24, జులై 2021, శనివారం

నిన్ను మరచి యొక్కనా డున్నానా చెప్పవయ్య

నిన్ను మరచి యొక్కనా డున్నానా చెప్పవయ్య
చిన్నచిన్న తప్పులు నీవెన్నవచ్ఛునా

ఎన్నేనియు విధములుగ నిన్ను నేను పొగడుచుండ
సన్నుతాంగ చెవిటినటన శాయవచ్చునా
కన్నులార నిన్నుచూడ కాచుకొని నేనిచ్చట
నున్న వేళ నీవు డాగి యుండవచ్చునా

తిన్నగాను నిన్నుపొగడ తెలివి నాకు చాలకున్న
అన్పన్నా తప్పులెన్ని యలుగవచ్చునా
నిన్నుపొగడ బ్రహ్మ వశమె నేనెంతటి వాడనన్న
చిన్నమాట నీకు మనవి చేయవచ్చునా

ధరమీదను రాకాసులదండు పెరుగుచున్నదని
మరలమరల మనవిచేయ మరువవచ్చునా
పరమపురుష నీదు కీర్తి పతాకము నెత్తిపట్టి
పరుగుపెట్టు నన్ను తప్పు పట్టవచ్చునా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.