16, జులై 2021, శుక్రవారం

కోరిన విచ్చేనే రాముడు కొల్లగ నిచ్చేనే

కోరిన విచ్చేనే రాముడు కొల్లగ నిచ్చేనే ఇక
కోరిన విచ్చే రాముని నీవు కొలువగ రావలెనే
 
తెలతెలవారక ముందే వత్తురు దేవతలందరు రామునకు
పలువిధములుగా సుప్రభాతములు పాడుచు వేడుకతో
నళినదళాకుక్షుడు మేలుకొని హరి నవ్వుచు పలుకరించగను
కళకళలాడెడు మోములతోడ కదలిపోదురట విన్నావా

వచ్చే భక్తులు పోయే భక్తులు పట్టాభిరాముని యింటి ముంగిట
ముచ్చటగా కనుగొనవే రాముని హెచ్చిన వైభవము
ఇచ్చేరే వా రుపాయనములను ఎంతో ప్రేమతొ రామునకు
పుచ్చుకొనేరే వరము లనేకము భూరికృపాళు వీయగను

సీతారాములు కృపాస్వరూపులు చేరినవారిల కందరకు
ప్రీతిగ నిత్తురు కోరెడు వన్నియు వేడక ముందుగనే
ఆతలిదండ్రుల చూపులె సంపద లన్నివేళల కురియగను
భూతలవాసులు కేమిక వలయును పోయి చూచి రావే


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.