన సందర్భంలో తనకు విధించిన శిక్షను వ్యతిరేకించితే అతణ్ణి పార్టీ వెంటనే పార్టీనుండి బహిష్కరించవచ్చును.  దీనిపై కోర్టులకు వెళ్ళటం కుదరదు.

ఎలా గున్నాయి సూచనలు?

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.