23, ఆగస్టు 2019, శుక్రవారం

దొఱకునో దొఱకదో మరల నరజన్మము


దొఱకునో దొఱకదో మరల నరజన్మము
దొఱకినను దొఱకునా హరిచరణ స్మరణము

కల్లగురువుల బోధ లెల్ల గడచి వచ్చి
చల్లగ నుంటి నీ చరణములు చేరి
యెల్లి యే గురుబోధ లేరీతి మలచునో
నల్లనయ్య యింక నాకు నీవే దిక్కు

కపట భక్తుల తోడ కలసి నడచి విసివి
అపరాధ మెఱిగి నిన్నాశ్రయించితిని
విపరీతబుధ్ధులే వెండి తలలెత్తునో
నృపశేఖర రామ నాకు నీవే దిక్కు

ఎన్ని జన్మము లెత్తి యిటు నిన్ను బడసితి
అన్నన్న నాకు నీవున్న నిశ్చింత
ఎన్నటికి నీవాడ నగునట్లు బ్రోవవే
నన్నేలు రాముడా నాకు నీవే దిక్కు

8 కామెంట్‌లు:

 1. చిన్న సందేహం సార్.

  "ఱ", "ర" లలో ఏది ఎప్పుడు వాడాలి?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది చాలా గందరగోళం విషయమే నండీ. బహుకాలం నుండీ మనవాళ్ళు కలగాపులగం చేసి వాడేస్తున్నారు కవిత్వంలో కూడా. పోతన్నగారు ర--ఱ లను సంకరం చేసి వాడారని అప్పకవి ఆక్షేపణ అంటే ఇది పెద్దలకే చిక్కుముడి వ్యవహారం అనే కదా. నేనేదో అలవాటుగా వాడుతున్నాను కానీ నేనూ పొరపాట్లు చేస్తూ ఉండవచ్చును! కొంచెం సమగ్రంగా వీలైతే సమాచారం ఒక టపాగా ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. కాని ఎవ్వరూ చదవని విషయాల్లో అదీ చేరటం ఖాయం. ఐనా వ్రాయాలనే అనుకుంటున్నాను.

   అన్నట్లు, మీరు రామకీర్తనలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవ్వరు చదివినా నాకు అనందమే.

   తొలగించండి
  2. Thank you sir.

   చిన్నప్పుడు మా స్కూలులో తెలుగు టీచర్ "గుఱ్ఱం" అక్షరంలో తప్ప ఇంకెక్కడా "ఱ" వాడరని అని నేర్పించారు. ఇది ఎంత కరెక్టో కాదో తెలీదు కానీ ఈ రోజులలో అందరూ "గుర్రం" అనే రాస్తున్నారు.

   నాకు ఆధ్యాత్మిక విషయాలు పెద్దగా అర్ధం కావు. అప్పుడప్పుడు చదువుతాను, ఈసారి "ఱ" హైలైట్ అయేసరికి పాత కుతూహలం మళ్ళీ తలెత్తింది.

   తొలగించండి
  3. జై గారు,
   ఈ రోజుల్లో శకటరేఫం నాలాంటి చాదస్తులకే పరిమితం ఐపోయింది. 'గుర్రం' అని కాదు 'గుఱ్ఱం' అనే వ్రాయాలి. అంతే కాదు నిజానికి తెలుగులో 'ర్ర' అన్నది ఎప్పుడూ వాడకూడదు అది 'ఱ్ఱ' అనే వ్రాయాలి కాని ఏంచేస్తాం అసలు 'ఱ' దిక్కులేనిదై పోయింది.

   తొలగించండి
  4. "కఱ్ఱ" అని రాయాలా ఐతే? "కర్ర" కాదా?

   తొలగించండి
  5. "కఱ్ఱ" అని రాయాలా ఐతే? "కర్ర" కాదా?
   అవునండి.

   తొలగించండి
  6. "మాస్టారు ఎలా రాసినా ఫరవాలేదు కాని దాంతో మనల్ని బాదకుండా ఉంటే అదే పదివేలు" అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో!

   తొలగించండి
 2. కల్లగురువుల బోధ లెల్ల గడచి....

  Very nice

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.