30, జులై 2021, శుక్రవారం

నేనెవరిని పొగడుదురా నిన్నుకాక

నేనెవరిని పొగడుదురా నిన్నుకాక నా
కైనను బ్రహ్మ కైన నాధార మీవే

తెలిసీతెలియక మానవులను నేను పొగిడితే
కలిగే లాభాలు నాల్గుకాసులే కాదా
ఇల గల్గు స్వల్పసిరుల నేమి తోడ్కొని పోదు
తెలివిగలిగి నినుపొగడి తీరుదు కాక

తెలిసీతెలియక నేను దేవతలను పొగడితే
కలిగే సంపదలు బంధకారణములు కావా
తెలిసితెలిసి బంధాలు తగిలించుకొందునా
తెలివిగలిగి యుందునా దేవదేవ

తెలివిచాలక నీదు దివ్యతత్త్వము నెన్న
పలుకులు వెదకుదును గాక పరమపురుష రామ
తెలివిగలిగి నీనామము కలనైన విడువనే
పలుకుదునా యొరుల సంభావించి నేను