మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
17
సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః
శ్రీశంకరులు చేస్తున్న వాగ్భవకూట ప్రశస్తికి సంబంధించిన శ్లోకాలు చదువుతున్నాం కదా. వాటిలో ఇది మూడవదీ చివరిదీ ఐన శ్లోకం.
జనని అన్న మాటకు అర్థం మనకు తెలుసు కదా, శంకరాచార్యులు అమ్మని జనని అని సంబోధిస్తూ ఇలా చెబుతున్నారు..
సవిత్రీభిః వాచామ్ అంటే వాక్కు అనేదానికి నీవే తల్లివి. సవిత్రి అంటే స్రవించేది అని వాచ్యార్థం. జన్మింపజేసేది అనే అర్థంలో ప్రసిధ్ధంగా వాడతారు. కాబట్టి తల్లి అని అర్థం. ఈ స్రవణము అనే ధాతువు నుండే ప్రసవము అనే పదమూ వచ్చింది. అంటే ఇక్కడ శ్రీశంకరులు అమ్మ శ్రీదేవియే వాక్కు అనే దానికి మూల కారణం ఐన తల్లి అని చెబుతున్నారు మనకి.
అలాగే అమ్మను శశిమణిశిలాభంగరుచిభిః అని కూడా సంబోధిస్తున్నారు. శశిమణి అంటే చంద్రకాంత శిల. ఈ చంద్రకాంత శిలల గురించి రెండు విశేషాలు. మొదటిది ఈ శిలలు వెన్నెలకాంతికి చెమ్మగిల్లుతాయి. రెండవది ఈ శిలలు అతి నిర్మలంగా మిక్కిలి తెల్లగా ఉంటాయి. ఇక్కడ రుచి అంటే వాటి కాంతిని గురించి చెబుతున్నారు కాబట్టి శ్రీశంకరులు అమ్మయొక్క శరీరవర్ణం ఎంత ధవళంగా ఉందీ అంటే చంద్రకాంత శిలల యొక్క ప్రకాశంలా ఉందీ అని చెబుతూ అభంగ రుచి అన్నారు కాబట్టి ఎక్కడా వంక బెట్టటానికి వీల్లేని స్వచ్చమైన తెలుపు అంటున్నారు. అర్థమైనది కదా.
వశిన్యాదాభ్యాః త్వాం సంచింతయతి యః అని చెబుతున్నారు రెండవపాదంలో. ఈ పాదానికి చాలా విస్తృతమైన వ్యాఖ్య అవసరం అవుతుంది. వివరాల్లోనికి తరువాత వెడదాం. ప్రస్తుతాని అర్థం చూదాం. వశిన్యాదులు అంటే వశిని మొదలైన దేవతలు. వీళ్ళు శ్రీచక్రదేవతలు. ఈ దేవతలతో సహా యః అంటే ఎవడైతే త్వాం అంటే నిన్ను సంచింతయతి అనగా చక్కగా ధ్యానిస్తున్నాడో, అని ప్రస్తావించి అటువంటి వాడికి కలిగే ఫలాన్ని చెప్పబోతున్నారు. శ్రీచక్రంలో అమ్మవారి పరివారదేవతలు వశినీ మొదలైనవారు. ఈ దేవతలు అమ్మవారిని పరివేష్టించి అంటే చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటారు. అలా వారితో కూడిన అమ్మను ధ్యానం చేయాలటం. వట్టి ధ్యానం కాదని చెప్పటానికే సంచింతనం అని చెప్పారు. ఇక్కడ సం అనే ఉపసర్గ ద్వారా చక్కగా చింతనం అనగా ధ్యానం సూచించారు. సరే చివరి రెండు పాదాల్లోనూ అటువంటి వాడికి సంబంధించిన అదృష్టాన్ని వర్ణిస్తున్నారు చూడండి.
వాగ్దేవి అంటే మనకు తెలుసు కదా. సరస్వతి అని. వాగ్దేవీ వదనకమలం అంటే పద్మం వలె ఉన్న సరస్వతీదేవి యొక్క ముఖము అని అర్థం. అముఖం యొక్క అమోదమధురైః అంటే అటువంటి తల్లి చిరునవ్వులు, దయాదృష్టి అనే వాటి యొక్క మధురమైన అనుభూతిని పొందటం జరిగి అదృష్టవంతుడవుతాడట. ఆ అదృష్టం కారణంగా అతడు ఏమి చేస్తున్నాడయ్యా అంటే
వచోభిః మహతాం భంగిరుచిభిః అంటే గొప్పగొప్ప కాళిదాసాది కవులవలే అనేకరకాల వైభవం కల వాక్కులు కలిగినవాడు అవుతున్నాడట. కాడా మరి? సరస్వతియే కదా చదువులన్నింటికీ తల్లి!
సరిసరి. అంత గొప్ప అదృష్టం పట్టిన వాడు ఊరికే ఉంటాడా? ఉండడు కదా! అందుచేత అటువంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే సః కావ్యానాం కర్తా భవతి అంటే వాడు కావ్యాలకు కర్త అవుతాడు. కావ్యకర్త అంటే కావ్యాలు వ్రాసిన వాడు అని వేరే చెప్పాలా. ఈ శ్లోకంలో వశిన్యాద్యాభిః అన్నది చాలా కీలకమైన పదప్రయోగం. దీన్ని గురించి వచ్చే టపాలో వ్రాస్తాను. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.