20, జులై 2021, మంగళవారం

జగములనేలే రఘుపతి నీదయ చాలును చాలును చాలునురా

జగములనేలే రఘుపతి నీదయ చాలును చాలును చాలునురా
తగదిక నరులను కొలుచుట నాకని తలచెద తలచెద తలచెదరా

కరుణయెలేని నరులను కొలుచుట కష్టము కష్టము కష్టమురా
పరులను కొలుచుచు బ్రతికెడు వానికి బాధలు బాధలు బాధలెగా
పరులబాధలు నరులకెన్నడును ఫట్టవు పట్టవు పట్టవురా
హరి కరుణామయ నీచరణములే శరణము శరణము శరణమురా

ధారుణి నరునకు మారుని స్నేహము తగనిది తగనిది తగనిదిరా
దారుణమగు ధనమోహము నరునకు తగనిది తగనిది తగనిదిరా
దారాసుతులను గూర్చి మోహమును తగనిది తగనిది తగనిదిరా
తారకరామా నీపదసేవయె తగినది తగినది తగినదిరా

హరి నామదిలో నిలువుము నీవని అడిగెద అడిగెద అడిగెదరా
అరిషడ్వర్గముపై విజయమునే అడిగెద అడిగెద అడిగెదరా
హరి యిక ధరపై పుట్టువు వలదని అడిగెద ఆడిగెద అడిగెదరా
అరుదగు ఆవరమొకటే యిమ్మని అడిగెద అడిగెద అడిగెదరా

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.