మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
11
చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదలకలాశ్రత్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః
ఈ శ్లోకం శ్రీచక్రవర్ణనాత్మకమైనది.
చతుర్భిః శ్రీకంఠైః అంటే నలుగురు శివుళ్ళు. శ్రీ అనగా విషము కంఠమునందు కలవాడు అనేది శ్రీకంఠుడు అనే బహువ్రీహి సమాసానికి అర్థం. కాబట్టి, శ్రీకంఠుడు అంటే శివుడు కదా.
ఆ వెంటనే శివయువతిభిః పంచభిః అపి అన్నారు. శివయువతి అనగా శివుడి భార్య. అమ్మవారు. పంచభిః అంటే వీళ్ళు ఐదుగురు అంటున్నారు. పైగా ఈ ఐదూ కూడా ప్రభిన్నాభిః శంభోః అని శివుని కంటె వేరుగా ఐదుగురు శివయువతులట.
మరి శివుడు ఒక్కడే కదా నలుగురు శివుళ్ళేమిటీ అని అనుమానం వస్తుంది అందరికీ. మళ్ళీ శివుడి భార్యలు ఐదుగురు కూడా అంటారేమీ అనీ అనుమానం వస్తుంది.
శ్రీచక్రం అంతర్భాగంలో ఇలా ఉంటుంది.
ఇందులో మధ్యన బిందువు ఉంది గమనించారా?
ఆ బిందువు చుట్టు అనేక త్రికోణాలు కనిపిస్తున్నాయి కదా?
బిందువుకు ఊర్ధ్వముఖంగా అంటే పైకి కోణం వచ్చేలా ఎన్ని త్రికోణాలున్నాయి? నాలుగు కదా. ఈ నాలుగూ శివకోణాలని చెబుతారు శ్రీవిద్యలో.
అలాగే అధోముఖంగా అంటే క్రిందికి కోణం వచ్చేలాఎన్ని త్రికోణాలున్నాయి? ఐదు కదా? ఈ ఐదింటినీ శక్తికోణాలని చెబుతారు శ్రీవిద్యలో .
ఈశ్లోకం మొదటిపాదంలో చెప్పిన శివుళ్ళూ, అమ్మవార్లూ ఈ నాలుగు + ఐదు = తొమ్మిది త్రికోణాల గురించి అన్నమాట. ఈ తొమ్మిదింటినీ గురించే ఈ శ్లోకంలో నవభిః అపి మూలప్రఋతిభిః అనగా ఈ తొమ్ముదీ మూలప్రకృతులు అని నిర్దేశించి చెబుతున్నారు.
కొంచెం ముందుకు వెడదాం
వసుదళమ్ అంటే అష్టదళములు అని అర్థం. వసువులు ఎనమండుగురు కదా. సంస్కృతభాషలో సంఖ్యలను చెప్పేటందుకు కొన్ని సాంకేతిక పధ్ధతులున్నాయి. వాటిలో ఒకటి కొన్ని పదాలను సంఖ్యలను సూచించటానికి వాడటం. అగ్నులు మూడు. అందు చేత అగ్ని శబ్ధం తో మూడంకెను చెబుతారు. పుష్పబాణాలని మన్మథుడి బాణాలు ఐదు. అందుకని బాణ శబ్దంతో ఐదంకెను చెబుతారు. ఇలా గన్నమాట. ఇక్కడ వసువులు అన్నారంటే, ఎనిమిది అన్న అంకెను చెప్పటానికి. ఈ వసు శబ్దం దళం అని (పువ్వు రేకు) అనే దానికి విశేషణంగా వేసారు కదా. దీనికి అర్థం ఎనిమిది రేకుల పూవు. అనగా అష్టదళపద్మం.
కళాశ్రమ్ అని ఇంకో మాట కనిపిస్తోంది చూడండి. ఇక్కడ కూడా కళ అంటే పదహారు అని అర్థం. కళాతు షోడశో భాగః అనీ, చంద్రుడి కళలు పదహారు అనీ చెబుతారు కదా. అందుచేత కళ అన్నది పదహారును సూచిస్తుంది. అశ్రం అంటే కోణం అని ఒక అర్థం అలాగే అంచు అనే అర్థం కూడా కనిపిస్తోంది. దీనిని బట్టి ఆచార్యులవారు పదహారంచుల పుష్పం అంటె షోడశదళపద్మం ఒకటి సూచిస్తున్నారు.
ఈ అష్టదళపద్మం షోడశదళపద్మం అంటే వీటిని శ్రీచక్రంలో ఎక్కడ ఉంటాయన్నది తెలుసుకోవాలి కదా. క్రింది పటం చూడండి.
ఈ పైన ఇచ్చినది శ్రీచక్రం. లోపల ఒక వృత్తం చుట్టూ ఎర్రటి రేకులతో ఒక పద్మాకారం కనిపిస్తోంది కదా. అదే అష్టదళ పద్మం. దాని రేకులు లెక్కించి చూడండి.
అలాగే ఆ అష్టదలపద్మం పైన తెల్లటి రేకులతో మరొక పద్మం కనిపిస్తుంది. దాని రేకులు కూడా లెక్కించుకొని చూడండి. అవి పదహారు రేకులు మొత్తం. అదే షోడశదళ పద్మం.
ఇంకొంచెం ముందుకు పోదాం.
ఈ శ్లోకంలో త్రివలయ అని మూడు వలయాలను ప్రస్తావించారు. అలాగే త్రిరేఖాభిః అని మూడు రేఖలనూ ప్రస్తావించారు. పైన ఉన్న శ్రీచక్రంలో తెల్లటి రంగులో చూపబడిన పదహారురేకుల పద్మం పైన మూడు వృత్తాలున్నాయి చూడండి. అవే ఈ శ్లోకంలో చెప్పబడిన త్రివలయాలు. అలాగే శ్రీచక్రానికి నాలుగుప్రక్కలా నాలుగు ద్వారాలు చూపబడ్డాయి కదా. అక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో మూడు దీర్ఘచతురస్రపు చుట్లు ఉన్నాయి కదా. అవే ఈ శ్లోకం చెబుతున్న త్రిరేఖలు.
శ్రీశంకరులు అమ్మతో అంటున్నారూ, తవాశ్రయ శరనకోణాః చతుశ్చత్వారింశత్ పరిణతాః సార్థం అని. అంటే, అమ్మా, తవ అంటే నీయొక్క శరణకోణాః అంటే ఆశ్రయ స్థానమైన శ్రీచక్రాకృతిలో ఉన్న కోణములు చతుశ్చత్వారింశత్ అంటే నలభైనాలుగు సార్థం పరిణతా అనగా చక్కగా వికసించి ఉన్నాయి అని. చత్వారి అంటే నలభై. దాని ముందు చతుః అని చేర్చితే నాలుగు + నలభై = నలభైనాలుగు. ఇలా చెప్పటం సంస్కృతంలో అంకెలు చెప్పే విధానం.
నలభైనాలుగు కోణాలు అంటే ఏమిటీ అన్నది తెలుసుకోవాలి కదా? లెక్క వేద్దాం. బిందువు మొదటిది. అది ఒక త్రికోణంలోఉంది కదా. దానిని కూడితే సంఖ్య రెండు. ఆ త్రికోణాన్ని ఆనుకుని ఎనిమిది త్రికోణాలున్నాయి కదా. వాటిని కూడితే మన సంఖ్య పది. ఈ ఎనిమిది త్రికోణాలచట్రాన్ని ఆనుకుని ఉన్న త్రికోణాల చట్రం మరొకటి ఉంది కదా. ఆ చట్రంలో పది త్రికోణాలున్నాయి. ఇప్పుడు కూడిక మొత్తం ఇరవై. ఈ పది త్రికోణాల చట్రాన్ని ఆనుకొని మరొక పది త్రికోణాలున్న చట్రం ఉంది గమనించండి. ఇప్పుడు వీటిని కూడా కూడితే మొత్తం ముఫై. అన్నింటికన్నా పైన ఉన్న త్రికోణాల చట్రంలో పద్నాలుగు త్రికోణాలున్నాయి. వీటినికూడా కూడితే మొత్తం నలభైనాలుగు. ఇదీ మొత్తం కోణాలను లెక్కించే విధానం. బిందువును కూడా లెక్కించటం సంప్రదాయం ఇక్కడ.
ఈశ్లోకానికి నిత్యం వేయి సార్లు చొప్పున ఎనభైఒక్క రోజులు పారాయణం. బెల్లపు పరమాన్నం నైవేద్యం. ఫలితం సత్సంతానప్రాప్తి. |
నిన్న ఉదయం నుంచి రాత్రి తొమ్మిది దాకా టపా రాలేదని చూసి నిద్ర పోయాను. నిజం గానే మీతో ఇది చెప్పిస్తూ చాలా కష్టానికి గురిచేశాను, మన్నించండి. ఇంత కష్టం ఉందని అనుకోలేదు.
రిప్లయితొలగించండిమిత్రులు శర్మగారు,
రిప్లయితొలగించండినిజానికి అర్థంపర్థం లేని కారణాలవలన ఈ టపాను వ్రాయటంలో తీవ్రమైన జాప్యం జరిగింది. అందుకు క్షంతవ్యుడను. ఐతే, మొత్తం నూఱుశ్లోకాలకూ వ్యాఖ్యను ప్రకటించటం అత్యంతముఖ్యాంశంగా పరిగణిస్తున్నాను.
ఇలా లఘువ్యాఖ్యను వ్రాస్తున్నాను కాని నేనందుకు అర్హుణ్ణా అన్న అనుమానం వలన కొంత జాప్యం జరుగుతున్నదేమో తెలియదు. శ్రీవిద్య అత్యంత నిగూఢమైన రహస్యాలతో నిండిని ఒక గొప్ప శాస్త్రం. హెచ్చుభాగం విషయాలు గురుముఖతః నేర్చుకోవలసినవే కాని వ్రాయటమూ కష్టమే, అర్థం చేసుకోవటమూ కష్టమే. అధికారులు చేయవలసిన పనిలో వ్రేలు పెట్టటం లేదు కదా అని సమీక్షించుకొని చాలా జాగ్రత్తగా వ్రాస్తున్నాను.
మీరు నాకు కలిగిస్తున్న కష్టం ఏమీ లేదండి. నా అంత బధ్ధకస్తుడి చేత ప్రోత్సహించి వ్రాయిస్తున్నారు. అంతా అమ్మ సంకల్పం అని భావించి వ్రాస్తున్నాను.
క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే.
అర్హత ఉన్నది కనకే మొదలుపెట్టేరు, అమ్మ ఆ ఆలోచన తెచ్చింది. మొదలుపెట్టిన తరవాత కొనసాగించడమే, అదే అమ్మ ఆన.
తొలగించండి