8, అక్టోబర్ 2014, బుధవారం

సౌందర్యలహరి - 14 క్షితౌ షట్పంచాశత్ ....మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


14

క్షితౌ షట్పంచాశత్ ద్విసమధికపంచాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధికపంచాశదనిలే
దివి ద్విష్షట్త్రింశ న్మనసి చ చతుష్షష్టిరితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవ పాదాంబుజయుగమ్

ఈ శ్లోకంలో శ్రీశంకరులు అమ్మపాదయుగ్మం యొక్క దివ్యప్రభలను వర్ణిస్తున్నారు.

ఇది శ్రీవిద్యా సాంకేతికపరమైన శ్లోకం.

ఇప్పటికే‌ మనం మానవ శరీరంలో క్రిందినుండి పైకి మూలాధారం, మణిపూరకం, స్వాధిష్ఠానం, అనాహతం, విశుధ్ధం, ఆజ్ఞ అనే ఆరుచక్రాలను గురించి గత శ్లోకాల్లో చదివి ఉన్నాం.

అలాగే ఈ‌ చక్రాలకు భూమిరాపోనలోవాయురాది పంచభూతాలు, వాటి సమాహారమైన మనస్సూ అనేవి తత్త్వాలనీ తెలుసుకున్నాం.  ఈ శ్లోకంలో ఈ ఆరు దివ్యచక్రాలకూ వాటివాటి తత్త్వాలు ఎట్లా కలుగుతున్నాయీ అన్న విషయం తెలియ జేస్తున్నారు.

వీటిలో మూలాధారమూ స్వాధిష్ఠానమూ అనే రెండు చక్రాలనూ‌ ఒక జంటగా ఒక ఖండం.  ఈ‌ మొదటి ఖండం పైభాగం అగ్నిస్థానం.  దీన్నే రుద్రగ్రంథి అంటారు.  ఇక్కడ ఉన్న అగ్ని తన జ్వాలల చేత ప్రధమఖండాన్ని వ్యాపించి ఉంటాడు.

మణిపూరక, అనాహత చక్రాల జంట రెండవఖండం.  దీని పైభాగం సూర్యస్థానం. దీనినే విష్ణుగ్రంథి అంటారు.  సూర్యుని వెలుగులు రెండవఖండాన్ని వ్యాపించి ఉంటాయి.

విశుధ్ధ, అజ్ఞా చక్రాల జంట చివరి ఖండం. దీని పైభాగం చంద్రస్థానం. దీనినే బ్రహ్మగ్రంథి అంటారు. ఈ చంద్రుని కిరణప్రసారం ఈ ఖండాన్ని వెలుగులతో నింపుతూ‌ ఉంటుంది.

ఈ సూర్యచంద్రాగ్నుల జ్వాలలను గురించి భైరవాష్టకంలో

అష్టోత్తర శతం వహ్నేః షోడశోత్తర శతం రవేః
షట్త్రింశదుత్తర శతం చంద్రస్య చ వినిర్ణయః

అని చెప్పబడింది.  అంటే అగ్నిజ్వాలల సంఖ్య 108. సూర్యకిరణాలసంఖ్య 116. చంద్రుడి కిరణాల సంఖ్య 136 అని అర్థం.

ఈ శ్లోకంలో ఆఖరుపాదంలో మయూఖాః  అన్న పదం ఉంది చూడండి. మయూఖములు అంటే కిరణాలు.

ఈ కిరణాలు ఏ చక్రంలో ఎన్ని చొప్పున ఉన్నాయో‌ చెబుతున్నారు ఈ సౌందర్యలహరీ శ్లోకంలో శ్రీశంకరులు.

క్షితౌ అంటే పృధివీ తత్త్వాత్మకం ఐన మూలాధారం చక్రంలో షట్ పంచాశత్ అంటే 56.
ఉదకే అంటే జలతత్త్వాత్మకం ఐన మణిపూరక చక్రంలో ద్విసమధిక పంచాశత్ అంటే 52.
ఈ 56 + 52 = 108 అగ్నికి సంబంధించిన కిరణాలు.

హుతాశే అనగా అగ్ని తత్త్వాత్మకం ఐన  స్వాధిష్టాన చక్రంలో ద్వాషష్టి అంటే 62.
అనిలే అనగా వాయు తత్త్వాత్మకం ఐన అనాహత చక్రంలో చతురధిక పంచాశత్ అంటే 54.
ఈ 62 + 54 = 116 సూర్యకిరణాలు .

దివి అనగా ఆకాశతత్త్వాత్మకమైన విశుధ్ధ చక్రంలో ద్వి షట్-త్రింశత్ అంటే 2 x 36 = 72
మనసి అనగా  మనస్తత్త్వాత్మక మైన ఆజ్ఞా చక్రంలో చతుష్షష్ష్టి అంటే  64
ఈ 72 + 64 = 136 చంద్రకిరణాలు.

ఒక్క సారి ఈ కిరణాల సంఖ్యను అన్ని చక్రాలలో ఉన్నవాటినీ సమాహారం చేసి చూదాం.

అగ్నిఖండంమూలాధార చక్రంభూతత్త్వం56
సూర్యఖండంస్వాధిష్ఠాన చక్రంఅగ్నితత్త్వం62
అగ్నిఖండంమణిపూరక చక్రంజలతత్త్వం52
సూర్యఖండంఅనాహత చక్రంవాయుతత్త్వం54
చంద్రఖండంవిశుధ్ధ ఛక్రంఆకాశతత్త్వం72
చంద్రఖండంఆజ్ఞా చక్రంమనస్తత్త్వం64

ఈ కిరణాల సమూహం అంతా కలిపి 56 + 62 + 52 + 54 + 72 + 64 = 360,  
మరొక విధంగా   అగ్ని+ సూర్య + చంద్ర కిరణాలు =  108 + 116 + 136 = 360.

ఈ శ్లోకం చివర, తేషాం అపి ఉపరి అనగా ఈ కిరణాలేవైతే ఆరు చక్రాలలోనూ ప్రకాశిస్తూ ఉన్నాయో, వాటి ఆ కిరణాలు అన్నింటికీ పైన అని అర్థం.  ఈ ఆరు చక్రాలకూ పైన ఉన్నది సహస్రారకమలం కదా.  దనిని స్మరిస్తున్నారన్న మాట. అక్కడ ఉన్నదమ్మా తవ పాదాంబుజ యుగమ్‍ అని ప్రస్తుతి చేస్తున్నారు. అంటే శ్రీశంకరులు, అమ్మా,  ఈ 360 కిరణాల సముదయానికి పైన, ఆ ఆరుచక్రాలకూ పైన, సహస్రారకమలంలో ఉండే బిందు స్థానంలోనీవు ఆసీనురాలవై ఉన్నావూ, అక్కడే మాకు నీ చరణారవిందాలు దివ్యతేజస్సుతో దర్శనం ఇస్తూ ఉన్నాయీ అని కీర్తిస్తున్నారన్న మాట.

ఇదీ స్థూలంగా ఈ శ్లోకానికి వ్యాఖ్య.  ఐతే ఈ శ్లోకంలో మరికొంత లోతుగా వ్యాఖ్యానించితే గాని ఇది తగినంతగా  బోధపడదు, వ్యాఖ్య కుడా సంపన్నం కాదు.

అందుచేత, తదుపరి టపాలో ఇదే శ్లోకానికి వ్యాఖ్యను కొనసాగించటం జరుగుతుంది.

ఈ 14వ శ్లోకవ్యాఖ్య కొనసాగింపును ఇక్కడ చదవండి.
4 కామెంట్‌లు:

 1. ఒక సారి రెండు సార్లు చదివినా అర్ధం చేసుకోడం కష్టమే. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. ఇది సాంకేతికాంశాలతో కూడిన ఒక శ్లోకానికి వ్యాఖ్య కదండి, అందుచేత కొంచం పెద్దగా వ్యాఖ్య ఉంటుంది. అలాగే అర్థం చేసుకోవటం కూడా మరీ అంత సులభం కాకపోవచ్చును. అందుకనే రెండుమూడు టపాలుగా విడిగా వ్రాస్తున్నను శ్లోక వ్యాఖ్యను. లోతైన శాస్త్ర విషయాలు చెప్పను. అంతా ఉపరిస్పర్శ మాత్రం చేస్తాను. ఐనా కొంచెం పెద్ధగానే వస్తుంది.

  ఒకటి రెండు మారులు అదనంగా పరిశీలిస్తే అంతా సులభంగా తెలిసుకోవచ్చును.

  రిప్లయితొలగించండి
 3. ఇన్ని రోజులు చదువలేక పోయాను మంచి సమాచారం ఇచ్చారు. చదవగానే అర్థం అయ్యే తీతిలో వుంది.

  రిప్లయితొలగించండి
 4. ఈ చక్రాలు వికాశించా లి అంటే ఎం చేయాలి

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.