మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
ఈ 15వ శ్లోకం గురించి ఇప్పటికి దాని వాచ్యార్థాన్ని వివరించటం జరిగింది. కొన్ని కొన్ని అవసరమైన సాంకేతికమైన అంశాలను గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం.
ఈ శ్లోకంలో ప్రస్తావించినదాన్ని సారస్వత ప్రయోగం అని అంటారు. అమ్మవారి పంచదశాక్షరీ మంత్రంలో మొదటి ఖండాన్ని వాగ్భవ కూటం అంటారు. ఈ వాగ్భవ కూట స్వరూపిణిగా అమ్మవారిని ధ్యానించటానికే సారస్వతం అని పేరు. ఈ సారస్వతస్వరూపాన్ని ధ్యానించి మ్రొక్కిన వారికి, వారి సమర్థతతో సంబంధం లేకుండా, అత్యంత మధురమైన కవిత్వాన్ని చెప్పగలిగే సామర్థ్యాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది. దానికి విలోమంగా కూడా చెప్పవచ్చు. అది ఎలాగంటే, ఎంత సమర్థుడైనా సరే, అమ్మ యొక్క సారస్వతస్వరూపాన్ని అనుసంధానం చేయని వారికి -అంటే ముఖ్యంగా దాని పట్ల చులకన భావమో, నిరసన భావమో ఉన్నవారికి - ఎంత చదివినా, ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కించిత్తుగా నైనా కవిత్వం చెప్పగల భాగ్యం అన్నది కలగనే కలగదు అని. వేదత్రయి యొక్క ప్రథమాక్షర సంపుటీకరణమే ఐం బీజం. ఇదే వాగ్బీజం అని చెప్పబడుతుంది. ముందుగా త్రయీ అన్న పదం యొక్క నిర్వచనం చూదాం. వేదములకు త్రయీ అని పేరు. ఈ త్రయీ అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేవి. ఇంకొక రకంగా కూడా వేదానికి త్రయీ అన్న పేరు ఉంది. వేదం అనేది సంహితలు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులూ అని మూడు విభాగాలు కాబట్టి వేదానికి త్రయీ అని పేరు అని. ప్రధానం సంహితలు, సంహితల నుండి బ్రాహ్మణములు, వాటి నుండి ఉపనిషత్తులు ఇలాగు వాటి క్రమం. మొదట వేదసారస్వతం అంతా సంహితలే. అంటే ఇవన్నీ మంత్రభాగాలు. ఋషులు భగవంతుని సంకల్పం చేత దర్శించి ద్రష్టలై వీటిని గ్రహించి కూర్చినవి. బ్రాహ్మణములు సంహితలకు వ్యాఖ్యాన రూపమైనవి. యజ్ఞయాగాదుల స్వరూపాలూ అనేక కర్మలయొక్క నిర్వహణా విధులూ వీటిలో ఉంటాయి. ఉపనిషత్తులు కేవలం జ్ఞానసంబంధమైన విషయాలను వివరిస్తాయి. ప్రసిధ్ధమైన వేదవిభాగాలే ఐన ఆరణ్యకాలు బ్రాహ్మణాలతో పాటే గణించబడతాయి అవి కూడా కర్మలకు సంబంధించినవే కాబట్టి. ఇలా వేదసంపుటికి త్రయీ అన్న సార్థకనామం ఉన్నది. ఇక్కడ వాగ్భవబీజం విషయంలో మూడువేదాల ప్రథమాక్షరాలు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల ప్రథమాక్షరాలని సులభంగానే పోల్చుకోవచ్చును. ఈ ప్రథమాక్షరాల సంపుటి ఐ. అక్షరానికి బిందువు చేరితేనే అది బీజాక్షరం అవుతుంది, కాబట్టి ఐం అనేది బీజాక్షరం. వేదాలు విజ్ఞానం యొక్క పారమ్యం కాబట్తి ఈ ఐం అనేది వాక్-భవ అంటే వాగ్భవ బీజం. ఈ బీజాన్ని ఉపాసన చేసిన దానికి ఫలితాలు సర్వవిద్యలలోనూ పాండిత్యమూ, అతిమధురమైన కవిత్వం చెప్పే శక్తీ అన్నవి. ఈ ఐం బీజమే మహాకాళీ బీజంగా దుర్గా నవాక్షరిలో ఉంది. కాళిదాసు ఈ ఐం బీజాన్ని సేవించటం వలననే అతని పూర్వసామర్థ్యంతో సంబంధం లేకుందా తక్షణమే దివ్యమైన విద్యావైభవాన్ని అతి మహత్తరమూ అత్యంత మధురమూ ఐన కవిత్వం చెప్పే శక్తినీ సంపాదించ గలిగాడు. కవికులానికే ఆయన గురువు అనిపించుకున్నాడు కూడా. ఇక్కడ అమ్మవారికి నాలుగు హస్తాలలోనూ ఉన్నవి పురుషార్థ ప్రదాయకాలు. వరముద్ర వాంఛితార్థం ఇచ్చేందుకూ, అభయముద్ర జననమరణాలనే నిత్యభయాలను తొలగించేందుకూ, జపమాల అన్నది తపస్సుకు తానే ఫలితార్థం అన్నది సూచించటానికీ, పుస్తకం సర్వవిద్యలకు తానే ఆలవాలం అని చెప్పటానికీ గుర్తులు. ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున 41రోజులు పారాయణ. నైవేద్యంగా తేనె, అరటిపండ్లు, చక్కెర. పారాయణఫలం విజ్ఞానప్రాప్తి, కవిత్వశక్తి. |
"ఇక్కడ వాగ్భవబీజం విషయంలో మూడువేదాల ప్రథమాక్షరాలు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల ప్రథమాక్షరాలని సులభంగానే పోల్చుకోవచ్చును. ఈ ప్రథమాక్షరాల సంపుటి ఐ" - మూడు వేదముల ప్రథమాక్షరాలు ఐ ఎలా అయినవో వివరించగలరా?
రిప్లయితొలగించండి