6, జులై 2021, మంగళవారం

జానకీరమణ నిన్ను చక్కగా కొలువక

జానకీరమణ నిన్ను చక్కగా కొలువక
మానవుడిక తరించగా మార్గమేది

నీనామము ప్రేమతోడ నిరతమును పలుకనిచో
మానవుడు విరాగియగు మాటకలదె
మానవుడగు దానవుడగు మనసార పలుకునెడ
నీనామము పండించును వానిబ్రతుకు

నీసేవను నిష్ఠతోడ నిరతమును చేయనిచో
చేసి ధనపిశాచిసేవ చెడును కాక
వీసమంతైన వాడు వెంటబెట్టుక పోడు
దాసుడైన నీకు బ్రతుకు ధన్యమగును

నీనామము నీరూపము నీచరితము కాక
మానవునకు చాల ముఖ్యమైనది కలదె
హీనుడగుచు నిహసుఖముల కెగబడుట మాని
తాను నీమఱువుసొచ్చిన తరియించును