15, జులై 2021, గురువారం

శ్రీరఘురామా వందనము

శ్రీరఘురామా వందనము సీతారామా వందనము
కారుణ్యాలయ వందనము కైవల్యప్రద వందనము

నారాయణ హరి వందనము నారకమోచన వందనము
తారకనామా వందనము దశరథనందన వందనము
నేరములెంచక మాకెపుడు ధారాళముగా వరములను
కూరిమితోడను కురిపించే గోవిందా యిదె వందనము

భూవలయాధిప వందనము భూరిప్రతాప వందనము
రావణసంహర వందనము రాజలలామా వందనము
భావించగ బ్రహ్మాదులకు వశము కాదుగా నీలీల
దేవదేవ హరి వందనము దివ్య ప్రభావా వందనము

కామారినుతా వందనము కలుషవిదూరా వందనము
రామచంద్ర హరి వందనము రాజీవానన వందనము
ప్రేమామృతమును భక్తులకు విరివిగ పంచే దేవుడా
శ్రీమదయోధ్యారాజేంద్రా శేషశయన యిదె వందనము