9, జులై 2021, శుక్రవారం

ఘటమేదైనను గంగాజలమును..

ఘటమేదైనను గంగాజలమును గంగాజలమని యందురుగా
పటమేదైనను కట్టినవానిని వానిగనే గ్రహియింతురుగా

కుమ్మరిసారెకు లోబడి మృత్తిక కొనియెడు వివిధస్వరూపములం
దిమ్ముగ లోకులు మృత్తిక నెట్టుల నీక్షీంచెదరో యట్టులనే
యిమ్మహి వివిధోపాధుల నొదుగుచు నీశ్వర నీసంకల్ఫముచేతన్
నెమ్మది ననునే నెఱిగి చరింతుర నిక్కముగా శ్రీరామవిభో

బహుజన్మంబులు నాకగు గాక యవశ్యము నీకై యెత్తెదను
బహురూపంబులు నాకగు గాక యవశ్యము దాల్చి చరించెదను
బహునటనల నే నుండెద గాక యవశ్యము నిను మెప్పించెదను
విహరింతునురా విశ్వమయా నీ వేడుక తీ‌రగ నీభువిలో

పరిపరి విధముల బహురూపంబుల హరి నే నెట్టుల నుండినను
పరమాత్మా నిను మరువక యుందును మరచి చరించుట నావశమే
కరుణాకర యిది నీ ఘనలీలాకల్పిత నాటకమే కదరా
హరి నీవాడనె యన్ని యుపాధుల పరమసత్యముగ నో రామా