10, ఆగస్టు 2019, శనివారం

బాధ లెందుకు కలుగుచున్నవో బోధపడుట లేదు బోధ కలిగెనా ఎవ్వనికైనా బాధలు కలుగవయా


బాధ లెందుకు కలుగుచున్నవో బోధపడుట లేదు
బోధ కలిగెనా ఎవ్వనికైనా బాధలు కలుగవయా

రామనామ ధనముండగ నయ్యో రాళ్ళురప్ప లేరి
పామరత్వమున పోగులు పెట్టుచు పరవశించ నేల
ఈమహి నెవ్వరి వెంటనైన నివి యెన్నడేగె నయ్యా
యీమాత్రము నీ వెఱుగ కున్నచో నెందుకు నరజన్మ

ఎవరెవరో నీ బంధుమిత్రులని యెంతో ప్రేముడితో
అవనిని వారికి సుఖమును గూర్చగ నలమటింతు వయ్యో
ఎవరి కెవ్వరీ మహిని జీవుడా యెంత కాల మయ్యా
చివరకు నీకు మిత్రుడు చుట్టము సీతాపతి కాదా

బావించుచు శ్రీరామతత్త్వము పాడుచు నీవుండ
నీ వెందున్నను నీ వెటులున్నను నీతో నత డుండ
దేవుడె దిక్కని నమ్మిన నీకిక దీనత యెక్కడిది
ధీవరుడా నీ స్వస్వరూపమున దీపింతువు కాదా


1 వ్యాఖ్య:

  1. ఒకరు ఇక్కడ మెసేజ్ ఇచ్చారు. దానిని వారి విజ్ఞప్తి మేరకే ప్రచురించటం లేదు. వారి మెసేజ్ ఇచ్చినది నేను లోగడ ECIL సంస్థలో పని చేసిన తాడిగడప శ్యామలరావునే కదా అని తెలుసుకుందుకు. వారి ఆసక్తికి ధన్యవాదాలతో 'అవును' అని తెలియజేస్తున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.