28, మార్చి 2023, మంగళవారం

నారాయణా శ్రీమన్నారాయణా

నారాయణా శ్రీమన్నారాయణా నీవు నారామచంద్రుడవు నారాయణా


సురలకును మునులకును నారాయణా నీవు పరమాప్తుడవు గదా నారాయణా

తరణికులతిలకుడవై నారాయణా నీవు ధరమీద వెలసితివి నారాయణా

నరుడవై వచ్చితివి నారాయణా చాపధరుడవై నిలచితివి నారాయణా

గరువంపు రక్కసుల నారాయణా నీవు గడుసుగా కొట్టితివి నారాయణా


మునియాగ రక్షణకు నారాయణా నీవు పనిగొని తరలితివి నారాయణా

వనములో తాటకను నారాయణా ఒక్క బాణమున కూల్చితివి నారాయణా

అనలసాయకంబున నారాయణా సుబాహుని కాల్చితివి నీవు నారాయణా

వనధిలో మారీచు నారాయణా గాలిబాణముతో వైచితివి నారాయణా


వనవాస మనుపేర నారాయణా నీవు వనములను జొచ్చితివి నారాయణా

చెనకు ఖరదూషణుల నారాయణా నీవు చిచ్చై దహియించితివి నారాయణా

నిను మోసగించగ నారాయణా రావణుని దుంపతెంచితివి నారాయణా

నిను చేరి నుతించిరి నారాయణా కడు ఘనముగ బ్రహ్మాదులు నారాయణా 


పదివేలేండ్లును నారాయణా ఆపైవేయేండ్లును నారాయణా

ముదమున భువినేలి నారాయణా నిజపదమును గైకొన్న నారాయణా

హృదయేశుడవై నారాయణా నన్నేలుచు చెన్నొందు నారాయణా

వదలకు నాచేయి నారాయణా నీవాడనురా స్వామి నారాయణా