4, అక్టోబర్ 2014, శనివారం

సౌందర్యలహరి - 10 సుధాధారా సారై ....మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


10    

సుధాధారా సారై శ్చరణ యుగళాంతర్విగళితైః
ప్రపంచం సించన్తీ పునరపి రసామ్నాయ మహసః 
అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ట వలయం
స్వ మాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి  


ఇంతకు ముందటి తొమ్మిదవ శ్లోకం మహీం మూలాధారే.... అన్న శ్లోకంలో శ్రీశంకరులు పరాశక్తి ఐన దేవి కుండలినీ స్వరూపిణియై మూలాధారక్షేత్రం నుండి బయలుదేరి సహస్రార కమలం చేరుకొన్న విధానాన్ని వివరించారు.   ఈ శ్లోకంలో ఆచార్యులవారు దేవి యొక్క తిరుగు ప్రయాణాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు.

సుధాధార అంటే సులభంగానే బోధపడుతోంది కదా? సుధ అంటే అమృతం. ధార అన్నది నిత్యం వాడే పదమే, అగకుండే ప్రవహించటం అనే అర్థంలో. ఐతే ఆచార్యులవారు అంతటితో తృప్తిచెందకుండా ఆసారైః అన్న శబ్దంకూడా జోడించారు సుధాధారకు. ఆసారం అంటే జడివాన. ఇప్పుడు  సుధాధారాసారైః అంటే జడివానగా కురుస్తున్న అమృతధారలు అని అర్థం. 

ఈ అమృతధారలవాన యెక్కడినుండి కురుస్తోందీ? చరణయుగళాంతర్విగళితైః అని అక్కడి నుండి అట. చరణయుగళం అంటే పాదాలజంట. ఇక్కడ అంతః అనే శబ్దం వేసారు. చరణయుగళం యొక్క అంతః ప్రదేశం అని.  రెండుపాదాలు దగ్గరగా ఉంచితే వాటిమధ్య యేర్పడే చిరులోయలాంటి ప్రదేశం ఉంటుందే అది. అక్కడి నుండి విగళితమైనది అంటే క్రిందికి జారి ప్రవహిస్తున్నది అట.  ఇప్పుడు అర్థమైనది కదా, అమ్మవారి చరణారవిందాలజంట యొక్క మధ్య ఉండే లోయలోనుండి అమృతం ఊరి క్రిందికి ఒక జడివానలాగా ప్రవహిస్తోంది అని చెప్పారని.

ఆ ధార ఏమి చేస్తున్నదో తెలుసునా?  ప్రపంచం సించంతీ అన్నారు. ఇక్కడ ప్రపంచం అంటే భౌతికమైన ప్రపంచం కాదు. పిండాండమే ప్రపంచం. ఈ పిండాండంలో ఉండే డబ్భై రెండు వేల నాడుల మండలం ఉందే దానిని ఇక్కడ ప్రధానంగా ప్రపంచం అని సంబోధిస్తున్నారు.  సించనము అంటే తడపటం. ఈ సుధాధారలు పొంగి జడివానగా వచ్చి ఈ‌డబ్బైరెండువేల నాడీమండలప్రపంచాన్ని చక్కగా తడుపుతున్నది అని చెబుతున్నారు.  అలా ఎలా జరుగుతున్నదీ చెబుతున్నారు.

రసామ్నాయమహసః అని చెప్పినది చంద్రమండలం గురించి.  బయట అకాశంలో కనిపించే చంద్రమండలం కాదు. ఇక్కడచెప్పినది సహస్రారకమలంలో ఉన్న చంద్రుని గురించి. కుండలినీ శక్తి ఈ చంద్రమందలం చేరినప్పుడు అమృతం స్రవిస్తుందని శ్రీవిద్య చెబుతున్నది.  రసగుణం యొక్క ఆధిక్యత యెక్కడ మహత్తమంగా ఉందో అది సహస్రార చంద్రమండలం అని యామళములు అనే దేవీతంత్రగ్రంథాలు వచిస్తున్నాయి.  ఇలా అమృతప్రవాహం శ్రీదేవీచరణాలనుండి ప్రవహించి నాడీమండలాన్ని సంపుష్టం చేయటం వేదప్రతిపాద్యమే.

పునరపి అవాప్య స్వాం భూమిం అని ఇక ఆ పిమ్మట కుండలినీ శక్తి తిరుగుప్రయాణం చెస్తున్నదని చెబుతున్నారు శ్రీశంకరులు. పునరపి ఈ విధంగా అమృతవృష్టి చేసిన తరువాత అని అర్థం. స్వాం భూమిం అంటే తనయొక్క భూమిని అనగా భూతత్త్వాన్ని అవాప్య అంటే పొందుచున్నది అని విశదీకరిస్తున్నారు. స్పష్టమైనది కదా.  ఈ‌ భూతత్తాన్ని పొంది కులకుండే అని మూలాధారచక్రాన్ని చేరుతున్నది అని చెప్పారు. కులము అంటే సుషుమ్నా మార్గము. దాని అధోభాగమున కందాకారముగా ఉన్న అధారచక్రమే కులకుండము.  ఆ కుల కుండములో ఒక చిన్న కుహరం ఉంది. ఆ కుహరంలో  చేరుకుంది అని చెప్పటానికి కుహరిణి అన్నారు

అలా మూలాధారాన్ని చేరుకున్న కుండలిని ఎలా ఉన్నది? స్వమాత్మానం కృత్వా అంటే నిజస్వరూపాన్ని స్వీకరించి, అప్పుడు  భుజగనిభం అంటే ఒక పాము వలే ఉందట. ఆ సర్పాకారం కూడా అధ్యుష్ఠవలయం అని చుట్టలుచుట్టుకొని ఉన్నదని అన్నారు.

ఇది కుండలినీ శక్తికి విశ్రాంతి స్థానం కాబట్టి శ్రీశంకరులు స్వపిషి అంటే నిద్రిస్తున్నావమ్మా అని అన్నారు.

ఈ విధంగా రెండుశ్లోకాల్లో శ్రీశంకరులు కుండలినీశక్తి స్వరూపంగా అమ్మవారు సాధకుడి యొక్క దేహం అనే పిండాండంలో‌ చేసే సంచారాన్ని మనకి తెలియజేసారు.

ఈ శ్లోకాన్ని ఆరు దినాలు రోజూ వేయిమార్లు జపించాలి, అమ్మకు ఎర్రటి పూలతో పూజ చేయాలి. అరటిపండ్లు నైవేద్యం. ఈ శ్లోకపారాయణం ఫలితం సంతానయోగ్యత, వంశవృధ్ధి.

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.