6, జులై 2021, మంగళవారం

వేడండీ వేడండీ

వేడండీ వేడండీ వీడే రాముడు
వేడుకతోవరములిచ్చు వాడు దేవుడు

సందేహపరులకును సంకోచపరులకును
వందనం బని మీరు  వచ్చిమ్రొక్కండి
ఇందిరారమణుడే ఈరామచంద్రుడై
యందరి మేలు కోరి యవతరించినాడు

ముందటి జన్మమందు మ్రొక్కినారో లేదో
యెందుకిపు డామాట యిపుడు వేడండి
అందరి వాడండి అడుగువారి కోరిక
ముందే గమనించును ముచ్చటదీర్చును

కందర్పకోటికోటిసుందరు డితడండి
వందారుభక్తజనమందారు డితడండి
వందనీయు డితడండి బ్రహ్మాదులకునైన
వందన మన్నంతనే వరమిచ్చునండి

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.