4, జులై 2021, ఆదివారం

దరిసెనమిఛ్చి నన్ను దయజూడర

దరిసెనమిచ్చి నన్ను దయజూడర నీవు
కరుణగలాడవు కాదటర

శ్రీరామచంద్ర యని సీతాపతీ యని
ఓ రాఘవా  జగదోధ్ధారకా యని
నారాయణా యని నాకన్నతండ్రి యని
పేరుపేరున నిన్ను పిలచినా పలుకవు

నారక మనునది వేరెక్కడున్నది
ఘోరాతిఘోరసంసారమె నరకము
రారా దరిసెన మీర రామచంద్రా కన్ను
లారా నిన్ను చూడ తీరు సంసారము

నారాయణా నీవు నన్ను రక్షించవో
వేరెవ్వరున్నారు వేడుకొనగ నాకు
రారా కలలో నైన శ్రీరామ కనుపించి
భూరికృపాళుడన్న పేరు నిలుపుకొనర