9, జులై 2021, శుక్రవారం

ఇదియే సత్యము కాదటయ్యా ఇంకేమున్నదిలే

ఇదియే సత్యము కాదటయ్యా ఇంకే మున్నదిలే
కుదురుగ దీని నెఱింగినపిదప కొఱతే మున్నదిలే

ఇది నాతనువని యేమున్నదయా ఇది నీసేవకు పరికరమే
ఇది నాధనమని యేమున్నదయా ఇది నీవిచ్చిన కానుకయే
ఇది నా తలపని యేమున్నదయా హృదయములో నీవేగా
ఇది నాబ్రతుకని యేమున్నదయా ఇది నీ సేవల కంకితమే

ఇది నాసుఖమని యేమున్నదయా ఇది నీలీలా విలాసమే
అది దుఃఖంబని యేమున్నదయా అది నీ లీలా విలాసమే
ఇది మంచిదని యేమున్నదయా యేదైనను నీ విలాసమే
ఇది చెడ్డదని యేమున్నదయా యేదైనను నీ విలాసమే

ఇది నాపలుకని యేమున్నదయా యిటుపలికించున దీవేలే
అది యిదియని యేమున్నదయా అన్నియు నీకళలే
ఇది నాదని యేమున్నదయా యేదయినను నీవిచ్చినదే
సదయా శ్రీరఘురామా ఇటులే చక్కగ సాగిపోదమురా

 


1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.