21, జులై 2021, బుధవారం

నామనసు నీదాయె నామమత నీదాయె

నామనసు నీదాయె నామమత నీదాయె 
నామాట నాపాట నాబ్రతుకె నీదాయె

భక్తుడేమి పలుకవచ్చు పలుకనే రాదో
భక్తుడేమి పాడవచ్చు పాడరాదో
యుక్తాయుక్తముల నుర్వి నుండువారికి
ముక్తిప్రద సుద్దులాడ బోలునటయ్య

రేపుమాపు నీపాటల కాపద వచ్చుచో
నీపాట్లు నీవే పడి నిలుపుకోరా
కోప మేమిటయ్య నాకు కోదండరామ నా
కోపతాపములును నీ‌కొఱకే కాదా

రామయ్య నీది కాని దేమున్నదయ్య
కామించి నాదన నీ భూమి పైన 
ఏమిటి కిదియది యన నే నేమందు నయ్య
ఏమన్న మానిన నది నీ యిఛ్చయే గాక
 
 

2 కామెంట్‌లు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.