27, ఆగస్టు 2019, మంగళవారం

ఏం జరిగింది? - 1

కాలింగ్ బెల్ మోగగానే సువర్ణ ఉలిక్కిపడింది.
ఇంకా భాస్కర్ వచ్చే సమయం కాలేదు మరి.

తాము ఈ యింట్లో దిగి ఆట్టే రోజులు కాలేదు. తమ యింటి కాలింగ్ బెల్ కొట్టే వాళ్ళెవరుంటారు? అందునా ఇది గేటేడ్ కమ్యూనిటీ.  బిస్కట్లమ్మే వాళ్ళూ బూరాలమ్మే వాళ్ళూ ఎవరూ నేరుగా ఇంటి మీద పడి బెల్ కొట్టి పిలవటం వీలు కాదు. ఎవరన్నా,  ఇదివరకు ఈఫ్లాట్‍లో ఉండి వెళ్ళిన వాళ్ళ కోసం తెలియక వచ్చారేమో అనుకోవాలి.

మెల్లగా వెళ్ళి తలుపు తీసేలోగా బెల్ మరొక సారి మోగింది. కొంచెం విసుగు వచ్చినా చిరుకోపాన్ని మనస్సులోనే దాచుకొని నవ్వుముఖంతోనే తలుపుతీసింది.

ఎవరో అమ్మాయి. ఇంచుమించు తనవయస్సే ఉంటుంది. గుమ్మంలో నవ్వుముఖంతో నుంచుంది.

ఎంత దాచుకున్నా తన నిద్రముఖం దాగినట్లు లేదు. ఆ అమ్మాయి కొంచెం మొగమాటంగా చూస్తూ అంది. "సారీ అండీ, మిమ్మల్ని నిద్రలో డిస్టర్బ్ చేసినట్లున్నాను. నా పేరు శాంతి. ఈఫ్లాట్‍లో మొన్నటిదాకా ఉండే వాళ్ళం. చిన్న పనుండి వచ్చాను"

"అలాగా. రండి రండి." అని లోపలికి పిలిచింది.

ఆ అమ్మాయి సోఫాలో కూర్చుంటుండగా "కాఫీ తెస్తానుండండి" అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది.

ఇంతలో టీవీలో ప్రోగ్రాం మారి నట్లుంది. ఏదో సీరియల్ మొదలు. అదీ ఒక పాటతో , పెద్దరొదలాంటి సంగీతంతో మొదలయ్యింది.

నీ మొగుడే నా మొగుడూ
ఏ మంటావే పిల్లా
నీ మొగుడే నా మొగుడూ
ప్రేమకు నిలయం వాడే
ఏమంటావే పిల్లా

ఇద్దరు పెళ్ళాల మొగుడై ఎంకటేసుడూ లేడా
ఇద్దరికీ మురిపాలూ ముద్దులు పంచుతు లేడా
ఇద్దరు పెళ్ళాల మొగుడై ఈశ్వరుడూ లేడా
ఇద్దరికీ మురిపాలూ ముద్దులు పంచుతు లేడా

ఒద్దికగా మనముందామే ఒకడే మనమొగు డైతేనేం
ఒద్దిక ఉంటే సంసారంలో ఉంటుంది పిల్లా హాయి

నీ మొగుడే నా మొగుడూ
ఏమంటావే పిల్లా
ఏమంటావే పిల్లా
నువ్వేమంటావే పిల్లా

సువర్ణకు తిక్కతిక్కగా అనిపించింది. "దిక్కుమాలిన పాట, దిక్కుమాలిన పాట!"  అని తిట్టుకుంది. వచ్చిన అమ్మాయి మాత్రం తన్మయంగా టీవీ చూస్తోంది!

"మీరూ ముద్దుల మొగుడు సీరియల్ చూస్తుంటారా? వండర్‍ఫుల్" అంది.

సువర్ణకు చాలా ఇబ్బందిగా అనిపించింది. "సారీ అండీ. చూడను. సీరియల్స్ ఏవీ చూడను.  కాలక్షేపానికి టివీ పెడితే అన్ని చోట్లా ఏవేవో బోర్ ప్రోగ్రాంలే వస్తున్నాయి. ఏదో సినిమా వస్తుంటే కాసేపు చూసి విసుగొచ్చి జోగుతుంటే మీరొచ్చి రక్షించారు. ఆ సినిమా ఐపోయి సీరియల్ మొదలైనట్లుంది" అంది.

వచ్చిన అమ్మాయి అదేం పట్టించుకోకుండా "ఈ ఇల్లు వదిలేదాకా రోజూ మూడింటికి ఈ సీరియల్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసానండీ. ఇప్పుడు కుదరటం లేదు కాని" అంది.

సువర్ణకు ఆశ్చర్యం కలుగలేదు. తన తల్లీ అంతే, పెద్దక్కా అంతే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళింట్లో టివీని కబ్జా చేసి ఐనా సరే వాళ్ళ కిష్టమైన సీరియల్స్ చూస్తారు.  తానైతే టివీ చూడటమే తక్కువ.  అందుకే "నేను పెద్దగా టివీ ప్రోగ్రాంలు చూడనండీ." అంది.

శాంతి ఆ మాటలు విన్నదో లేదో కాని సీరియల్ చూడ్డంలో ములిగిపోయింది.

సువర్ణ  కాఫీ చేసి తీసుకొని వచ్చింది.

శాంతి సీరియల్ మీదనుండి దృష్టి మరల్చకుండానే కాఫీ తాగింది. ఆ తరువాత, "చాలా బాగుందండీ కాఫీ" అని మెచ్చుకుంది.

ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు. ఎంతసేపుంటుందో తెలియదు. సువర్ణ కూడా ఆవిషయం గురించి ప్రస్తావించటానికి మెగమోట పడి ఊరుకుంది.

ఇంతలో భాస్కర్ దగ్గరనుండి ఫోన్.

ఆ అమ్మాయి టీవీ చూస్తోంది కదా. కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడింది. ఇదే కాంప్లెక్సులో తమ దూరపు బంధువు లెవరో ఉన్నారట. ఆ అబ్బాయీ భాస్కర్‍తో పాటే పనిచేస్తున్నాడట. చెప్పటానికి పనికట్టుకొని ఫోన్ చేసాడు. భాస్కర్ ఫోన్ చేస్తే ఒక పట్టాన వదలడు.

ఫోన్ కాల్ ముగించి చూస్తే శాంతి టీవీ ముందు సోఫాలో లేదు.

అయోమయంగా అటూ ఇటూ చూస్తుంటే తమ బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చింది శాంతి. ఇల్లంతా తిరిగి చూస్తోందన్న మాట. చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమె తమ బెడ్ రూమ్ నుండి రావటం చూసి.

"మీ యిల్లు చాలా నైస్‍గా సద్దుకున్నారండీ. చాలా బాగుంది" అంది.

"థేంక్స్" అంది మరే మనాలో తోచక.

"ఇంత నీట్‍గా సద్దటం అంటే నావల్ల కాదు. కుమార్‍కి నీట్‍నెస్ పిచ్చి పాపం. ఈవిషయంలో చాలా గోల పెట్టేవాడు" అంది శాంతి.

ఆ అమ్మాయి చాల చొరవగా ఉంటుందని అర్థమై పోయింది. వచ్చింది ఎందుకో చెప్పలేదు కాని, ఒక గంటసేపు సువర్ణని కబుర్లతో ముంచెత్తింది. ఆశ్చర్యం ఏమిటంటే సువర్ణ కూడా మెల్లగా ఆమె ధోరణిలోకి వచ్చేసి కబుర్లు చెబుతూ ఉండిపోయింది ఆ గంట సేపూ.

హఠాత్తుగా ఆ అమ్మాయి వాచీ చూసుకుంటూ "చీకటి పడొస్తున్నదండీ వెళ్ళొస్తాను." అని, కొంచెంగా తటపటాయిస్తూ "మా మేరేజీ ఆల్బం ఒకటి కనబడ లేదు. ఒకవేళ ఇక్కడ మర్చిపోయానేమో అని వెదకటానికి వచ్చాను నిజానికి" అంది.

"ఇక్కడా?" అని సువర్ణ ఆశ్చర్యపోయింది.

"లాస్ట్ మార్చిలో మా ఆడపడుచూ వాళ్ళంతా వస్తే అది బయటకు తీసినట్లు గుర్తు."

"ఇక్కడెలా ఉంటుందీ, మాకు అంతా క్లీన్ చేసి ఇచ్చారు కదా ఫ్లాట్‍ని" అంది సువర్ణ.

శాంతి బెడ్ రూమ్ లోపలికి దారి తీసింది.

చేసేది లేక సువర్ణ కూడా యాంత్రికంగా ఆమె వెనుకే వెళ్ళింది.

బెడ్ రూమ్ లోపల కప్ బోర్డ్స్ వాల్ మౌంట్ చేసి ఉన్నాయి ఒక వైపు గోడంతా.

శాంతి కొంచెం మొగమాటంగా "ఇది తెరవచ్చా" అంది.

"తెరవచ్చును. కాని అందులో నా బట్టలు సద్దుకున్నాను ఇప్పటికే. అప్పుడు నాకేమీ కనిపించలేదే" అంది సువర్ణ.

"ఇందులో ఒక సీక్రెట్ అర ఉందండీ" అంటూ శాంతి కప్ బోర్డ్ తెరిచి ఆ అరను చూపి తెరిచింది.

సువర్ణ నోరు తెరిచింది.

అందులో భద్రంగా ఉంది ఆల్బం. అది తప్ప అక్కడ మరే వస్తువులూ లేవు.

అది తీసుకొని శాంతి వెళ్ళిపోయింది. కనీసం సువర్ణకు ఒక్కఫోటో ఐనా మర్యాదకు కూడా చూపించ లేదు. "అయ్యో లేటైపోయిందండీ. వెళ్ళొస్తాను" అంటూ బయలుదేరింది.

ఆమె వెళ్ళాక అరెరే ఒక జాకెట్ గుడ్ద ఐనా పెట్టి పంపాను కాదే అని అనుకుంది సువర్ణ. బుక్ షెల్ఫ్ నుండి ఒక యోగి ఆత్మకథ పుస్తకం తీసి బుక్‍మార్క్ దగ్గర నుండి చదవటం మొదలు పెట్టింది.

ఎంతసేపు గడిచిందో ఏమో కాని భాస్కర్‍ వచ్చి కాలింగ్‍బెల్ మోగించగానే మళ్ళా ఈలోకం లోనికి వచ్చింది.

రాత్రి భోజనాల సమయంలో భాస్కర్‍తో శాంతి వచ్చి వెళ్ళిన విషయం ప్రస్తావించింది. అన్నట్లు మన కప్‌బోర్డులో ఒక సీక్రెట్ అర ఉంది తెలుసునా అని శాంతి ఆ అరను తెరిచి ఆల్బం తీసుకొని వెళ్ళిన సంగతి చెప్పింది.

అవునా అని భాస్కర్‍ ఆశ్చర్యపోయాడు.

ఆ శాంతి నా కళ్ళముందే ఆల్బమ్‍ భద్రంగా ఉందా అని ఫోటోలు కొంచెం చెక్ చేసుకొని మరీ పట్టుకెళ్ళింది. కాని మాటవరసక్కూడా నాకు చూపిస్తానన లేదు అని వింతపడుతూ చెప్పింది.

కర్టెసీ కైనా ఆ అమ్మాయి తమ మారేజీ ఆల్బమ్‍ సువర్ణకు చూప లేదని విని మరింత ఆశ్చర్యపోయాడు.

రాత్రి పడుకొనే ముందు, భాస్కర్ ఆ సీక్రెట్ అర ఎక్కడుందో చూపించమని అడిగాడు. సువర్ణ తన చీరల అరలో చీరలను ప్రక్కకు జరిపి ఆ అరను చూపించి తెరచింది.

అక్కడే భద్రంగా ఉంది ఆ ఫోటో ఆల్బమ్!

ఇద్దరూ ఒకరి ముఖంలోనికి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు నోట మాటలేకుండా.


(సశేషం)