25, జులై 2021, ఆదివారం

నోరారగ హరి శ్రీరఘురాముని కీరితి పాడరె మీరిపుడు

నోరారగ హరి శ్రీరఘురాముని
కీరితి పాడరె మీరిపుడు

పాడరె విబుధులు పదుగురు మెచ్చగ
వేడుక జనులెల్ల వినగను
వేడుచు మీరిటు పాడుట కనుగొని
నేడు రాముడు కృప జూడగను

సంతోషముగా చక్కగ పాడండి
చింతలు విడచి చిన్మయుని
సంతయకరుణాస్వాంతుని బహు మతి
మంతులు సురలును మరిమరి మెచ్చగ

పరమమంత్రములు హ‌రికీర్తనలు
పరిపరివిధముల పాడుటచే
నరులు పొందెదరు మరిభవనాశము
హరిసాన్నిధ్యము తిరమగును