17, జులై 2021, శనివారం

మరువక శ్రీరామనామము మనసా చేయగదే భవ తరణోపాయ మిదేనటే తప్పక చేయగదే

మరువక శ్రీరామనామము మనసా చేయగదే భవ
తరణోపాయ మిదేనటే తప్పక చేయగదే

హరబ్రహ్మాదులకో మనసా ఆతని నామముపై
మరిమరి మక్కువ యని యందురటే మనసా తెలియగదే

సురకోటికిని సుఖములనిచ్చే సొంపగు నామమటే
నరకోటికి భవతారక మటనే విరివిగ చేయగదే

మానక చేసెడువారెవరైనా మరలా పుట్టరటే
జానకిరాముని నామముపై కడు శ్రధ్ధను చూపగదే

మానవజన్మము నెత్తియు రాముని మరచుట తప్పుగదే
జ్ఞానముకలిగిన తారకనామము చక్కగ చేయగదే

భ్రమలడగించే సులభోపాయము రాముని నామమటే
సమవర్తిని బహుదూరము తరిమే చక్కని మంత్రమటే

సుమధురనామము సుందరనామము ఉమామహేశ్వరుడే
కమలాధీశుని నామకోటిలో ఘనముగ నెన్నెగదే