30, అక్టోబర్ 2014, గురువారం

శ్రీశైలజలవివాదంపై వనం వారి వ్యాసానికి తెలుగుసేత.

ముందుమాట


శ్రీ వనం‌ జ్వాలానరసింహారావుగారు 27న వ్రాసిన ఆంగ్లవ్యాసానికి ఇది తెలుగుసేత.

నిజానికి జ్వాలాగారే తెలుగులో ఈ‌ పనికూడా చేయవచ్చును.  ఆంగ్లంలో వ్రాయటానికి వారి కారణాలు వారివి. ఆంగ్లంతో ఇబ్బంది ఉన్న తెలుగుపాఠకుల కోసం దీన్ని యథామాతృకానువాదం చేసి ఇక్కడ ఉంచుతున్నాను.

మూలవ్యాసం: 

Decency not at the cost of State

తెలుగు అనువాదం

ఇది ఆంధ్రప్రదేశప్రభుత్వ ప్రజాసంబంధాల సలహాదారు పరకాల ప్రభాకర్ గారి అయాచితమైన నిరాధారమైన అందునా వారు తెలంగాణా ప్రభుత్వ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారిని నిందిస్తూ చేసినదీ ఐన ప్రకటనకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించిన జీవో 69, 107లను గౌరవించటంలో ఉన్న నిబధ్ధతను విమర్శించుతూ ఔచిత్యానికి సంబధించిన అన్ని హద్దులనూ కేసీఆర్ గారు మీరారని ప్రభాకర్‌గారు ఆరోపించారు. ఆయన తెలంగాణా ప్రభుత్వం ఆ జీవోలను అతిక్రమించిందని కూడా నిరాధారమైన నిందలు వేసారు.

కాని శీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుదుత్పాదన కోసమనే రూపకల్పన చేయబడిన అందుకోసమనే నిర్మించబడిన సంగతీ, అంతే కాక, అసలు ఈ‌ ప్రాజెక్టు పేరే శ్రీశైలం జలవిద్యుదుత్పాక ప్రాజెక్టు అన్నది ఈ‌ విషయాన్ని విస్పష్టం చేస్తున్న సంగతీ‌, అంధ్రప్రదేశ పౌరసంబంధాల సలహాదారుగారు మరచిపోయారు. జీవో 69,107ల తరువాత వాటికి అదనంగా వచ్చిన జీవో 233 అప్పటి అంద్రప్రదేశ్ లోని సీమాంద్రప్రాంతం యొక్క స్వార్థప్రయోజనాలను పరిరక్షించటానికీ, తెలంగాణాకు అపారనష్టం కలిగించటానికీ ఉద్దేశించినది. తెలంగాణా రాష్ట్రం యొక్క, ముఖ్యంగా అందులోని ప్రజల యొక్క ప్రయోజనాల పరిరక్షణను పణంగా పెట్టి హుందాగా ఉండటం‌ కుదరదని ఒక పౌరసంబంధాల నిపుణుడిగా అయన తెలుసుకోవలసి ఉంది.

శ్రీశైలాన్ని కేవలం విద్యుత్తుకోసమైన ప్రాజెక్టుగా చూడాలా, కేవలం సాగు-త్రాగునీటి ప్రాజెక్టుగానే చూడాలా అన్నది నేడు వివాదంగా మారింది. ఎప్పుడో 1960లో, దేశం యొక్క విద్యుదవసరాలను తీర్చుకుందుకుగాని అప్పటి ప్రణాళికాసంఘం, శ్రీశైలంతో సహా దేశమంతా అనేక చోట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి అలోచించింది. ఈ‌ శ్రీశైలం ప్రాజెక్టు రూపకల్పనలొ ఎడమ కాలువక్రింద 900మెగావాట్లు, కుడి కాలువ క్రింద 770మె.వా విద్యుదుత్పత్తి లక్ష్యంగా చేసుకున్నారు. అందుచేత ఈ ప్రాజెక్టు కేవలం జలవిద్యుత్తు కోసమే. దీనిని బట్టి, ఈ‌ ప్రాజెక్టు రూపకల్పనలో, ఇందులో ఒక్క నీటిబొట్టు కూడా వేరే లక్ష్యాలకోసం ఉద్దేశించలేదని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు 1981లో విద్యుదుత్పత్తిని మొదలు పెట్టింది. అందుకోసం జలాశయంనుండి వినియోగించబడిన నీళ్ళు అంతిమంగా నాగార్జునసాగర్ జలాశయం చేరుతాయి కాబట్టి నీరు వృధాగా పోవటం జరగదు. ఈ‌విధంగా శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణాజలాలకు ఒక బేలెన్సింగ్ జలాశయంగా ఉపయోగంలోకి వచ్చింది. ఈ సం. 2014 జూన్ 2 నుండి తెలంగాణా రాష్ట్రం ఉనికిలోనికి వచ్చి, అప్పటినుండి మొదలు, ముందటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విధానాల కారణంగా కష్టాలు ఎదుర్కుంటూ ఉంది నేటికీ. ఈ శ్రీశైలం జలాల విషయంలోనూ జలవిద్యుదుత్పాదన విషయంలోనూ అమితశ్రధ్ధతో లోతుగా విశ్లేషణ చేయవలసి ఉంది. సముద్రంలో పెద్దపెద్ద మంచు దిబ్బలు తేలుతూ‌కనిపిస్తాయి కాని పైకి కనిపించేవి వాటి పరిమాణంలో అతిచిన్న ఉపరితలాలే - లోపల కొండలంత ఉంటాయి కాని. ఇప్పుడు బయటపడ్డ విషయం, ఈ శ్రీశైల జలవిద్యుత్తు ప్రాజెక్టు సంగతి అనేది కూడా, అనాదిగా తెలంగాణా ప్రాంతప్రజలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన పైకి పేలిన అటువంటి వ్యవహారమే.

తెలంగాణాలో ఉన్న దారుణమైన విద్యుత్తు కొరతకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ఇంతకు ముందువరకూ నడిచిన కాంగ్రెసు, టీడీపీ పార్టీలవారి లోపభూయిష్టమైన విధానాలే‌ కారణమని ఒక ప్రాథమికపాఠశాల విద్యార్థి కూడా అర్థం చేసుకోగలడు. తెలంగాణారాష్ట్రంలో విద్యుత్తు రంగానికి సంబంధించిన ఈ పరిస్థితికి ఆ రెండు పార్టీలదే‌ పూర్తి బాధ్యత. గత ఇరవై సంవత్సరాలలోనూ‌ఈ రెండు పార్టీల పాలకులూ తెలంగాణాలో ఒక్కటంటే ఒక్క మెగావాట్ విద్యుత్తును కూడా అదనంగా ఉత్పత్తి చేసిన పాపానపోలేదు. ఈ‌ నేపద్యంలో ఆవిర్భవించింది తెలంగాణారాష్ట్రం.

తెలంగాణాప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నింఛి నప్పటికీ, రాష్ట్రంలో ఇంకా విధ్యుత్తుకు కొఱత ఉంది. సమయానికి రైతులకు నిరంతరాయంగా విద్యుత్తు అందించకపోతే, అది కూడా పంటలు వేసే సమయంలో ఐనప్పుడు రైతులమీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతిమంగా అది తిండిగింజల కొఱతకు కారణం అవుతుంది. తెలంగాణా రాష్ట్రంలో సగటు విద్యుదవసరం 6,800 మె.వా ఉంది. నికరమైన ఉత్పత్తి, కేంద్రం ఇచ్చే వాటాలు కలిసి కేవలం 4,500 మె.వా ఉంది. లోటున భర్తీచేసుకుందుకు తెలంగాణా రోజువారీగా 760మె.వా కొనిగోలు చేస్తోంది. ఐనా సరే ఇంకా కొఱత ఉంది. తెలంగాణాకు అందుబాటులో ఉన్న జలవిద్యుత్తు 1000 మె.వా. ఇందులో 700 నుంది 800 మె.వా శ్రీశైలం నుండే వస్తుంది. అందుచేత తెలంగాణాకు ఇది అత్యంత ముఖ్య మైనది.

శ్రీశ్లైలం జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతోందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. సాగు నీటికీ, త్రాగు నీటికి ప్రాథాన్యతను ఇవ్వాలని కూడా ఆ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది నిరాధారమైన వాదన. లభ్యంగా ఉన్న జలాల్లో త్రాగు సాగులకు ప్రాథాన్యత ఇవ్వాలన్నది నిజమే కావచ్చును. కాని, మనదేశంలో కొన్ని ప్రాజెక్టులు కేవలం విద్యుదుత్పత్తికోసమే నిర్మించబడ్డా యన్నది వాస్తవం. వీటిలో శ్రీశైలం ఒకటి. ఈ శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తి కోసమే రూపకల్పన చేయబడింది. ఈ ప్రాజేక్టు ఆలోచన నుండి నిర్మాణం దాకా ఎక్కడా ఒక్క టిఎమ్‍సీ కూడా వ్యవసాయం కోసం అని కేటాయించలేదు. తరువాత కాలంలో, కృష్ణాకు తరచుగా వరదలు వస్తాయనీ, వరదకారణంగా అదనంగా నీరు పుష్కలంగా లభ్యం అవుతుందనీ ఒక వాదన వచ్చింది. ఈ నీళ్ళను వాడుకుందుకు అప్పటి రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది. అదనపు నీటి వాడకం హక్కు అనేది తెరమీదకు వచ్చింది. అదనపు నీళ్ళూ వరదనీళ్ళూ అంటూ ఉన్న వాదన ప్రక్కకు బెట్టి క్రమంగా శ్రీశైలం ఒక వ్యవసాయం కోసమైన ప్రాజెక్టుగా చూడటం మొదలయ్యింది. చివరికి ఈ వాదన ఆధారంగనే జలాల పంపకం జరగటం జరుగసాగింది.

శ్రీశైలం నుండి ఇతర ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని నిర్ణయించటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం 19 టీఎమ్‍సీలు కె.సి.కాలువకు, 15 టీఎమ్‍సీలు తెలుగుగంగకు, అంటే మొత్తం మీద ఆంద్రాకు 34టీఎమ్‍సీలు పోతున్నాయి శ్రీశైలం నుండి. అలాగే 25 టీఎమ్‍సీలు కల్వకుర్తికి, 20టీఎమ్‍సీలు భీమాకు, 22టిఎమ్‍సీలు నెట్టంపాడుకు, 30టిఎమ్‍సీలు SLBCకి తెలంగాణా వాటాగా మొత్తం 97టీఎమ్‍సీలు కేటాయించారు. ఐతే సీమాంధ్రుల పాలనలో తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టలేదు.  అందుచేత 97టీఎఎమ్‍సీలు తెలంగాణా వాడుకో లేక పోయింది.  ఉన్నవి 34టీఎమ్‍సీలే ఐనా ఆంద్రాలో మాత్రం పులిచింతల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టులు కట్టి అక్రమంగా శ్రీశైలం జలాలను తరలించుకు పోయారు. ఈ దోపిడీ ఇంకా నడుస్తూనే ఉంది. తెలంగాణా తనకు హక్కుగా ఉన్న జలాలను వాడుకోలేకపోతోంది. తమకు హక్కు లేని జలాలను ఆంద్రావారు మాత్రం వాడుకుంటున్నారు. ఈ యేడాది కూడా ఆంద్రాప్రభుత్వం అక్రమంగా 60టీఎఎమ్‍సీ జలాలను తరలించుకు పోయారు. తెలంగాణా మాత్రం కనీసం 10టీఎమ్‍సీలు కూడా వ్యవసాయానికి వాడుకోలేక పోయింది. తెలంగాణాకు జలాల నిచ్చే ప్రాజెక్టులు మాత్రం కట్టబడలేదు.

రాష్ట్రవిభజన తరువాత, రెండు రాష్ట్రాలకూ దీనిమీద హక్కు ఉంది కాబట్టి, శ్రీశైలం ఇరురాష్ట్రాలకూ ఉమ్మడి ప్రాజెక్టు అయ్యింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలూ పరస్పరం ఆవలి వారి హక్కుల్ని గౌరవించాలి. తనకు ఉన్న హక్కు కారణంగా తెలంగాణా శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా 900 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలదు. ఇలా తన హక్కును వినియోగించుకునే కమంలో ఎన్నడూ తెలంగాణా తన హద్దుల్ని మీరలేదు. తన కోటాగా కేటా యించబడిన జలాలను గత ప్రభుత్వాలు ఇచ్చిన 69, 107, 233 నంబర్ల జీవోల ప్రకారమే వాడుకుంది. నిజానికి కృష్ణా జలలాలో ట్రిబ్యునల్ వారిచ్చిన కోటా తెలంగాణాకు 261.9 టీఎమ్‍సీ. ఇందులో నికరజలాలు 184.9 కాగా అదనపు వరద నీరు 77టీఎమ్‍సీలు. ఇంతవరకూ తెలంగాణా వాడుకున్నజలాలు మహాఐతే 75.67టీఎమ్‍సీ మాత్రమే . ఉంటాయి. ఇలాగైతే ఖరీఫ్ పంటకు మరొక 26టీఎమ్‍సీల నీళ్ళు కావలసి ఉంటుంది.

జీవో 107 ప్రకారం శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం నిల్వ ఉంచాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 69 ఇస్తూ 834 అడుగులు ఉంటే చాలని నిర్థారించింది. తెలంగాణా ప్రభుత్వం ఈ జీవోలను అతిక్రమించలేదు. ఇప్పుడు కూడా శ్రీశైలంలో 857 అడుగుల నీళ్ళున్నాయి. రోజూ విద్యుదుత్పత్తికి గాను కొన్ని నీళ్ళు ఖర్చు అవుతున్నాయి. ఇందులో తప్పేమీ లేదు. ఆంద్రాప్రభుత్వం మరియు కృష్ణాజలాల నిర్వహణా బోర్డు వారి ప్రకారం వ్యవసాయానికే ప్రాథాన్యత ఇవ్వాలి. సరే, ప్రస్తుతానికి ఈ వాదాన్నే ఒప్పుకుందాం. మరి తెలంగాణా శ్రీశైలం జలాలను ఎందుకు వాడుతోంది? విద్యుత్తు కోసం కదా. ఆ విద్యుత్తు దేనికీ? రైతుల వ్యవసాయ అవసరాల కోసం కాదా? నేరుగా లభ్యజలాలనే వాడుకుందుకు తెలంగాణాలో ప్రాజెక్టులే లేవు. వ్యవసాయానికి గాను ఉన్నవి బోరు బావులే. కరంటు ఉందంటేనే ఆ బావులలోంఛి నీళ్ళు వస్తాయి. ఈ బోరు మోటార్ల వల్ల 500 టీఎమ్‍సీల నీళ్ళు వస్తున్నాయి వ్యవసాయానికి, ఈ పంపుసెట్ల వల్ల 40లక్షల ఎకరాలే సాగులోనికి వస్తున్నప్పటికీ. శ్రీశైలం నుండి కొద్ది పాటి నీళ్ళు మాత్రమే తెలంగాణా తీసుకుంటున్నా వాటిసహాయంతోనే అంతకన్నా అనేక రెట్ల జలసంపదను వ్యవసాయానికి అందించటం జరుగుతోంది.

ఈ నీళ్ళతోనే తెలంగాణా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి శ్రీశైలం నుండి తెలంగాణా తీసుకుంటున్న నీళ్ళను వ్యవసాయం కోసమే అని భావించవలసి ఉంటుంది. అందుకని 854 అడుగుల నిబంధనను కూడా తొలగించాలి. ఆంధ్రాప్రభుత్వమూ, కృష్ణాజలాల బోర్డూ కూడా శ్రీశైలం నీటిని వ్యవసాయం కోసం అని చెబుతున్న దానిని తెలంగాణా కూడా బలపరుస్తోంది. తెలంగాణాకు 834అడుగుల వరకూ నీటిని వాడుకుందుకు హక్కు ఉండాలి. ఆంధ్రాప్రభుత్వమూ, కృష్ణాజలాల బోర్డూ వాస్తవిక ధృక్పధంతో ఆలోచించాలి. ఇక్కద మరొక విషయం ఏమిటంటే ఇప్పుడున్న ప్రాజెక్టులూ, వాటికి నీటి కేటాయింపులూ, వాటి నిర్వహణా అన్ని విషయాలూ కూడా సంయుక్ర ఆంధ్రప్రదేశ ప్రభుత్వం చేత నిర్ణయించబడ్డాయి. ఆ పాత ప్రభుత్వాలు తెలంగాణా రైతులగురించి పట్టించుకోకుండా పక్షపాతంతో వ్యవహరించాయి. అన్ని విషయాలనూ సీమాంధ్రకోణంలోంచి మాత్రమే చూడటం జరిగింది. చివరకి హైదరాబాదుకు, తెలంగాణాకూ త్రాగునీరు ఇవ్వటంలో కూడా పక్షపాతం చూపటం జరిగింది. ఈ కారణంగా, తెలంగాణా ప్రభుత్వం కృష్ణాజలాల కేటాయింపులు, వినియోగాల విషయంలో మరొక సారి పరిశీలన చేయవలసిందిగా కృష్ణాజలాల బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దానికి వారు కూడా అంగీకరించారు. కేటాయింపుల్లో మార్పులు రాబోతున్నాయి. అంతవరకూ, తెలంగాణా రైతుల పంటల్ని కాపాడేండుకు గాను, శ్రీశైలం జలాలను 834అడుగుల వరకూ వాడుకుందుకు తెలంగాణాకు హక్కు ఉండాలి. ఇలా విద్యుత్తు కోసం తెలంగాణా వాడుకున్న నీటిని తెలంగాణా కోటాలో జమకట్టుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణా రైతులపట్ల ద్వేషం ఉండకూడదు, ఆ ద్వేషంతో వారిని బాధించకూడదు.

శ్రీశైలంలో విద్యుదుత్పాదనను ఆపివేస్తే తెలంగాణాకు 300 మె.వా విద్యుత్తుని ఇస్తానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదన విడ్డూరంగా ఉంది. ఇది విషయాన్ని తప్పు దారి పట్టించేదిగా ఉంది. ఎందుకంటే, రైతులకు రోజూ ఐదు లేదా ఆరు గంటల పాటు విద్యుత్తుని ఇవ్వాలంటే 800 మె.వా విద్యుత్తు ఉత్పత్తి చేస్తేనే అది సాధ్యపడుతుంది. ఇది వదలుకుని 300 మె.వా తీసుకుందుకు అంగీకరిస్తే, రోజుకు నాలుగు గంటలు ఇవ్వటం కూడా సాధ్యం కాదు. తెలంగాణా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క దయా భిక్షం కోరుకోవటం లేదు. అది తన హక్కును నిలబెట్టాలనే కోరుతోంది. తనకు హక్కుగా రావలసిన 54శాతం విద్యుత్తు కోటాను కోరుతోంది. కృష్ణపట్నంతో సహా అన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలోనూ తనకు ఉన్న న్యాయమైన వాటాను కోరుతోంది.


(గమనిక: ఇది యథామాతృకానువాదం అంటే అనువాదాన్ని సాధ్యమైనంతగా మూలానికి సరిపోలేలాగు చేసాను. సందేహ నివృత్తి అవసరం అనుకున్న చోట్ల మూలాన్ని పరిశీలించగలరు. ఈ అనువాదం పట్ల వనంవారికి అభ్యంతరం ఉంటే, ఈ టపాను తొలగించవలసి ఉంటుంది.)

29 కామెంట్‌లు:

  1. శ్యామలీయం గారు,

    శ్రీశైలం నీటి వివాదం విషయంలోని వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని మీరు తీసుకున్న నిర్ణయం, శ్రమకోర్చి అనువదించి ఈ వ్యాసాన్ని ప్రచురించడం శ్లాఘనీయమైన విషయం. మీబోటి వారి ప్రయత్నాల వల్ల రాబోయే రోజుల్లో అయినా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అపార్థాలు తొలగిపోవాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు రెండు రాష్ట్రాలూ సమానమే. ఆవేశకావేశాలను ప్రక్కన పెట్టి ఆలోచిస్తే అనేకమందిది ఇదే పరిస్థితిగా ఉంటుందని భావిస్తున్నాను.

      ఇది వనం వారి వ్యాసం. అయన ఒక బ్లాగరుగానే కాక తెలంగాణాప్రభుత్వంలో ఒక బాధ్యతగల స్థానంలో ఉన్నారు. వారి అభిప్రాయం చాలా ముఖ్యమైనది. కాని అది ఆంగ్లంలో ఉండటం వలన ఇరుపక్షాల వారిలోనూ అంగ్లాన్ని సరిగ అర్థం చేసుకోవటంలో ఇబ్బంది పడే వారి సౌలభ్యం కోసం మాత్రమే ఇలా తర్జుమా చేసి ప్రకటించాను. ఈ సంగతి నా ముందుమాటలో స్పష్టంగానే చెప్పాను.

      కొంచెం పనుల వత్తిడిలో ఉన్నాను కాబట్టి అనువాదం చేయటానికి వెంటనే పూనుకోలేక పోయాను. అందుకే కొంచెం ఆలస్యం ఐనా, ఇంకా విషయం ప్రజాదృష్టిలో ఉన్నదే కాబట్టి తెనిగించాను.

      ఇందులో నా అభిప్రాయం అంటూ ఎక్కడా ప్రస్తావింఛలేదు. గమనించగలరు.

      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. దీంతో రోజుకి 300 మెగావాట్లు విద్యుత్ ఇస్తామని.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి మానేయాలని ఏపీ సర్కారు తెలంగాణకు ఆఫర్ ఇచ్చింది. మాకేమన్నా బిచ్చమేస్తున్నారా అంటూ తెలంగాణ సర్కారు ఆ ప్రతిపాదనకు అందించకుండా విద్యుదుత్పత్తి కొనసాగించింది. ఇంత గొడవ చేసి వారు చేసిన విద్యుదుత్పత్తి చూస్తే తెలంగాణవాదుల దిమ్మ తిరిగిపోయింది. గత నాలుగు రోజుల విద్యుదుత్పత్తిని పరిశీలిస్తే.. 23వ తేదీన 110 మెగావాట్లు, 24 న112, 25 న128, 26న 180,27 వ తేదీన 140 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశారు. సరాసరిన రోజుకు 130 మెగావాట్లను ఉత్పత్తి చేశారు. అసలు విద్యుదుత్పత్తిని ఆపితే రోజుకు 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ చెప్పింది. అంటే రోజుకు 170 మెగావాట్లు ఎక్కువ. ఇప్పుడు చెప్పండి.. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నది కేసీఆరా లేక చంద్రబాబా?

    http://www.namastheandhra.com/2014/10/30/54164/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవిగారూ, మీ ప్రశ్నను వనం వారి బ్లాగులో‌ఉంచగలరా? ఈ విషయంలో వివరణ ఇవ్వగలది ఆయనే. ఆయన తెలుగువారే, తెలుగులో కూడా విస్తారంగా ఆయన బ్లాగులో వ్రాస్తారు కూడా కాబట్టి మీరు ఆంగ్లంలో ఐనా తెలుగులో ఐనా ఆయనను అడగండి. ఇక్కడ నన్నడిగి లాభం ఏమీ ఉండదు కదా? నేను కేవలం అయన వ్యాసాన్ని తెలుగులో అందించా నంతే!

      తొలగించండి
    2. తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
      దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
      తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
      చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

      తొలగించండి
    3. రవిగారూ,

      ఇటువంటి దూకుడే నాకు విచారం‌ కలిగించేది.

      మీరు ఈ‌ పద్యాన్ని తెలంగాణావారిని ఉద్దేశించి ఆరభిరాగంలో పాడి వినిపించితే వారూ ఇదే పద్యాన్ని దేవగాంధారిలో వినిపించలేరా మీకే?

      మీ‌ దృక్కోణంలో తెలంగాణావారి దగ్గర ఉంది తప్పు. వారి దృక్కోణంలో‌ సీమాంధ్రవారిదగ్గర ఉంది తప్పు. తప్పు మీదంటే మీదని కారాలూ మిరియాలూ నూఱుకుంటూ కూర్చుంటే ఇరుపక్షాలూ, విద్వేషాగ్నులు జ్వాలలు జాపటం తప్ప ఏ పక్షానికీ‌ మేలు జరగదు కదా.

      ఏ‌ పక్షానా కూడా చదువురాని వారూ, విషయపరిజ్ఞానం లేనివారూ మాట్లాడటం లేదు. అవగాహనలు వేరు వేరుగా ఉన్నాయంతే. కృష్ణాజలాల బోర్శువారో కేంద్రమో ఈ‌ సమస్యను పరిష్కరించ వలసినదే తప్ప ఇరుపక్షాలూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం వలన పరిష్కారం లభించదు, అలాగే ఇరుపక్షాల ప్రజలూ సానుభూతిపరులూ కూడా సంయమనంతో ఉండాలి కాని చిలిపి వ్యాఖ్యలతో పరిస్థితిని మరింతగా దిగజార్చకూడదని నా విజ్ఞప్తి.

      నిజనికి మీ‌ పై వ్యాఖ్యను నేను ప్రచురించ వద్దనుకున్నాను. కాని ఈ నాలుగు మాటలూ మరొక సారి విన్నవించటం అత్యవసరం అని భావించటం వలన మీ వ్యాఖ్యా, నా విజ్ఞప్తీ ఇక్కడ ఉన్నాయి.

      నా మాటలు మీకు నచ్చవచ్చు లేదా నచ్చక పోవచ్చును. కానీ ఈ‌ నాలుగు మాటలూ వ్రాయవలసిన బాధ్యత నా మీద ఉందని భావిస్తున్నాను.

      తొలగించండి
    4. అవగాహన కాదు, అవకాశం.
      ఇది తెలంగాణావాదులకే పరిమితం కాదు. ప్రతి భారతీయుడూ అంతే. స్వార్ధమే పరమావధి. నిజం ఎవరికి పట్టింది. మనకి నచ్చింది, మనకి లాభం ఉన్నది మనం నిజం అంటాం. అది నిజమా కాదా ఎవడికి కావాలి? నాకు తెలిసి ఏ ఉద్యమం ఐనా, ఏ మత/కుల ఘర్షణ ఐనా పేరుకి ఏవో, కాని అధికారమో, ధనమో, మోహమో పరమా"వధే".
      మాది పూణె. పుట్టింది, పెరిగింది, చదివింది, పనిలో పనిగా పెద్దపులి.....,

      తొలగించండి
    5. ఒకరు నా దృష్టికి తెచ్చిన లింక్:

      http://www.thehindu.com/news/cities/Hyderabad/power-generation-cut-down-in-srisailam-stepped-up-in-sagar/article6530718.ece

      ఈ లింక్‌ను ఇక్కడ నేను సూచించింది పాఠకుల సౌకర్యార్థమే . ఇలా చేయం నా వ్యక్తిగత అభిరుచి మేరకు అనుకో నవసరం లేదని గమనించగలరు.

      తొలగించండి
    6. రవి గారు ఇచ్చిన వివరాలు సరైనవే అయినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు బట్టలేము.

      1. పైన ఇచ్చిన తేదీల్లో తెలంగాణా మొత్తం ముసురు పట్టి వుంది. అంటే రైతులు విద్యుత్తు అసలే వాడరు. అందువల్ల విద్యుత్తు ఉత్పత్తి చేయక పోయి వుండవచ్చు.
      2. పైగా శ్యామలీయంగారు ఇచ్చిన హిందూ లింకు ద్వారా సదరన్ గ్రిడ్‌లో వచ్చిన అధిక మొత్తం విద్యుత్, ఉత్పత్తి తగ్గించడానికి ఒక కారణంగా కనపడుతూనే వుంది.
      3. ఇతర మార్గాల ద్వారా అధిక విద్యుత్ వచ్చినా, లేదా తెలంగాణాలో కొఱత తగ్గినా, తెలంగాణా ప్రభుత్వం శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిని ఆపి నీటిని పొదుపు చేస్తోందని అర్థమవుతోంది. ఇది మంచిదే కదా!
      2. ఆంధ్ర ఇవ్వజూపిన 300 మెవా విద్యుత్తు ఊరికే ఇవ్వడం లేదు. అధిక ఖరీదుకు కొనుక్కోవాలి. ఇక శ్రీశైలం విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి కర్చు చాలా తక్కువ.
      3. ఒకవేళ 300 మెవా విద్యుత్ అఫర్‌కి ఒప్పుకుంటే శ్రీశైలం ద్వారా 800 మెవా ఉత్పత్తి చేసుకునే హక్కు కోల్పోవలసి వస్తుంది. విద్యుత్ అవసరం రోజూ ఒకలా వుండదు కాబట్టి తెలంగాణా సహజంగానే ఆ అఫర్‌ని అంగీకరించదు.

      ఇక చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు.

      1. కృష్ణపట్నం పూర్తి అయినప్పటికీ కావాలని ఉత్పత్తి ప్రారంభించడం లేదు.
      2. తెలంగాణాకు న్యాయంగా రావాల్సిన మొత్తం ఉత్పత్తిలో 54 శాతం వాటా ఇవ్వడం లేదు.
      3. అశోక్ హిందుజా యొక్క ప్రైవేటు విద్యుత్ కర్మాగారంతో తెలంగాణాకు PPA ఉన్నప్పటికి, ఆంధ్ర ప్రభుత్వం ఆ కరెంటును ఇవ్వ నివ్వటం లేదు.

      తొలగించండి
    7. శ్రీకాంత్ గారూ, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న బ్రహ్మాండమయిన లబ్ది ఏమిటంటే ఒక్క నీటి చుక్క కూడా వ్యర్ధం కాదు. టర్బైన్ మీద పడ్డ నీరు విద్యుత్ ఇవ్వడమే కాక పూర్తిగా మళ్ళీ కిందికి పోతుంది. చంద్రబాబు అయాచితంగా ఇస్తానన్న 300 మెగావాట్లు తీసుకుంటే నీళ్ళు జలాశ్రయంలో ఉండిపోయి నల్గొండ అవసరాలను తీర్చలేవు.

      ఆంద్ర ప్రభుత్వం సాగర్ విద్యుత్ వాడుకోమన్నది కూడా ఇందుకే (వారికి దిగువ నీళ్ళు వస్తాయి). మీరన్నట్టు ఇవ్వాల్సింది ఇస్తే చాలు, మెహర్బానీలు అక్కరలేదు.

      మరో విషయం. కరడు కట్టిన తెలంగాణా వ్యతిరేకి (పరకాల గారికి అత్యంత ఆప్తుడు) నలమోతు చక్రవర్తి ఇచ్చిన జాబితా ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకు బచావత్ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదు. ప్రభాకర్ ఈ విషయాన్ని తన మిత్రుడితో తేల్చుకుంటే బాగుంటుంది :)

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. జ్వాలాగారూ,

      ఈ‌ తెలుగుసేతను ఆమోదించినందుకూ,అభినందించినందుకూ అనేక సహర్షధన్యవాదాలు.

      తొలగించండి
  4. 2. తెలంగాణాకు న్యాయంగా రావాల్సిన మొత్తం ఉత్పత్తిలో 54 శాతం వాటా ఇవ్వడం లేదు.
    >>
    శ్రీకాంత్ చారి గారు, ఈ 54% నిష్పత్తి గురించి యెక్కడ రాశారు? కొంతమంది 56% అంటున్నారు, 58% అంటున్నారు.

    కానీ యెవ్వరూ దీనికు రుజువులు ఇవ్వలేదు. సీమాంధ్రకు ఇంత నిష్పత్తి, తెలంగాణాకు ఇంత నిష్పత్తి అని వివరంగా యెక్కడ రాసారు?

    Please copy/paste the text and the source link.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణా బిల్లు, 12వ షెడ్యూల్, సెక్షన్ సీ6 చూడండి. వినియోగ లెక్కల వివరాలు నా దగ్గర లేవు.

      తొలగించండి
    2. http://reorganisation.ap.gov.in/downloads/A.P.RegulationAct2014.pdf

      THE TWELFTH SCHEDULE, C. Power

      2. Existing Power Purchase Agreements (PPAs) with respective DISCOMS shall
      continue for both on-going projects and projects under construction.

      http://www.aperc.gov.in/aperc1/assets/uploads/files/6680f-advisory3.pdf

      ANDHRA PRADESH ELECTRICITY REGULATORY COMMISSION
      Lr No. Lr. No.APERC/Secy/F:State Reorganistion/2014-4 Dated 14.08.2014

      Para 12 Table 1:
      Percentage Alocation as per Third Transfer Scheme(208)
      Andhra Pradesh 38.07%
      Telangana 61.93%

      Revised Percentage Alocation- Post Bifurcation GO Ms No 20, dt 08-05-2014
      Andhra Pradesh 46.1%
      Telangana 53.89%

      అంటే ఏంటన్న మాట? యాక్టు ప్రకారం పవర్ అల్లోకేషన్లు యధావిధిగా కొనసాగించాలి కాబట్టి అంతకు ముందు 61.93% ఉన్నదాన్ని విభజన సందర్భంలో అధికారం చేతిలో వుంది కాబట్టి 53.89% కి తగ్గించారు. ఇప్పుడు అది కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

      తొలగించండి
    3. The power of the Central Generating Stations will be allotted in such ratio to the State of Telangana and the State of Andhra Pradesh based on the actual energy consumption of the last 5 years of the relevant DISCOMS in the respective successor State.
      >> Do you think this is reasonable?

      హైదరాబాదు ఒకప్పటి సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి సీమాంధ్రలో కోతలు పెట్టి మరీ విద్యుత్ సరఫరా చేశారు.

      మీరు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో వుద్యోగిని మాట్లాడిన వీడియో చూశారో లేదో!

      ఆవిడ కరక్ట్ పాయింట్ చెప్పారు: సీమాంధ్రకు ఇప్పటివరకు రెండు ముద్దలు పెడితే తెలంగాణాకు ఆరు ముద్దలు పెట్టారు. నువ్వు ఇప్పటివరకు రెండు ముద్దలతో బ్రతకగలిగావు కాబట్టి నీకు రెండు ముద్దలే అనడం సమంజసమా?

      బిల్లు పాస్ చేయించి రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ను సీమాంధ్రలో నామరూపాల్లేకుండా చేశారు. దీన్ని బట్టి సీమాంధ్ర వాళ్ళు విభజనను వొప్పుకోలేదు అన్న విషయం తెలియడం లేదా? అసలు విభజననే వొప్పుకోని వాళ్ళు విభజన బిల్లుని మాత్రం యెందుకు పట్టించుకోవాలి?

      విభజన బిల్లేమన్నా భగవద్గీతా?

      తొలగించండి
    4. ఆధారాలు చూపే సరికి వాదన ఇలా మారిందన్న మాట!

      GO నెం. 107 ఏమన్నా భగవద్గీతా? ఎందుకు గగ్గోలు పెడుతున్నారు విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే?

      తొలగించండి
    5. శ్రీకాంత్ చారి గారూ,
      వాదనలు మొదలయ్యాక ఆ వేడిలో చాలా మాటలు వస్తాయి. వాటి అధారంగా వాదనలు పెంచటం నిరుపయోగం. దేశావసరాలు నిరంతరాయంగా మారుతూనే ఉంటాయి. భారతదేశం తొలిబడ్జెట్ ఐదువేల కోట్లు అనుకుంటాను. దాని ఆధారంగా ఇంతత బడ్జెట్లు అనవసరం అని ఇప్పుడు వాదించలేము కదా. ఒకప్పుడు చాలా ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా విద్యుత్తుకోసమే అని మొదలుపెట్టినా వాటి ప్రయోజనాలను తరువాత విస్తరించటం జరిగిందని అంటున్నారు కదా. ఒకప్పుడు ఇందుకే అన్నారని పిడివాదం నిరుపయోగం అని నా ఉద్దేశం. అప్పటికి ఉన్న యోచన అది. క్రమంగా రాష్ట్రావసరాలకోసం ప్రయోజన విస్తరణ జరిగితే దానిలో దురుద్దేశాలు చూడటం సరికాదనుకుంటాను. ఎవరి ప్రయోజనాల దృష్ట్యానే వారు సర్వవిషయాలనూ పునఃపరిశీలన చేయటం అంత ఉచితం కాదు. ఇలాంతి హ్రస్వదృష్టి అంతిమంగా కొట్లాటలకు ఇంధనంగా పనికొస్తుందే కాని సహజీవనానికి మాత్రం తీరని నష్టం చేస్తుంది. నేను ఏ పాంతాన్నీ‌ తప్పు పట్టే ఉద్దేశంతో చెప్పటం లేదు. ఎవరికైనా అలా తోస్తే వారికో వినయపూర్వకవందనం.

      తొలగించండి
    6. శ్యామలీయం గారు,

      దేశ పార్లమెంటు పాస్ చేసిన విభజన బిల్లు భగవద్గీతా అని అడిగినప్పుడు, గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO నం 107 భగవద్గీతా అని అడిగానండీ. అంతే.

      తొలగించండి
    7. ధన్యవాదాలు శ్రీకాంత్ చారిగారూ. ఏదీ దైవానుశాశనమూ కాదు, శాశ్వతమూ‌ కాదు, అన్నీ‌ కాలంతో‌పాటే‌ మారతాయి. బలవంతంగా మార్చాలని చూడటమూ‌ లేదా బలంవతంగా మార్పుని అపాలని చూడటమూ మనుష్యులు తమతమ అవగాహనలూ, అవసరాల మేరకు చేసే ప్రయత్నాలే ఐనా ఇది మారితీరాలని కాని మారటానికి వీలు లేదని కాని అనేవారి మాటలు వారివారి కోణాల్లోంచి మాత్రమే సహేతుకాలయ్యే అవకాశమే హెచ్చు. అంతిమంగా కాలమే శాసనకర్త,

      ముందటి వ్యాఖ్యలో‌ నేను చెప్పినది వాదం కోసం విసురుకునే మాటలు వాదానికి పుష్టి చేకూర్చటం‌ కన్నా ఉద్రేకాలను పెంచటానికే పనికివచ్చే అవకాశమే ఎక్కువ అని చెప్పటానికే. విజ్ఞులు అటువంటి మాటలను ప్రక్కన బెట్టి విషయం మీదే దృష్టిపెట్టి ఆలోచించాలి. చిలిపి వాదాలూ, వాటికి జవానులు అనవసరాలు.

      తొలగించండి
    8. జీవో 170 వచ్చిన కొద్ది నెలలకే మురిగిపోయింది. గరిష్ట పరిమితిని తిరిగి 834 చేస్తూ ప్రభుత్వం జీవో 233 జారీ చేసింది.

      సదరు జీవో గీతాయో కాదో వదిలేస్తే చెల్లదు అని మాత్రం వాస్తవం. జీవో రద్దు చేసేదాక గొడవ పెట్టిన దేవినేని ఉమా గారికి ఈ విషయం గుర్తు రాకపోవడం విశేషమే.

      ఏది సమంజసమో కాదో ఒకానొక ముక్కూ మొహం తెలియని మహిళను అడగాలా భేష్! మా దగ్గర లేరా ఆమాత్రం మనుషులు? చట్టం నచ్చకపోతే కోర్టుకు వెళ్ళాలి కానీ ధిక్కరిస్తే ఎలా?

      తొలగించండి

  5. మొదట శ్రీశైలం ప్రాజెక్టును విద్యుత్ ప్రాజెక్టు గానే నిర్మించారు.తర్వాత కొన్నాళ్ళకు రాయలసీమ,దక్షిణతెలంగాణావ్యవసాయావసరాలకోసం నీటి పారుదల ప్రాజెక్టులుకికొంతమార్చి వాడుకొంటున్నారు.సాగునీరు,విద్యుత్తు రెండూ అవసరమే.రెండు రాష్ట్రాలమధ్య తగవులకోసమే నదీ బోర్డుల్ని ఏర్పాటు చేసారు.అందువల్ల చర్చలద్వారా,కాకపోతే బోర్డు సలహా లేక తీర్పునీఅమోదించి సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. >>> కొన్నాళ్ళకు రాయలసీమ,దక్షిణతెలంగాణావ్యవసాయావసరాలకోసం

      ప్రాజెక్టు ప్రారంభించి 30 Yఎళ్ళైనా తెలంగాణా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. అదే రాయలసీమకు మాత్రం తామర తంపరగా ప్రాజెక్టులు పెరిగిపోయాయి. ఈ సీజన్లోనే శ్రీశైలం నుండి రాయలసిమకు 90 TMC తరలించారు. తెలంగాణా ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా చుక్క నీరు లభించలేదు. చేసిందంతా చేసి ఇప్పుడు మూల ఉద్దేశమైన కరెంటును కూడా ఉత్పత్తి చేసుకోవద్దంటే అది న్యాయమెలా అవుతుంది?

      ఆంధ్ర డైరెక్టుగా సాగునీరును వాడుకుంటే తెలంగాణ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ కరెంటు ద్వారా సాగునీటిని పంప్ చేసుకుంటుంది. ఏ విధంగా చేసినా చివరికి జరిగేది పొలాలకు నీరు అందించడమే. ఇరువురి వాటాకు రావలసిన నీళ్ళని మేమే సాగునీటికి వాడుకుంటాం, మీరు మాత్రం ఏ విధంగానూ ఉపయోగించుకోకూడదు అన్నట్టుంది వరస!

      తొలగించండి
  6. ఆధారాలు చూపే సరికి వాదన ఇలా మారిందన్న మాట!
    >> మీతో చర్చిస్తున్నాను అని నేను అనుకున్నాను. నేను వాదిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. నాకు మీతో వాదించే తీరిక లేదు. తార్కికంగా నేను మీకొక విషయం చెప్పేసరికి మీ వాదన ఇలా మారిందన్న మాట అంటూ చర్చ పొడిగించే వుద్దేశ్యం కూడా లేదు.

    సీమాంధ్రకు ఇప్పటివరకు రెండు ముద్దలు పెడితే తెలంగాణాకు ఆరు ముద్దలు పెట్టారు. నువ్వు ఇప్పటివరకు రెండు ముద్దలతో బ్రతకగలిగావు కాబట్టి నీకు రెండు ముద్దలే అనడం సమంజసమా?
    >> మీకు పై విషయంలో అన్నీ సవ్యంగానే కనపడుతున్నాయా? కరంటు మాత్రం ఇంతకు ముందు వాడకం ప్రాతిపదికన విభజించారు. మిగతావి జనాభా ప్రాతిపదికన విభజించారు. ఇది మీకు కరక్టు అనిపిస్తోందా?

    కరంటు కష్టాలు వుంటాయి అని కిరణ్ కుమార్ రెడ్డిగారు చెప్పలేదా? అప్పుడు 'మాకు బోల్డు సహజ వనరులున్నాయి ' అన్న కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రోల్ల మీద పడి యెందుకు యేడుస్తున్నాడు?

    ఒకప్పుడు చాలా ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా విద్యుత్తుకోసమే అని మొదలుపెట్టినా వాటి ప్రయోజనాలను తరువాత విస్తరించటం జరిగిందని అంటున్నారు కదా
    >> నేను ఈ పాయింటు చెప్పబోయాను కానీ మళ్ళీ 'యెవరి ప్రయోజనాల కోసం ' అంటూ రెట్టిస్తారు.

    సరె, విభజన బిల్లు ప్రకారమే మాట్లాడదాం! పోలవరం ముంపు మండలాలు సీమాంధ్రలో కలుస్తాయి అని బిల్లులో వుంది కదా? మరి తెలంగాణా యేర్పడడానికి ఒక రోజు ముందు ఈ విషయంలో నిరసన తెలుపుతూ తెరాస ప్రభుత్వం బందుకు పిలుపునివ్వలేదా? అప్పుదు అక్కరకు రాని బిల్లు ఇప్పుడు అవసరం వొచ్చిందా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చర్చ అన్నాక విషయానికి కట్టుబడటమూ, పరస్పరమూ గౌరవపూర్వకంగా వ్యవహరించటమూ అనే రెండు విషయాలూ అతిముఖ్యమైన నిబంధనలుగా భావించండి దయచేసి, మీరు లేవనెత్తిన కొన్ని పాయింట్లు ఆలోచనీయం. "ఆంధ్రోల్ల మీద పడి యెందుకు యేడుస్తున్నాడు?" వంటి సభాయోగ్యంకాని భాషణలు వద్దు. ఒకవేళ వేరేవారు అలా చేస్తున్నారన్నా మీరూ అదే భాషకు దిగటానికి అదొక సాకుగా, హక్కుగా వాడకూడదు. అలాగైతే, చర్చ అల్లా వీధిపోరాటం అవుతుంది. అలా ఎవ్వరికీ సమ్మతం కాదు కదా.

      తొలగించండి
    2. "కరంటు కష్టాలు వుంటాయి అని కిరణ్ కుమార్ రెడ్డిగారు చెప్పలేదా?"

      కష్టాలు తెలుసు అవి సమ్మతమే. చట్టబద్దమయిన వాటా ఇమ్మని నిలదేసే హక్కు ఎడ్వడంతో సమానం కాదు.

      "తెలంగాణా యేర్పడడానికి ఒక రోజు ముందు ఈ విషయంలో నిరసన తెలుపుతూ తెరాస ప్రభుత్వం బందుకు పిలుపునివ్వలేదా?"

      బిల్లులో లేనివి (ముంపుకు గురి కానివి) ఆర్దినేన్సులో చేర్చారు. రెంటినీ మళ్ళీ చదవండి సార్

      తొలగించండి
    3. శ్యామలీయం మాస్టారూ! మీ సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తాను.

      జై గారు,
      బిల్లులో వున్నవే ఆర్డినెన్సు ద్వారా ఆమోదం పొందాలి అనేది అంతిమ నిర్ణయం కాదు కదా? బిల్లులకు సవరణలు వుంటాయి.

      విభజన బిల్లును సీమాంధ్రులు ఆపలేకపొయారు. పోలవరం ఆర్డినెన్సును తెలంగాణా వాళ్ళు ఆపలేకపోయారు. ఇందులో ఆక్షేపించడానికేముంది?

      ఏది సమంజసమో కాదో ఒకానొక ముక్కూ మొహం తెలియని మహిళను అడగాలా భేష్
      >> సమంజసమో కాదో చెప్పడానికి మనిషి ముక్కూ మొహం తెలియాల్సిన అవసరం లేదండీ.

      నేను ఒక చిన్న లాజికల్ ప్రశ్న వేశాను [ఇది ఆవిడ వేసిన ప్రశ్నే]: సీమాంధ్రకు ఇప్పటివరకు రెండు ముద్దలు పెడితే తెలంగాణాకు ఆరు ముద్దలు పెట్టారు. నువ్వు ఇప్పటివరకు రెండు ముద్దలతో బ్రతకగలిగావు కాబట్టి నీకు రెండు ముద్దలే అనడం సమంజసమా?

      'మేం జవాబు చెప్పలేం' అని అనండి వొప్పుకుంటాం కానీ "ఏది సమంజసమో కాదో ఒకానొక ముక్కూ మొహం తెలియని మహిళను అడగాలా" అని రాసారు. మీరు గమనించాల్సిన విషయం : మీ ముక్కూ మొహం మాకెవరికీ తెలీదు కదండీ. మీరు తీసిపారేసినట్టు జవాబివ్వడం బావుందంటారా?

      తొలగించండి
    4. సదరు మహిళకు సమాధానం ఇదిగో:

      తెలంగాణాలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడానికి కారణం రాష్ట్రంలో వ్యవసాయం సింహభాగం విద్యుత్ ఆధారితం కావడం. అందుకు ముఖ్య కారణం కాలువలో సింహభాగం ఆంధ్రకు ఇవ్వడం.

      ఆవిడ ఎవరో కానీ ఆమెకు అర్ధం అయ్యే భాషలో చెప్పాలంటే: "ఆంధ్రకు సాగునీటి విషయంలో పన్నెండు ముద్దలు పెడితే తెలంగాణకు రెండే పెట్టారు. ఇప్పుడు విద్యుత్ విషయంలో తెలంగాణకు నాలుగు ముద్దలు ఎక్కువ ఇచ్చినా హోలు మొత్తానికి తక్కువే జరిగింది"

      ఇంకా కావాలంటే నదుల పారివాహిక ప్రాంతంలో తద్వారా నీటి సేకరింపులో భూభాగాల వాటా వగైరా ముఖ్యమయిన సాంకేతిక అంశాలు చెబుతాను.

      నేను ఆవిడను తీసి పారేయలేదు. ఆవిడ వాదన స్థాయి బట్టే జవాబు ఇచ్చాను.

      తొలగించండి
    5. జైగారు,

      ఆ సదరు మహిళగారు, ఈ బ్లాగులో జరుగుతున్న యీ చర్చను చూస్తున్న దాఖలాలు లేవు కదా, మనం ఎందుకు ఆ విషయంపైనా వాదించుకోవటం? వదిలేద్ధాము.

      మీరు అవసరమైన సాంకేతికాంశాలతో ఒక తెలుగుటపాను మీ బ్లాగులో ఉంచగలరా? అది అందరికీ సదుపాయంగా ఉండవచ్చును.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.