4, జులై 2021, ఆదివారం

ఏమయ్యా రామయ్యా ఏమని నిను పొగడుదురా

ఏమయ్యా రామయ్యా ఏమని నిను పొగడుదురా
ఏమి మధురనామమురా యీశ్వర నీది

కామితార్ధవరదుడ ఘనుడా వైకుంఠ
ధాముడా శ్రీహరి దయాలవాల
భూమికి దిగినావు మాపుణ్యముపండి
మామనసుల నిండినావు మాభాగ్యము

రామ రామ యనినచాలు రక్షించబడుదురని
భూమిని చాటించినట్టి పుణ్యచరిత్ర
నీమహిమ చాటినారు నీరేజాసనుడును
కామారియు నింక పొగడగా నాతరమా

రామ హరే కృష్ణ హరే రాజీవనయన హరే
పామరుడను నన్ను కావవయ్యా శ్రీహరీ
నీమహిమ పొగడలేను నిన్ను ధ్యానించలేనని
నామభజన చేయగలను నన్నేలరా
1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.