3, మార్చి 2023, శుక్రవారం

ఎంతవాడో యీరాము డంతటిదే మాసీత

ఎంతవాడో యీరాము డంతటిదే మాసీత
ఇంతకన్న దొడ్డజంట యిలలో కల్ల

ఎంతటి యందగాడో యీరామచంద్రుడు
అంతటి యందగత్తె యవనిజాత
ఎంత గుణవంతుడో యీరామచంద్రుడు
అంత సౌశీల్యవతి యవనిజాత
 
ఎంత గంభీరుడో యీరామచంద్రుడు
అంత యుచితజ్ఞయు నవనిజాత
ఎంత ధర్మజ్ఞుడో యీరామచంద్రుడు
అంతటి ధర్మజ్ఞయు నవనిజాత
 
ఎట్లు యజ్ఞసంభవుడో యీరామచంద్రుడు
అట్లే యజ్ఞసంభూత యవనిజాత
ఎట్లు శివుని విల్లెత్తె నీరామచంద్రుడు
అట్లే మున్నెత్తె దాని నవని జాత  

2 కామెంట్‌లు:

  1. మున్నెత్తె దాని...
    అన్నారే... అసలు
    బంతికై శివధనస్సు ఉన్న పెట్టెను సీతదేవి నెట్టినట్లు మూల రామాయణంలో ఉందా అండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివధనస్సు ఉన్న పెట్టెను సీతదేవి నెట్టినట్లు మూల రామాయణంలో లేదండీ. అవాల్మీకమైనదే, ఎవరో పూర్వకవికృతమైన కల్పనయే. ఐతే నేమి? ఔచిత్యభంగం లేనంతవరకూ కల్పనకు అవకాశం తప్పకుండా ఉంటుందండీ. (కథయొక్క లేదా ఏవైనా పాత్రలయొక్క స్వభావాన్ని తప్పుగా చూపే కల్పనలు ఉచితం కావండీ - అటువంటివి పూర్వకవికృతములే ఐనా జనాదరణ పొందినవే ఐనాను) ఇక్కడ స్వీకరించిన ఈ అందమైన కల్పన సీత యొక్క ఔన్నత్యాన్ని పెంచేదే‌కాని కథను ప్రభావింతం చేసేదీ కాదు, రాముడిని చులకన చేసేదీ‌ కాదు కాబట్టి స్వీకరించదగినదే అని భావించాను. అసలు కల్పన అన్నదే కూడదు అంటే కవి ఒట్టి ఎత్తిపోతలరాయడు అవుతాడు కదా!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.