7, అక్టోబర్ 2014, మంగళవారం

సౌందర్యలహరి - 13 నరం వర్షీయాంసం ....



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


13    

నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగా లోకే పతిత మనుధావంతి శతశః 
గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయా
హఠాత్ త్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః


అమ్మవారి కడగంటి చూపు ఎంత మహత్తరమైన ప్రభావం కలదో శ్రీశంకరులు చమత్కారంగా చెబుతున్నారు.

నరం వర్షీయాంసం అంటే బాగా ఏళ్ళి మీదబడ్డ ముసలివా డయిన మనిషి.

నరం నయనవిరసం అంటే కళ్ళకు ఏమాత్రం ఇంపుగా లేని ఆకారం కలవాడు ఐన మనిషి.

నరం నర్మసు జడం అంటే వఠ్ఠి మందబుధ్ధి, ఓ సరసం చట్టుబండలూ తెలియనై ఎడ్డి మానవుడు.

ఇలాంటి వాడిని ఎవరైనా మెచ్చుకుంటారా?
ఇలాంటి మగవాడిని ఏయువతి ఐనా కన్నెత్తి చూస్తుందా?
ఒక్కనాటికీ అలా ఎవ్వతె కూడా చేయదు.

అపాంగం అంటే క్రీగంటి చూపు అని అర్థం. ఆలోకనం అంటే చూడటం. తవ + అపాంగే + ఆలోకే -> తవాపాంగేలోకే అంటె అమ్మా నీ యొక్క కడగంటి చూపు అని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ.

తవాపాంగేలోకే పతితమ్‌ అంటే ఏ పురుషుడి మీద ఐతే అమ్మా నీ‌ యొక్క కడగంటి చూపు పడిందో వాడు అని, వాడికి పట్టే అదృష్టాన్ని వర్ణిస్తున్నారు.

ఏమిటట వాడికి పట్టే అదృష్టం?  వాడు ఎంతగా పనికిమాలిన వాడైనా సరే,  అంటే చీకు ముసలాడైనా, కురూపి ఐనా, మందబుధ్ధి ఐనా సరే, వాడిని శతశః యువతయః అనుధావంతి అని అంటున్నారు. అంటే వందలకొద్దీ‌మంది అమ్మాయిలు వెంటబడి పరుగులు పెడతారట వాడి కోసం ఐనా సరే వాడికి అమ్మ కడగంటి చూపుల దయ దొరికిన కారణంగా.

ఆ వెంటబడటం కూడా ఏలాగనుకున్నారు?

గలద్వేణీ బంధః అనగా  జుట్టుముడి జారిపోతున్న వాళ్ళూగానూ,

కుచకలశ విస్రస్త సిచయా అనగా గుండెలనుండి పైటలు జారిపోతున్న వాళ్ళు గానూ,

హఠాత్ తృట్యత్ కాంచ్యః అనగా  హఠాత్తుగా మొలనూలు జరిపోతున్నవాళ్ళు గానూ

విగళిత దుకూలాః అనగా కట్టుబట్టలు ఊడిపోతున్నవాళ్ళుగానూ

ఆ మహానుభావుడి వెంట శతశః అంటే వందలమంది అమ్మాయిలు పరుగులు తీస్తూ వెంబడిస్తారట.

అదీ అమ్మవారి కడగంటి చూపు ఒక్కటి దక్కితే ఎంత ఘనమైన జగన్మోహనత్వం కలుగుతుందో ఎలాంటివాడికైనా అని శ్రీశంకరులు అనటం.

ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం‌ ప్రస్తావించాలి.  ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణగారు అందరికీ అక్షరాలు వచ్చాయి కాని అందరులూ‌ చదువరులు కారు అన్నట్లుగా వ్యాఖ్యానించారు ఏదో సందర్భంలో.  ఇక్కడ ఈ‌ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలీ అన్న ప్రశ్న ఒకటి నేనే వేసుకొని సమాధానం చెప్పకపోతే రకరకాలుగా అర్థాలు తీసే ప్రమాదం ఉంది చదువరుల్లో కొందరు.  ఇలా ఒకే శ్లోకం లేదా ఒకే మాట జనంలో రకరకాలు అర్థం కావటానికి కారణం అధికార బేధం. ఈ‌ అధికార బేదం అనేది జన్మజన్మాంతరాలుగా సంపాదించుకొన్నదీ, ఈ‌ జన్మలో మనం మెఱుగు దిద్దుకుంటున్నదీ ఐన సంస్కారపు తీరుతెన్నులను బట్టి వస్తుంది. అదెలాగూ అంటే చూడండి.

అనధికారులుగా ఉన్నవాళ్ళు ఈ‌ శ్లోకం చదివి, చూసారా మీరేమో ఆ శంకరాచార్యులను ఇంతవారూ‌ అంతవారూ అంటారు, గొప్ప విజ్ఞానీ, వేదాంతీ అంటారు. అలాంటి వాడు ఇంత పచ్చి శృంగారవర్ణనతో వ్రాయటం ఏమిటీ అదీ‌ అమ్మవారి మిష పెట్టి? ఇదంతా చూస్తే ఈ వేదంతమూ వగైరా అంతా డొల్ల - పైపై మాటలే.  తలలు బోడులైన తలపులు బోడులా అన్నట్లు ఈయన తలలో చాలా పైత్యం ఉందీ‌ అని హేళన చేస్తారు.  దానికి కారణం? వాళ్ళకు శ్లోకంలో ముక్కస్య ముక్కార్థః అన్నట్లుగా అన్వయం చూసుకొని అదే దానికి నిజమైన అర్థం అనుకుని అక్కడే ఆగిపోవటం.  అంతే కాదు. వాళ్ళలో చాలా మంది విమర్శించటానికి నోరు చేసుకుందుకు ఎక్కడ సందు దొరుకుతుందా అని రంధ్రాన్వేషణ చేయటం కోసమే చదవటం మరొక ముఖ్యకారణం. వీళ్ళకి శ్లోకంలో మరేదన్నా అంతరార్థం ఉందా అన్నది పట్టదు. ఒక వేళ ఎవరన్నా సూచించినా బుధ్ధికి ఎక్కదు.  వీళ్ళతో‌ సమయం వృధా చేసుకోకూడదు.

అల్పాధికారులు కొందరుంటారు.  వాళ్ళూ శ్లోకంలో ప్రతిపదార్థం మాత్రమే గ్రహిస్తారు. విస్మయం చెందుతారు. ఓహో ఈ‌ శ్లోకం వలన స్త్రీవశ్యం లాంటి ప్రయోజనాలున్నాయన్న మాట అనుకుంటారు. వాళ్ళలో కొందరికి ఇలాంటీ అవసరాలు తోచవచ్చును.  వాళ్ళు ఇంక అటువంటి కోరికలతో శ్లోకాన్ని పారాయణం చేస్తారు. గీతలో భగవంతుడు చెప్పిన అర్థార్థులు వీరు. వీళ్ళకి లభించే ఫలితం స్వల్పమే. ఎందుకంటే వీళ్ళు చిత్తశుధ్ధితో శ్లోకాన్ని అవగతం చేసుకోలేదు కాబట్టి.

మధ్యమాధికారుల సంగతి. వీళ్ళకు శ్లోకంలో ఏదో‌ సంకేతికార్థం ఉండవచ్చును అనిపిస్తుంది. శంకరులు వెఱ్ఱివారా కేవలం‌ శృంగారదృష్టితో వ్రాయటానికి? అందుచేత సరైన అర్థం కోసం ఆరాటపడతారు. వారి సహజమైన భక్తిప్రపత్తుల కారణంగా సరిగా అర్థం చేసుకొనటానికి మరింత శ్రమిస్తారు. ఎవరైనా ఉత్తమాధికారులు అటువంటి సాంకేతికమైన సమధానంతో శ్లోకాన్ని అన్వయం చేస్తే ఆనందిస్తారు.

ఉత్తమాధికారులు కొందరు. వారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది. వారు పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ శ్లోకంలో ఉన్న విషయాన్ని సరైన దృక్పధంతో అర్థంచేసుకో గలరు. వారు అమ్మవారిని గురించి శ్రీశంకరులు ఇలా ఎందుకు చెప్పారు అని విస్మయపడరు. మనలా పైపై అర్థం వారిని భ్రమపెట్టలేదు కాబట్టి. వీరు ఇతరులకు దిశానిర్దేశం చేయగలరు. ఇలాంటి వారి గురించే స్వయం తీర్ణః పరాం స్తారయతి అని చెప్పారు.


ఇప్పుడు ఈ‌ శ్లోకాన్ని మరింత నిశితంగా పరిశీలిద్దాం. మూడు రకాలైనా అసమర్థులను గురించి ప్రస్తావిస్తూ శ్లోకారంభం చేసారు.  వయస్సుచేత సామాజికంగా వెనుకబాటు తనానికి గురౌతున్నవాళ్ళనీ,  లోకం కంటికి ఆనని వాళ్ళనీ, మాటకారి తనం లేక ఈ లోకంలో నెగ్గుకుని రాలేకపోతున్న వాళ్ళనీ‌ ప్రస్తావించారు.

వయసులో ఎంత వెలుగు వెలిగినా, వయసుడిగి, ఆర్జన కరువై, ఇతరుల సహాయం మీద ఆధారపడ్డవారిని ఈ లోకం ఇప్పుడే కాదు ఆ శ్రీశంకరుల రోజుల్లోనూ‌ లోకువగానే చూసేది మరి.  భజగోవింద శ్లోకాల్లో, యావద్విత్తో పార్జనసక్త: తావన్నిజ పరివారో రక్త:। పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపీ న పృఛ్ఛతి గేహే అని చెప్పారు కదా? ఇంట్లో పడి ఉన్న ముసలాణ్ణి ఎవరు పట్టించుకుంటారూ అని!  వీళ్ళకి దేవుడే దిక్కు.

లోకం కంటికి ఆనకపోవటం అనేది ముఖ్యంగా ఆ వ్యక్తి వయస్సూ, వర్చస్సూ, సామాజికస్థితిగతులూ వగైరా సంతతుల మీద ఆధారపడి ఉంటుంది అని అందరూ ఒప్పుకుంటారు. సామాజికగౌరవం అనేది కేవలం ప్రతిభమీదనే లభించే అవకాశం తక్కువే. అలాంటి గౌరవం నోచుకోని వారికి భగవంతుడే సహాయం చేయాలి.

కొందరికి వయస్సూ ఉంటుంది. సామాజికంగా అన్ని ఆనుకూల్యతలూ ఉంటాయి. కాని ఏమీ మాటకారి తనం ఉండదు. పెళుసుమాటలో, నంగిమాటలో, సభాపిరికితనమో వీరిని జనామోదం పొందకుండా అడ్డుపడతాయి. ఇందులో చాలామందికి ఆ సమస్యను అధిగమించే దారి కనబడదు. వారికి కూడా భగవత్సహాయం అవసరమే.

శ్రీశంకరులు ఇలా ఏ కారణంగా జనామోదానికి దూరం అవుతున్నా సరే, అమ్మని వేడుకోండయ్యా అని సలహా ఇస్తున్నారు. ఆవిడ వాడి కేసి తిరిగి ఏమీ చేయనక్కర లేదు.  కేవలం ఒక్క సారి కడగంటితో చూస్తే చాలు వాడి వెంట సమాజం అంతా సమ్మోహితులై వెంటబడి మరీ గౌరవాదరాలలో ముంచెత్తుతారు అని నొక్కి చెబుతున్నారు. ఇలా లోకసమ్మోహనశక్తిని అమ్మ కడగంటి చూపు అనుగ్రహించటం అన్న దాంట్లొ సమ్మోహనం అన్న మాటమీద శృంగారపరమైన విస్తృతి కల్పిస్తూ, ఒక అసమర్థుడైన వాడి వెంట అమ్మ అనుగ్రహం స్త్రీజనాన్ని పరుగులు పెట్టించటం అనే ఉదాహరణగా చెప్పారు అంతే.

అమ్మ కడగంటి చూపు అంత శక్తిమంతమైనదా అని ఎవరికైన సంశయం ఉంటే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి నోట అక్షరమ్ముక్క లేని ఒక కుర్రవాణ్ణి అమ్మ క్రీగంటి చూపు మహాకవి కాళిదాసు అనే కవికుల గురువును చేసిన సంతతిని.

ఈ శ్లోకానికి ధ్యానం ఆరురోజుల పాటు ప్రతిదినం వేయిమారులు పారాయణ పూర్వకం. నైవేద్యం  త్రిమధురం.  ఫలితం సర్వజనాకర్షణ శక్తి.


1 కామెంట్‌:

  1. Ee slokaaniki mee vyaakhya paramaadbhutham....
    world teachers trust publication lo kontha nachindi...vaari telugu setha padyamuunu .meeru cheppindi chaalaa baavundi.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.