4, జులై 2021, ఆదివారం

మంచిచెడ్డ లెఱుగునా మన రాముడు శిశువమ్మా

మంచిచెడ్డ లెఱుగునా మన రాముడు శిశువమ్మా
కొంచె మోర్చుకోవమ్మా కోపమేలమ్మా

రాముని బొమ్మవిల్లు లాగికొన జూచితివి
రాముడు కోపించి నీ మోమున విసిరె
సామెత చెప్పిట్లు సరికిసరిగ చెల్లాయె
ఈమాత్రమునకు కోప మెందు కమ్మ

ఆసపెట్టి యొకబొమ్మ నీవందించ వేఱొకటి
మోసమునకు కినిసి వాడు మొత్తెను నిన్ను
చేసుకున్నవారికి చేసుకున్నంతాయె
దోసమెంచ నేల వాడు దుడు కటంచు

భరతు డిట్లు చేయడే వంటి మాట లెందుకు
భరతుడైన రాముడైన పసిబాలురే
సురలు కూడ పొగడగ నరపాలుని బిడ్డలను
మురిపెముగ చూడమే ముందుముందు


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.