20, జులై 2021, మంగళవారం

తారకనామము చేయండీ యిక నారకభయమును వీడండీ

తారకనామము చేయండీ యిక నారకభయమును వీడండీ
కూరిమి కలిగి చేయండీ వైకుంఠధామమును చేరండీ

నేరుపు మీఱగ నరనారీజనులారా చక్కగ చేయండీ
ధారాళముగా వరములిచ్చు హరి దయనే మీరు పొందండీ
నారాయణుడే శ్రీరాముడని నమ్మి నామమును చేయండి
శ్రీరామనామము చేసినచో హరి చేయందించును నమ్మండీ

సిరులొసగెడి మంత్రముల కాదని హరిమంత్రమునే చేయండీ
హరిమంత్రము కానట్టి మంత్రమున నభయము కలుగుట లేదండీ
హరిమంత్రము మీకబ్బినచో నిక సిరులకు కొరతలు రావండీ
మరువక మనసా రామరామ యని మహధ్భాగ్యమే పొందండీ

భక్తవత్సలుడు రాముని నామము పరమపావనము తెలియండీ
ముక్తి సులభముగ దొ‌రకు నుపాయము భూజనులకీదే చూడండీ
రక్తిమీఱగ రామనామసుధ శక్తికొలదిగా త్రాగండీ
యుక్తి వేరోకటి లేదండీ  హరిభక్తులె తరియించేరండీ
1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.