30, జులై 2021, శుక్రవారం

హరికన్నను పెద్దచుట్ట మవనిని గలడా మనకు హరిసేవకు మించినపని యవనిని గలదా

హరికన్నను పెద్దచుట్ట మవనిని గలడా మనకు
హరిసేవకు మించినపని యవనిని గలదా

పెద్దవాడు మనసులోన పెద్దవాడు మహిమలోన
పెద్దవాడు సురలలోన పెద్దవాడు సృష్టిలోన
పెద్దవాడు కరుణలోన వీని కన్నను
పెద్దవాడు లేడు మనకు పెద్ధచుట్టము వీడు

అంత పెద్దవాడయ్యు ననవరతము వీడు మన
చెంతనే యుండువాడు చిత్తశుధ్ధి కలిగి మీరు
చింతించిన చాలును కడు శీఘ్రము గాను
చింతలన్నియు దీర్చి హరి చెలగు పెద్దచుట్టమై

కొందరేమొ రాముడనుచు కూరిమితో కొలువగను
కొందరేమొ కృష్ణుడనుచు గొప్పలీల లెన్నగను
కొందరు గోవిందుడని కొనియాడగ ని
ట్లందరి  సేవలను పొందు హరియె  పెద్దచుట్ఞము


2 కామెంట్‌లు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.