23, జులై 2021, శుక్రవారం

సామాన్యమా యేమి రాముని విక్రమము

సామాన్యమా యేమి రాముని విక్రమము
ప్రేమతో మునులెల్ల వేనోళ్ళ పొగడునది

పదునాలుగువేల మంది దనుజులను దునుమాడ
నిదిగో యీ మూడుఘడియ లించుక హెచ్చాయె
ఆదిగో ఆ గహలోపల అమ్మ సీతమ్మ నునిచి
వదినకు కాపున్న తమ్ముడు ముదమున జూడ

అతివిక్రము డైన హరికి అతిసులభమాయ నిది
ప్రతిలేని బాణపరంపరను రిపుల గూల్చి
సతికి మోదమును గూర్చి సంతోషమును పొంది
అతివ మునుల కికమీదట నభయమ్మని పలికె

మ‌రలమరల కౌగలించి మహనీయచరిత సీత
పరమహర్షమును పొంది పరవశించుచు
నిరుపమాన పరాక్రమ నీరేజదళనేత్ర
హరివి నీవనచు తోచు నని రాముని మెచ్చె

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.