15, జులై 2021, గురువారం

మంత్రమంటే నాకుతెలిసిన మంత్రము నీనామమే

మంత్రమంటే నాకుతెలిసిన మంత్రము నీనామమే
తంత్రమంటే నాకుతెలిసిన తంత్రము నీధ్యానమే

రా యను బీజాక్షరమునకు రాజసంబను నర్ధము
మా యను బీజాక్షరమునకు మంచితనమను నర్ధము
హాయిగా నే చెప్పుకొందు నంతకంటెను తెలియక
మాయనే నీరాజసంబును మంచితనమును గెలుచుగా

చదువలేదు శాస్త్ర సంపుటి చదువలేదు గురువువద్ధ
చదివినట్టి కూటివిద్రలు జ్ఞాన మిచ్చినదియు లేదు
సదయ నీయందమితభక్తి జన్మసిధ్ధం బనగ నమ‌రె
విదులు మంత్రమనుచు చెప్పగవింటి నీనామమును గూర్చి

పరమమంత్రము రామమంత్రమె ప్రాణమంత్ర మగుచునుండ
మ‌రల నితరమంత్రములకై మనసుపడుట వెఱ్ఱితనము
హరిహరీ యటువంటి యూహయె ఆత్మకంటదు రామచంద్ర
వరద భక్తవత్సలా నాబ్రతుకు సర్వము రామమయము

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.