27, మార్చి 2013, బుధవారం

శ్రీకర నిన్ను గొల్చుటకు

శ్రీకర నిన్ను గొల్చుటకు చిత్తము సుస్థిరశాంతియుక్తమై
లేకునికిం పురాకృతము లీలగ నిట్టటు త్రోయుచుండగా
శోకనిమగ్నబుధ్ధినయి సొక్కుచు లోకపు పాడునూతిలో
భేకము రీతి నుంటి రఘువీర కృపాకర కావరావయా


(వ్రాసిన తేదీ: 2013-1-24)

10 కామెంట్‌లు:

  1. సలహా ఉచితం కదండీ! ఒక మకుటం తో శతకానికి ప్రయత్నం చేయవినతి.
    పద్యం బాగుంది, మరి రాముడెప్పుడొస్తాడో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారూ, 1983లోనే ముకుందా అని మకుటం పెట్టి ఒక శతకం దాదాపుగా 90 పద్యాలవరకూ వ్రాసానండీ. వీలు వెంబడి ప్రకటిస్తాను.

      తొలగించండి
    2. ఇరవై సంవత్సరాలైనా రాలేదాండీ ?

      అబ్బ రావణుడే బెటరు మనకన్నా! అమ్మవారిని కట్టేసి తీసుకొచ్చి, ఒక్క సంవత్సరం లో నే రాముణ్ణి తన దగ్గిరకు రప్పించేసు కునేడు సుమీ !

      (జేకే!)

      జిలేబి.

      తొలగించండి
    3. ఇది శతకం కాదు అని మొదలెట్టినప్పుడే చెప్పారుగా? శతకం అని మొదలు పెడితే వందో నూట ఎనిమిదో ఎప్పుడౌతాయా అనే చింత మొదలౌతుంది. అంచేత భక్తిపూరకంగా ఇలాగే ఎన్ని వస్తే అన్నిరాయడం మంచిది. పద్యం కాదు ఇంపార్టంటు, ఆయన మనసులో మెదిలే భావం మాత్రమే. ఇది నేను అనుకుంటున్న రెండు దమ్మిడీల సలహా. శ్యామలీయం గారు మీరు ఈ సలహా వినక్కరలేదు ఎందుకంటే మీరు నన్ను అడగలేదు కదా :-)

      ఇంకొక్క విషయం. ఈ పద్యాలు బాగున్నాయీ అంటే శ్యామలీయం గారి గొప్ప ఏమీ లేదు ఇందులో. ఆ నల్లని వాడు పలికిస్తున్నాడు అని అనుకుంటే పద్యాలు అవే వస్తాయి. పోతన అంతటి వాడే చెప్పుకున్నాడు కదా. ఎంత ప్రతిభ ఉన్నా కుదురుగా కూర్చుని దశాబ్దాలు శాశ్వతంగా నిల్చిపోయే 'సిరికిం జెప్పడు.." లాంటి ఒకే ఒక పద్యం రాయండి చూద్దాం? అలా కాకుండా అంతా ఆయన దయే అనుకుంటే దశాబ్దం ఏమి ఖర్మ, ఈ భూమి ఉన్నంతకాలం నిల్చిపోయే పద్యాలు అవే వస్తాయి. శ్యామలీయం గారూ ఇలా అన్నానని ఏమీ అనుకోకండే? :-) మీ ప్రయత్నం తక్కువ చేసి మాట్లాడట్లేదు సుమా...

      శర్మగారూ, ఇలా పద్యాలు రాస్తూ ఉంటే రాముడు తప్పకుండా వస్తాడు. ఎప్పుడొస్తాడో అని చూస్తూ కూర్చుంటే మరి రాడు. చూసుకోండి. :-)ఆఖరికి తులసీ దాసుకి కూడా లీలగా ఒక్క క్షణం కనిపించి మాయమై పోయేడుట ఆయన మొహాన బొట్టుపేట్టేలోపుల. కాశీలో తులసీ దాసు ఒక పాండా లాగ కూర్చుంటూ మనసు రాముడు మీద పెట్టి వచ్చే మనుషుల్ని మొహం చూడకుండా బొట్టు పెట్టేవాడుట. ఓ రోజు ఆజానుబాహువు ఆయన తమ్ముడూ విచ్చేసారు. ఈయన పరధ్యానంగా బొట్టుపెట్టి 'ఈ చేతులు మోకాళ్ళవరకూ ఉన్నాయే' అని పైకి చూసేలోపుల మాయం అయిపోయేట్ట. ఆయన ఏడిపించి ఏడిపించి ఆఖరికి ఒడిలోకి తీసుకుంటాడు మరి. పిల్లాడు ఎంత ఎక్కువ ఏడిస్తే తల్లి అంత త్వరగా ఎత్తుకోదూ? అదే ఆయన టెక్నిక్కూనూ.

      తొలగించండి
    4. జిలేబీ గారు
      83-93 = 10
      93-2003 = 10
      2003 - 13 = 10

      ఆ మాత్రం లెక్కలు రాకపోతే ఎలా? :-)

      రావణుడు అమ్మవార్ని ఏడాది ఉంచుకున్నాడా? నేను చదివిన లెక్క వేరుగా అనిపిస్తోంది సుమండీ. అయినా మనకీ రావణుడీ పోలికా? ఆయన ఒక్క ఎగురు ఎగిరి అమ్మవార్ని తెచ్చేసుకుని ఆ తర్వాత కాలుమీద కాలు వేసుకుని రాముడ్ని తన దగ్గిరకి రప్పించుకున్నాడు. మనమో? ఆయన పెట్టిన జిలేబీలు తినేస్తూ సుఖంగా నిద్దరోతూ 83 నుంచి 2013 దాకా ఎన్నేళ్ళో లెక్క పెట్టలేకపోతున్నాం. హ్మ్

      ఇది వింతల్లో వింతకాదూ?

      తొలగించండి
    5. వామ్మో, వామ్మో,

      పోతే పోనీ అని ఓ పది 'సంవాట్' 'శరాలు' వదిలి పెడితే శ్యామలీయం వారి 'మేథ' మే ట్రిక్కు చూపించి భళీ శ్యామలీ రామా అని పించేరు !

      ఇక అమ్మవారి విషయం - ఒక్క సంవత్సరమే అనుకుంటా ! పదమూడు ఏండ్ల ఆఖరులో అని చదివినట్టు గుర్తు ! డీ జీ గారో, లేక కష్టే ఫలే వారో మరి దీనికి లెక్కలు చెప్పాలి !

      నెనర్లు
      జిలేబి.

      తొలగించండి
  2. అయ్యా .. నమస్కారం .. తెలుగు భాష అందం పద్యాలలో ఎక్కువ కనబడుతుంది. . పాహి రామ ప్రభో అని మీరు చేస్తున్న యజ్ఞం ద్వారా ధన్యులు మీరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మా రుక్మిణీదేవిగారూ, నమస్కారపూర్వకంగా సుస్వాగతం. మీరు దయతో చేసిన వ్యాఖ్యకు కృతజ్ఞుడను.
      మందః కవియశః ప్రార్థీ అన్నట్లు నా కవిత్వ శక్తి స్వల్పాతిస్వల్పమే అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నానండి.

      తొలగించండి
  3. vere makutam emduku, paahi raama prabhO nE makutam ga petti raayamdi. mee padyaalu chaalaa baagunnaayi.

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం వారు,
    జనవాక్యంతు కర్తవ్యం, ఫ్రెంచ్ లో vox populi, vox die ఎవరూ చదవటం లేదన్నారు చూడండి ఎంతమంది చదువుతున్నారో, మిమ్మల్ని వెనకేసుకొస్తున్నారో, ఇకపై నల్లనయ్యదే మాట

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.