26, జులై 2021, సోమవారం

మనకు రామభజన చాల మంచిదనుచు చెప్పినారు

మనకు రామభజన చాల మంచిదనుచు చెప్పినారు
కనుక విదులు చెప్పినట్లు మనసా చేయవే

శౌరినెంచి సర్వాపన్నివారినెంచి రామచంద్రు
కారుణ్యాలయునకు భజన కడగి చేయవే
ధారాళముగ నెల్లప్పుడును దాశరథి సద్గుణములు
కూరిమితో నుగ్గడించి కొనవె సద్గతి

పనికిమాలి నట్టి సిరుల వెనుక నీవు పరుగులెత్తి
మనసా భంగపడ నేటికి మంచివాడగు
ఇనకులేశ్వరుని మరువ కెల్లప్పుడును భజనచేసి
వినుతశీల కైవల్యమే విలుచుకొనవే

హరి తారకనామమెపుడు నాడుచుండ నాల్కపైప
పరమభాగవతుడు వానివంక జూడగా
నరకభటు లశక్తులు వాడు నారాయణుని కృపచేత
పరమపదము పొందుమాట పరమసత్యమే