12, జులై 2021, సోమవారం

నిన్నే నమ్మితి రామా న న్నెన్నడు విడువకు రామా

నిన్నే నమ్మితి రామా  న న్నెన్నడు విడువకు రామా
సన్నుతి జేసెద రామా నను చల్లగ చూడుము రామా

సురగణవందిత రామా భాసురగణ శోభిత రామా
కరుణాకర శ్రీరామా హరి పరమపావన నామా

ధరణీతనయాకామా హరి నిరుపమసద్గుణ ధామా
మరువకు నను శ్రీరామా నీ‌కరుణయె చాలును రామా

నీలగగనఘనశ్యామా హరి నీ వాడను శ్రీరామా
నేలకు నింగికి రామా నను నీవిక త్రిప్పకు రామా

మాయామానుషవేష హరి మంజులమృదుసంభాష
శ్రీయుతమంగళమూర్తీ హరి చిన్మయ స్థిరసత్కీర్తీ

రవికులతిలకా రామా ఆరాటము లణచుము రామా
భవభయవారక రామా నీపదములె చాలును రామా