30, జులై 2021, శుక్రవారం

రామ రణభీకరా రమ్యసుగుణాకరా

రామ రణభీకరా రమ్యసుగుణాకరా
ధీవర సీతావరా కావరా దయాకరా

సకలనిగమములును పొగడు శాశ్వతుడవు నీవురా
సకలమునీంద్రులును కొలుచు చక్రధరుడ వీవురా
సకలభూతకోటిహృదయసంస్థితుడవు నీవురా
సకలభక్తజనసన్నుత శాంతమూర్తి వీవురా

సకలసుజనులకును మేలు సలుపువాడ వీవురా
సకలదానవులను పట్టి చంపువాడ వీవురా
సకలలోకవంద్యుడ వగు చక్రవర్తి వీవురా
సకలతాపహరుడ వగు సాకేతరాముడా

సకలలోకములను కనుసన్నలలో నడుపుచు
సకలభక్తులకును సర్వసౌఖ్యముల నొసగుచు
వికచోత్పలనేత్ర నీవు విరాజిల్లుచుందువే
ఒకనాడును నిన్ను పొగడకుండ నేనుందునా

2 కామెంట్‌లు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.