19, అక్టోబర్ 2014, ఆదివారం

స్వర్గంలో ముని - 4

*        *        *        *        *

ఇంద్రదేవుడు చిద్విలాసంగా ఒక చిరునవ్వు విసిరాడు.  చూడు మునీ, నీ అమాయకత్వం చూస్తుంటే అమితాశ్చర్యం కలుగుతోంది. ఏం చదివావా నువ్వు అని జాలి వేస్తోంది అన్నాడు కూడా.

అదేమిటి ప్రభూ, నేను బిఏ చదివానండీ అన్నాడు వినయంగా.

ఇంద్రుడు మరింత జాలిగా చూసాడు. ఎందుకొచ్చిన బిఏ చదువయ్యా, దాని గురించి ఎవరడిగారూ, పాపం వేదవ్యాసనారాయణులవారు ఎన్నో పురాణాలు మీ మనుషులకు అనుగ్రహించారు కదా, నువ్వు అవేవీ కొంచెమైనా చదువలేదా అని నా ఉద్దేశం అని చెప్పాడు.

ముని కొంచెం విచారంగా ముఖం‌ పెట్టాడు. అవేమన్నా మాకు అర్థమయ్యే భాషలో ఉన్నాయాండీ, లేవు కదా,  ఐనా మా బోటి వాళ్ళకూ  అర్థమయ్యేటట్లు కొందరు వాటిని తిరగరాస్తే అవిమాత్రం కొన్ని చదివాననుకోండి ఐనా ఈ మాటెందుకని అడుగుతున్నారండీ అన్నాడు.

అడక్కేం చేసేదీ? పరీక్ష ఇవ్వగానే సరిపోతుందా? అందులో నువ్వు ఉత్తీర్ణత సాధిస్తేనే నీకు లాభం చేకూరేది. అదిసరే,  నువ్వేమిటీ నన్నే సరాసరి మోక్షం అడిగేస్తున్నావూ. అది కావాలంటే శివకేశవుల అనుగ్రహం సంపాదించుకోవాలి సుమా నువ్వు అన్నాడు.

మునికి కొంచెం‌ కోపం వచ్చింది కాని దాన్ని వేంఠనే అణిచేసుకున్నాడు, ఎక్కడ ఇంద్రుడు దాన్ని పసిగడతాడో‌ ఏం ప్రమాదమో అని.

ఐనా ఇంద్రుడు పసిగట్టకుండా ఉంటాడా. ఏమిటయ్యా కొంచెం కోపం వస్తున్నట్లుందే‌ నీకు? అన్నాడు.

ముని కంగారుగా అదేం లేదు ప్రభూ, నాక్కోపం ఏమిటి, ఐనా మీరన్నట్లే నేను శివుడి కోసమే తపస్సు చేస్తున్నాను. అదే చెబుదామనుకుంటున్నాను అంతే అన్నాడు.

నాకు తెలుసులే. అదిసరే, నువ్వు చేస్తున్న తపస్సు ఒక స్థితికి వచ్చింది.  దానికి పరీక్షపెట్టి మరింత తపస్సు చేసేందుకు నీకు అర్హత ఉందో లేదో తేల్చక తప్పదు అన్నాడు చిరుకోపంగా చూస్తూ.

శివుడి కోసం తపస్సు చేసే వాడికీ‌ పరీక్షలా ఇంద్రదేవా అన్నాడు ముని కొంచెం భయంగా.

తప్పదు. నువ్వు ఎవరి కోసం తపస్సు చేసినా అది తపస్సే కదా అన్నాడు ఇంద్రుడు స్థిరంగా.

చిత్తం అన్నాడు ముని కొంచెం నిరాశగా.

నువ్వు నన్ను వరం అడిగావు కదా.  మోక్షమో అని.  అది నీకు నేను ఇవ్వలేను కాని మార్గోపదేశం చేయగలను.  అదైనా నువ్వు పరీక్షలో నెగ్గితేనే అన్నాడు ఇంద్రుడు.

ముని కేమీ బోధ పడ లేదు.  అంటే  అర్థం కాలేదు ప్రభూ అన్నాడు  అయోమయంగా చూస్తూ.

నీ‌ తపస్సు ప్రాథమిక స్థాయిలో ఉంది.  నామజపం చేస్తున్నావు. అది  నీకు  చిత్తశుధ్దిని కొంత వరకూ ప్రసాదించింది.  కాని జ్ఞానప్రకాశం కాలేదు.  నువ్వు పరీక్షలో నెగ్గితే ఇంకా బాగా తపస్సు చేయటం ఎలాగో ఉపదేశిస్తాను అని వివరణ ఇచ్చాడు ఇంద్రుడు.

మునికి సంతోషం కలిగింది.  పోనీలే మోక్షం తాను ఇవ్వలేక పోయినా దాన్ని సాధించేందుకు సహాయం చేస్తా నన్నాడు అదే పదివేలు కదా అనుకొన్నాడు.

పరీక్షకు నేను సిధ్ధం ప్రభూ అన్నాడు ఉత్సాహంగా.

ఇంద్రుడు గమ్మత్తుగా నవ్వి కుటీరం ద్వారం వైపు చేయి ఊపాడు చిన్నగా.

ఒక్క మెఱుపు మెఱిసి నట్లయ్యింది.

గుమ్మంలో ఒక అమ్మాయి.

సమ్మోహనకరమైన చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యింది.

మెల్లగా ఇంద్రుడి వద్దకు వచ్చి నమస్కరించింది.

ఈ మునికి మోక్షం కావాలిట అన్నాడు ఇంద్రుడు నర్మగర్భంగా నవ్వుతూ.

ఆ అమ్మాయి ఆహాఁ అంది.

ఆమాట మోహనరాగమో కళ్యాణీరాగమో ఎందులో ఉందో అనిపించింది బొత్తిగా సంగీత జ్ఞానం లేకపోయినా మన మునికి.

పాపం అమాయకుడు,  కొంచెం గాభరా పెట్టకుండా పరీక్షించు అని హెచ్చరించినట్లుగా చెప్పి, ముని కేసి తిరిగి ఈమె పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాలి సుమా అంటూనే అంతర్థానం చేసాడు ఇంద్రుడు.

ఆ అమ్మాయి విలాసంగా ముని కేసి తిరిగి ఒక చూపు చూసింది.

అతగాడు నిలువు గుడ్లు వేసుకొని ఆమె కేసి చూస్తున్నాడు.

*        *        *        *        *