6, జులై 2021, మంగళవారం

పనవుచున్నాను నేను ధనముల కొఱకు

పనవుచున్నాను నేను ధనముల కొఱకు
వినుము నాస్థితి నాకే వింతగ దోచు

కొంచెపుసరు కనవచ్చు కొరగాని దనవచ్చు
మంచిదికా దనవచ్చు మనసులే దనవచ్చు
కొంచుబో మనవచ్చు గొప్పగొప్పగ
ఎంచి యద్దానికై యెంతో తహతహ

పసిడి చెడ్డదనవచ్చు పాపహేతు వనవచ్చు
విసమువంటి దనవచ్చు వేడరాని దనవచ్చు
ఉసురుతీయు ననవచ్చు నొప్పుమాటల
అసలు దానికే కదా యయ్యో తహతహ

మాని యట్టి తహతహలు మానవోత్తమ రామ
నేను నీయందు బుధ్ధి నిలిపి యుంద మంటె
దానికేమి నీతలపే కానిమ్మనదు
మానరాని సంసారమాయామోహము